అంజలి ఎప్పుడూ తులసిని తన అమ్మగా పిలుస్తుంది. ఉంగరాల జుట్టును ముడిగా చుట్టి, చక్కని గులాబీ రంగు చీర కట్టుతో ఉన్న అంజలి తల్లి ఈ సంగతిని సగర్వంగా నవ్వుతూ మాతో చెప్పారు. తొమ్మిదేళ్ళ ఆ పాపకు తల్లి అయిన తులసి ఒక ట్రాన్స్ మహిళ.
తులసి యుక్తవయస్సులో ఉండగా, తనను తాను 'కార్తీక'గా చెప్పుకోవడం ప్రారంభించింది. తరువాత, ఒక అధికారి ఆమె రేషన్ కార్డులో పొరపాటున తమిళంలో ‘తులసి’ - స్త్రీ పురుషులిద్దరూ పెట్టుకునే పేరు - అని రాశారు. ఆ పేరును సంతోషంగా స్వీకరించిన ఆమె, ఆ రెండు పేర్లలో ఏ పేరుతో పిలిచినా జవాబిచ్చేది.
తమిళనాడులోని తిరుప్పోరూర్ తాలూకాలోని ఇరుల కుగ్రామమైన దర్గాస్‌లో ఆమె తన కుమార్తె అంజలితో కలిసి గడ్డి పైకప్పు ఉన్న చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. తులసి భార్య అంజలి పసితనంలో ఉన్నప్పుడు తులసి నుండి విడిపోయారు. దాంతో ఆమె అంజలిని ఒంటరి తల్లిగా పెంచుతున్నారు. 2016లో వచ్చిన వరదా తుఫాను కారణంగా ఆ దంపతులు తమ తొమ్మిదేళ్ళ మొదటి బిడ్డను కోల్పోయారు
ఇప్పుడు నలభై ఏళ్ళు దాటిన తులసి చాలా సంవత్సరాలుగా తిరునంగై (తమిళ భాషలో ట్రాన్స్ మహిళ) సమూహంలో భాగంగా ఉన్నారు. తన ఒడిలో కూర్చునివున్న అంజలి వైపు ఆప్యాయంగా చూస్తూ, “నేను మా [తిరునంగై] సమావేశాలకు ఈమెను చేతిలో పాల సీసాతో సహా తీసుకెళ్ళేదాన్ని,” చెప్పారామె.


















