"జనం తమను తాము అలరించుకోవడానికి ఇప్పడు టీవీలు, సెల్ ఫోన్‌లు ఉన్నాయి," తన ఢోలక్ రింగులను బిగిస్తూ అన్నారు ముస్లిమ్ ఖలీఫా.
ముస్లిమ్ ఖలీఫా 12వ శతాబ్దపు యోధులైన ఆల్హా, ఉదల్‌ల (రుదల్ అని కూడా అంటారు) పురాణ జానపద కథలను పాడతారు. బిహార్‌లోని సమస్తీపుర్ జిల్లాకు చెందిన జానపద గాయకుడు, ఢోలక్ వాద్యగాడు అయిన ఈయన దాదాపు ఐదు దశాబ్దాలుగా దీన్ని గానం చేస్తున్నారు. పదునుగానూ వినసొంపుగానూ ఉన్న అతని స్వరం చాలాకాలంగా పాడుతోన్న ఒడుపును తెలియచేస్తోంది.
వరి, గోధుమ, మొక్కజొన్న పంటలు కోసే ఏప్రిల్-మే నెలల్లో, ఆయన తన ఢోలక్ తో పొలాల వెంట తిరుగుతూ వ్యవసాయపు పనుల్లో మునిగివున్న జనం కోసం పాడుతుంటారు. సుమారు రెండు గంటల ప్రదర్శనకు ప్రతిఫలంగా ఆయనకు కొత్తగా పండించిన పంట నుంచి 10 కిలోల ధాన్యం లభిస్తుంది. "ఈ మూడు పంటల కోతలకు ఒక నెల రోజుల కాలం పడుతుంది, కాబట్టి నేను ఆ నెలంతా పొలాల్లోనే గడుపుతాను," అని ఆయన చెప్పారు. పెళ్ళిళ్ళ కాలంలో పెరిగిపోయే గిరాకీ వలన ఆయన ఆ మూడు నెలల్లో రూ.10,000-15,000 దాకా సంపాదిస్తారు.
52 భాగాలుగా వర్ణించే విస్తారమైన ఈ పాటను పూర్తిగా చెప్పడానికి చాలా రోజులు పడుతుంది, నిబద్ధతతో పాటలో లీనమయ్యే ప్రేక్షకులను ఈ పాట కోరుకుంటుంది. "అయితే, ఈ రోజుల్లో ఎవరు అన్ని రోజులు వింటారు?" అని ఖలీఫా ప్రశ్నించారు. ఖాలిస్‌పుర్ గ్రామానికి చెందిన ఈ 60 ఏళ్ళ మనిషి ఇప్పుడు పాట ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడాన్ని చూస్తున్నారు. ఆయన స్వంత పిల్లలు సైతం ఆల్హా-ఉదల్‌పై ఆసక్తి చూపించడం లేదని ఆయన విచారిస్తున్నారు.
ఖలీఫా ఇస్లామ్‌ను అనుసరిస్తారు కానీ నట్ సముదాయానికి చెందినవారు. ఇది రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులంగా జాబితా అయివుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నట్ సముదాయపు జనాభా 58,819 ఉంది, కానీ "మీరు 10-20 గ్రామాలకు ఇలాంటి ఆల్హా-ఉదల్ గాయకులను ఒకరిద్దరిని మాత్రమే చూడగలరు," అని మే 2023లో మాతో మాట్లాడుతూ ఖలీఫా చెప్పారు
ఖాలిస్‌పుర్ గ్రామంలోని అతని ఇంటిలోని గడ్డితో కట్టిన గోడలపై ఒక ఢోలక్ వేలాడుతూ ఉంటుంది. ఒక చెక్క చౌకీ , కొన్ని వస్తువులు కనిపిస్తాయి. ఖలీఫా పూర్వీకులైన ఆరు తరాలవారు ఇదే గుడిసెలో నివసించారు; ఇప్పుడాయన తన భార్య మోమినాతో కలిసి ఇక్కడ నివసిస్తున్నారు. ఆల్హా-ఉదల్ పాటను పాడమని మేం ఖలీఫాను అడిగాం, కానీ సాయంత్రాలు పాడేందుకు అనుకూల సమయాలు కావంటూ ఆయన మరుసటి రోజు ఉదయం తిరిగి రమ్మని మమ్మల్ని అభ్యర్థించారు. మరుసటి రోజు, తన మీసాలకు రంగు వేయడం పూర్తి చేశాక, ఆయన తన ఢోలక్ తో చౌకీ పై కూర్చున్నారు.
ఢోలక్ కు రెండు వైపులా కట్టిన తాడును బిగించడానికి ఆయనకు ఐదు నిమిషాల సమయం పట్టింది. అదయ్యాక, ఇత్తడి రింగులను తాడుకు అటు నుంచి ఇటు కదిలించి, శబ్దాన్ని పరీక్షించడానికి వాయిద్యంపై తన వేళ్ళతో వాయించారు. తరువాత ఐదు నిమిషాల పాటు ఆయన ఎలుగెత్తి పాడిన ఆల్హా-ఉదల్ వీరగానం మా చెవులకు విందు చేసింది. ఈ పాట బేత్వా నది, యుద్ధం, మహోబాకు చెందిన ఇద్దరు సోదరుల వీరోచిత విన్యాసాల మీదుగా సాగుతుంది. ఆల్హా- ఉదల్ వీరగాథను పాడటానికి తాను 10 కోసుల (దాదాపు 31 కిలోమీటర్లు) దూరం వెళ్ళిన రోజులు ఉన్నాయని ఆయన మాతో అన్నారు.
పాటను పూర్తిచేసిన తర్వాత ఖలీఫా ఇత్తడి రింగులను కిందికి దించటంతో ఢోలక్ చర్మపు పొర ముడుచుకుపోయింది. ఆయన దానిని తిరిగి గోడకు వేలాడదీశారు. "తోలును వదులు చేయకపోతే అది పాడైపోతుంది. మెరుపులకు, వర్షానికి ఢోలక్ పేలిపోతుంది," అని అతను చెప్పారు. "అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు."
సుమారు 40 సంవత్సరాల వయస్సున్న ఆ ఢోలక్ చట్రాన్ని చెక్కతో తయారుచేశారు. ప్రతి ఆరు నెలలకోసారి తాళ్ళు, తోలు మార్చినప్పటికీ, పరికరం నిర్మాణం మాత్రం అలాగే ఉంది. “ ఢోలక్ చట్రం అత్యుత్తమంగా ఉంది. చెదపురుగులు పట్టకుండా ఉండేందుకు ఆవ నూనె వేస్తాం.”
బిదేసియా నాచ్ కార్యక్రమాలకు మంచి గిరాకీ ఉన్న గడచిన 20-30 సంవత్సరాలను ఆల్హా-ఉదల్ గాయకులకు స్వర్ణయుగంగా ఆయన భావిస్తారు. "ఈ వీరోచిత గాథను వినడానికి భూస్వాములు మమ్మల్ని వారి ప్రాంతాలకు ఆహ్వానించేవారు."
52 భాగాలను వర్ణించే ఈ విస్తారమైన పాటను చెప్పడానికి చాలా రోజులు పడుతుంది. 'కానీ, ఈ రోజుల్లో అంతకాలం ఎవరు వింటారు?'
బిదేసియా , భోజ్‌పురి నాటక రచయిత దివంగత భిఖారీ ఠాకూర్ రచించిన ప్రసిద్ధ నాటకం. ఇది ఉపాధి కోసం ప్రజలు నగరాలకు వలస వెళ్ళడాన్ని వివరించే భోజ్‌పురి జానపద సంప్రదాయాలలో ఒకటి. ఈ కథలు నృత్య, గానాల రూపంలోకి అనువాదమయ్యాయి
ఖలీఫా తనలాంటి ఆల్హా-ఉదల్ గాయకులు భూస్వాముల నుండి గొప్ప ఆతిథ్యం పొందిన రోజులను గుర్తుచేసుకున్నారు. “పాటకు చాలా గిరాకీ ఉండేది. ఏడాది పొడవునా మాకు సమయం దొరికేది కాదు. ఎంతలా పాడేవాడినంటే, గొంతు నొప్పి వచ్చేది. చాలాసార్లు, నేను [భూస్వాముల] ఆహ్వానాన్ని తిరస్కరించవలసి వచ్చేది.“
*****
భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన వీరోచిత ఇతిహాసం ఆల్హా-ఉదల్. క్రీ.శ. 12వ శతాబ్దంలో ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని మహోబాను పాలించిన చందేల్ రాజు పరమాల్ సోదరులైన ఆల్హా, ఉదల్‌లు ఆ రాజ్యానికి సేనాధిపతులుగా పనిచేశారని, ది వరల్డ్ ఆఫ్ మ్యూజిక్ పత్రికలో కరీన్ షోమర్ రాసిన ఒక కథనం పేర్కొంది. మహోబా రక్షణ బాధ్యత వహించిన ఆల్హా-ఉదల్‌లు నిర్భయులైన నైపుణ్యం కలిగిన యోధులుగా ప్రసిద్ధి చెందారు. ఆల్హా-ఉదల్‌ల వీరగాథ మహోబా, దిల్లీ రాజ్యాల మధ్య జరిగిన గొప్ప యుద్ధంతో ముగుస్తుంది.
ఖలీఫా తన మూలాలు మహోబాలోనే ఉన్నాయని చెబుతారు. తన పూర్వీకులు మహోబా ప్రాంతానికి చెందినవారనీ, వారు అక్బర్ హయాంలో అక్కడి నుంచి పారిపోయివచ్చి బిహార్‌లో స్థిరపడ్డారనీ ఆయన చెప్పారు. తన పూర్వీకులు రాజ్‌పుత్ కులానికి చెందినవారని ఆయన అన్నారు. బిహార్ చేరుకున్న తరువాత, అతని పూర్వీకులు జీవనోపాధి కోసం ఆల్హా-ఉదల్ పాడటాన్ని కుటుంబ సంప్రదాయంగా చేపట్టారు. ఆ కళ వంశపారంపర్యంగా కొనసాగుతూ వచ్చింది.
తండ్రి సిరాజుల్ ఖలీఫా మరణించేటప్పటికి రెండేళ్ళ వయసున్న ఖలీఫాను అతని తల్లి పెంచి పెద్దచేసింది. "పెరిగి పెద్దవుతోన్న క్రమంలో, ఆల్హా-ఉదల్ పాడే గాయకుడు దొరికినప్పుడల్లా, నేను అతన్ని వినడానికి వెళ్ళేవాడిని," అని అతను వివరించారు. “ఏ పాటనైనా ఒక్కసారి విన్నాక గుర్తుపెట్టుకోగలగటం నాకు సరస్వతి ఇచ్చిన వరం. నాకు ఈ పాట [ఆల్హా-ఉదల్] మైకం కమ్మింది. వేరే పనిపై దృష్టి పెట్టలేకపోయాను.”
ఆ రోజుల్లో ఆయన తాను ' ఉస్తాద్ ' (గురువు) అని పిలిచే రెహమాన్ ఖలీఫా అనే గాయకుడిని కలిశారు. “నేను ఆయనతో కలిసి కార్యక్రమాలకు వెళ్తుండేవాడిని. ఆయనకు సహాయంగా ఉంటూ, ఆయన వస్తువులను మోసేవాడిని," అని ఖలీఫా గుర్తుచేసుకున్నారు. కొన్నిసార్లు రెహమాన్ అతనికి ఢోలక్ ఇచ్చి పాడమని అడిగేవారు. "నేను ఆయనతో ఉన్నప్పుడే ఆల్హా-ఉదల్ కథలోని 10-20 అధ్యాయాలు కంఠస్థం చేశాను."
ఖలీఫా తన విద్యను పూర్తి చేయలేదు, కానీ ఆయనకు చదువుపై అనాసక్తి ఏమీ లేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా ఒక రోజు ఒక ఉపాధ్యాయుడు అతడిని కొట్టాడు, దీంతో ఆయన బడికి పోవడం మానేశాడు. అయితే అది మంచికే జరిగింది.
"అప్పుడు నాకు ఏడెనిమిదేళ్ళు ఉంటాయి. నాకు చిన్నప్పటి నుండి మంచి గాత్రం ఉండటంతో బళ్ళో ఉపాధ్యాయులు నన్ను బాగా ఇష్టపడేవారు, తరచుగా పాడమని అడిగేవారు. ఒక రోజు నేను ప్రార్థన పాడుతూ ఒక తప్పు చేశాను. దాంతో ఒక ఉపాధ్యాయుడు నన్ను గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. నాకు కోపం వచ్చి బడికి వెళ్ళడం మానేశాను," అని ఖలీఫా చెప్పారు.
ముస్లిమ్ ఖలీఫా జీవితం దానికదే ఒక వీరగాథ. ఆల్హా-ఉదల్ పాటలు తనకు తెచ్చిన బహుమతులకు తాను కృతజ్ఞుడనని, అయితే కొంత విచారం ఉందని అతను చెప్పారు. పాటతో వచ్చిన డబ్బుతో ముగ్గురు పిల్లలను పెంచి పెద్దచేసి పెళ్ళిళ్ళు చేశానని, ఇకపై ఎంతమాత్రం పాడుతూ , ఢోలక్ వాయిస్తూ కుటుంబాన్ని పోషించలేనని ఆయన అన్నారు. ఆయనకిప్పుడు స్థానికంగా ఇళ్ళలో జరిగే కొన్ని కార్యక్రమాలకు మాత్రమే ఆహ్వానాలు వస్తున్నాయి. ఆ ప్రదర్శనకు రూ. 300-500 మాత్రమే ఆదాయం వస్తోంది.
ఏం ఆస్తి సంపాదించావని కొడుకు అడిగిన రోజున, ఖలీఫా గుండె బద్దలైంది. ఆ సంఘటనను వివరిస్తున్నప్పుడు ఆయన ముఖంలో విషాద ఛాయలు కనిపించాయి. “[నా కొడుకు] ప్రశ్న నన్ను ఆగి ఆలోచించేలా చేసింది. ఆల్హా-ఉదల్ పాడటం ద్వారా నేను నిజంగా డబ్బు ఆదా చేయలేకపోయానని గ్రహించాను. ఇల్లు కట్టుకోవడానికి చిన్న ముక్క భూమి కూడా కొనలేకపోయాను. ఎక్కడికెళ్ళినా ఎంతో గౌరవం లభించింది కానీ కడుపు నింపుకోవడానికి సరిపడా మాత్రమే డబ్బు దొరికింది.”
"నా కుటుంబం తరతరాలుగా ఇక్కడ నివసించింది, [కానీ] నా గుడిసె ఉన్న భూమి ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి చెందిన చెరువు ఒడ్డున ఉంది."
మంచి పచ్చబొట్టు కళాకారిణిగా పేరుమోసిన ఆయన భార్య, యాబై ఐదేళ్ళ మోమినా ప్రస్తుతం ఉబ్బసంతోనూ చెవుడుతోనూ బాధపడుతున్నారు. “అంతకుముందు మేం గ్రామాల వెంట ప్రయాణించేవాళ్ళం. నేను స్వయంగా నా చేతులతో పచ్చబొట్లు పొడిచేదాన్ని. ఇప్పుడు నా ఒంట్లో శక్తి లేదు. నన్ను నా భర్తే బ్రతికిస్తున్నాడు," అని ఆమె చెప్పారు.
ఖలీఫాకు వ్యక్తిగత కష్టాలను మించిన గొప్ప దుఃఖం ఉంది. యువతరానికి ఆల్హా-ఉదల్‌పై ఆసక్తి లేదనీ, తన తర్వాత ఈ కళారూపాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు తన కుటుంబంలో ఎవరూ లేరనీ ఆయన అర్థంచేసుకున్నారు.
“మా నాన్న, తాత, వారి పూర్వీకులు ఆల్హా-ఉదల్ మాత్రమే పాడేవారు. ఇప్పుడు నేను పాడుతున్నాను. కానీ నా కొడుకు దీన్ని ఇంకా నేర్చుకోలేదు. నా పిల్లలకు దీనిపై ఆసక్తి లేదు,” అని అతను విచారంగా చెప్పారు. “మేం పాటను పాడామంటే, మాకు అదంటే ప్రాణంగా ఉండేది కాబట్టి. కానీ ఈ తరం వారు దీని గురించి పట్టించుకోవడం లేదు.”
“అపట్లో సన్నాయి, తబలా వంటి వాయిద్యాలతో కూడిన ఖుర్దక్ బాజా ను పెళ్ళిళ్ళలో వాయించేవారు. ఆ తర్వాత డోళ్ళు, బాకాలు, సన్నాయి, కీబోర్డుల వంటి వాయిద్యాలను ఒకేసారి వాయించే ఆంగ్రేజీ బాజా దాన్ని భర్తీ చేసింది. అప్పుడు ట్రాలీ ఉండేది, దానిపై నిల్చొని స్థానిక గాయకులు అంగ్రేజీ బాజా సంగీత కచేరీలో పాడేవారు. ఇప్పుడు మార్కెట్‌ను డిజె శాసిస్తోంది. ఇతర వాయిద్యాలన్నీ వాడుకలో లేకుండా పోయాయి," అని ఖలీఫా చెప్పారు.
"నేను పోయాక, [నా కుటుంబంలో] ఈ కళ జాడలేమీ ఉండవనే ఆలోచన నన్ను చాలా బాధిస్తోంది," అన్నారాయన.
ఈ కథనానికి రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల కోసం పోరాడుతూ జీవితాన్ని గడిపిన బిహార్‌కు చెందిన ట్రేడ్ యూనియన్ నాయకుడి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన ఫెలోషిప్ మద్దతు ఉంది.
అనువాదం: పి. పావని