ఐదవ తరగతి చదువుతున్నప్పుడు, అంతవరకూ అబ్బాయిగా పెరిగిన రమ్య, తనను తాను అమ్మాయిగా గుర్తించటం మొదలెట్టింది.
“(మాధ్యమిక) పాఠశాలలో, నేను షార్టులు ధరించాల్సి వచ్చేది. అప్పుడు నా తొడలు కనిపించేవి. దాంతో, అబ్బాయిలతో కలిసి కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించేది,” ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ముప్పయ్యో వడిలో ఉన్న రమ్య ఎరుపు రంగు చీర ధరించి, పొడవుగా పెంచుకున్న జుట్టుతో స్త్రీగా తన గుర్తింపును హత్తుకున్నారు.
చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ పట్టణంలో, ఒక చిన్న అమ్మన్ (దేవత) ఆలయాన్ని రమ్య నిర్వహిస్తున్నారు. ఆమె తల్లి వెంగమ్మ ఆమె పక్కనే నేలపై కూర్చొనివున్నారు. “ఎదుగుతున్నప్పుడు అతను (రమ్యని చూపిస్తూ) చురీదార్ (స్త్రీలు ధరించే దుస్తులు), దావణి (ఓణీ), కమ్మల్ (చెవి దుద్దులు) ధరించడానికి ఇష్టపడేవాడు. అబ్బాయిలా ప్రవర్తించమని చెప్పే ప్రయత్నాలు చేశాం, కానీ అతను ఇలా ఉండడానికే ఇష్టపడ్డాడు,” రమ్య తల్లి, 56 ఏళ్ళ వెంగమ్మ అన్నారు.
ఆ సమయానికి కన్నియమ్మ దేవత ఆలయాన్ని మూసివేయడంతో, అక్కడ పరుచుకున్న నిశ్శబ్దం మా ఈ సంభాషణ స్వేచ్ఛగా కొనసాగేందుకు సహాయం చేసింది. ఈ తల్లీకూతుళ్ళలాగే, ఇరులర్ సముదాయంవారు కన్నియమ్మ దేవతను పూజించడానికి ఇక్కడకు పగటివేళల్లో వస్తుంటారు.
ఇరులర్ వాడలో పెరిగిన రమ్య, నలుగురు తోబుట్టువులలో ఒకరు. తమిళనాడులో జాబితా చేసివున్న ఆరు ప్రత్యేకించి హానికిగురయ్యే ఆదివాసీ సమూహాలలో (PVTGలు) ఇరులర్లు కూడా ఒకరు. తమ సముదాయంలోని చాలామందిలాగే రమ్య తల్లిదండ్రులు కూడా పొలాల్లో, నిర్మాణ స్థలాల్లో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పనిప్రదేశాలలో కాలానుగుణంగా కూలీ పనులు చేస్తూ, రోజుకు రూ.250 నుండి 300 వరకు సంపాదిస్తున్నారు.
“ఆ రోజుల్లో ఎవరికీ తిరునంగైల (ట్రాన్స్ మహిళకు తమిళ పదం) గురించి తెలియదు. దాంతో, నేను ఇంటి నుండి బయటకి వెళ్ళినప్పుడల్లా, మా ఊరి జనం నా వెనుక గుసగులాడుకునేవారు," అన్నారు రమ్య. "వాళ్ళు 'అతను అబ్బాయిలాగా ఉన్నాడు కానీ అమ్మాయిలా ప్రవర్తిస్తాడు. ఇంతకీ ఇతను అబ్బాయా లేదా అమ్మాయా?’ అనేవారు. ఆ మాటలు నన్ను బాధపెట్టేవి.”























