బసంత్ బింద్ కొన్ని రోజుల కోసం మాత్రమే సెలవు తీసుకుని ఇంటికి వచ్చాడు. రోజువారి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న అతను, జహానాబాద్ జిల్లాలోని తన స్వగ్రామమైన సలేమాంపుర్‌కు కొన్ని గంటల ప్రయాణ దూరంలో ఉన్న పట్నాకు దగ్గరలోని పొలాలలో గత కొన్ని నెలలుగా పనిచేస్తున్నాడు.
సంక్రాంతి పండుగ అయిన మరుసటి రోజు, అంటే 2023 జనవరి 15న, అతడు తిరిగి తన పనిలో చేరవలసి ఉంది. ఆరోజు పక్క గ్రామమైన చంధరియా నుండి మరికొందరు కూలీలను జత చేసుకోవడానికి వెళ్ళాడు, తద్వారా వారంతా కలిసి బిహార్ రాజధానికి వెళ్ళవచ్చు - కూలీలు ఎక్కువగా ఉంటే పని దొరికే మార్గం సులభం అవుతుంది.
అతడు ఇతర కూలీలతో మాట్లాడుతూ ఉండగానే పోలీసు, ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారులతో కూడిన వాహనం ఒకటి అక్కడికి వచ్చి ఆగింది. వారు బిహార్ రాష్ట్ర మద్యపాన వ్యతిరేక మరియు ఎక్సైజ్ (సవరణ) చట్టం, 2016కు చెందిన మద్యపాన వ్యతిరేక దళానికి చెందినవారు. 'బిహార్ రాష్ట్రంలో సంపూర్ణంగా మద్యపాన, మత్తు పదార్థాల నిషేధాన్ని అమలుపరచటం, అమలుచేయడాన్ని ప్రోత్సహించటం…' వీరి పని.
పోలీసులను చూసి అక్కడున్నవారంతా పరిగెత్తడం మొదలుపెట్టారు. బసంత్ కూడా పరుగందుకున్నాడు అయితే "నా కాలులో స్టీల్ కడ్డీ ఉండటం వల్ల నేను వేగంగా పరిగెత్తలేను." దురదృష్టవశాత్తు మరో నిమిషంలోనే "ఎవరో నా చొక్కా కాలర్ పట్టుకుని వాహనంలోకి తోసేశారు," అని ఈ 27 ఏళ్ల యువకుడు చెప్పాడు.
మద్యం కోసం తనను, తన ఇంటిని సోదా చెయ్యమని అతను ఆ బృందాన్ని కోరాడు, కానీ వారు ఆ పని చేయలేదు. అయితే ఎక్సైజ్ శాఖకు తీసుకువెళ్లిన తర్వాత తనని వదిలిపెట్టేస్తామని చెప్పటంతో అతను కాస్త స్థిమితపడ్డాడు.
కానీ వారంతా పోలీస్ స్టేషన్‌కు చేరే సమయానికే బసంత్ వద్ద 500 మి.లీ. మద్యం దొరికినట్టుగా అధికారికంగా నమోదు చేసివున్నట్టు అతనికి తెలిసింది. అతని వద్ద మద్యం ఉన్నట్లుగా మద్య నిషేధ చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. మొదటిసారి నేరం చేసినవారైతే ఈ అపరాధానికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, లక్షరూపాయలకు తగ్గకుండా జరిమానా ఉంటుంది.










