రామ్ అవతార్ కుశ్వాహా అహర్వానీలోకి ప్రవేశించగానే, ఆ బురద రోడ్డుపై విన్యాసాలను సాగించడానికి తన మోటార్ సైకిల్ వేగాన్ని తగ్గిస్తారు. ఎగుడుదిగుడుగా ఉండే ఆ పల్లె నడిబొడ్డుకు చేరగానే తన 150సిసి బైక్ ఇంజిన్‌ను ఆపేస్తారు.
ఒక్క ఐదు నిముషాలు గడిచేసరికే తప్పటడుగులవాళ్ళు, బడికి వెళ్తుండే పిల్లలు, టీనేజర్లు ఆయన చుట్టూ గుమిగూడటం మొదలుపెడతారు. ఈ సహరియా ఆదివాసీ పిల్లల బృందం తమలో తాము కబుర్లాడుకుంటూ, చిల్లర పైసలనూ, పది రూపాయల నోట్లనూ చేతుల్లో పట్టుకొని ఓపిగ్గా ఎదురుచూస్తుంటారు. వాళ్ళు వేయించిన నూడుల్స్, కూరగాయలతో తయారుచేసే ఒక ప్లేట్ చౌ మీన్‌ను కొనుక్కునేందుకు వేచివున్నారు.
ఇప్పుడు చక్కగా మర్యాదగా ప్రవర్తిస్తూన్న తన ఆకలిగొన్న ఖాతాదారులు కాసేపట్లో ప్రశాంతతను కోల్పోతారని ఎరిగివున్న మోటార్ బైక్ వ్యాపారి త్వరత్వరగా తాను తెచ్చిన సామగ్రిని బయటకు తీయటం మొదలెట్టారు. అవి ఏమంత ఎక్కువేమీ లేవు - అతను రెండు ప్లాస్టిక్ సీసాలను బయటకు తీశారు. "ఒకటి ఎర్ర సాస్ (చిల్లీ), రెండోది నల్లనిది (సోయా సాస్)," అని ఆయన వివరించారు. ఒక క్యాబేజీ, తొక్క ఒలిచిన ఉల్లిపాయ, పచ్చరంగు బుట్ట మిరపకాయ (క్యాప్సికమ్), ఉడికించిన నూడుల్స్- మిగిలిన వస్తువులు. "నేను నాక్కావాల్సిన సరుకులన్నీ విజయ్‌పుర్‌లో(పట్టణం) కొంటాను."
సాయంత్రం ఆరు గంటలు కావొస్తోంది, రామ్ అవతార్ ఈ రోజు సందర్శించిన నాలుగవ గ్రామమిది. తాను మామూలుగా వెళ్ళే పల్లెల, ఊర్ల పేర్లను - లడర్, పాండ్రి, ఖజూరి, కలాన్, శిల్పారా, పరొండ్ - అంటూ అయన వరసగా వల్లించారు. ఈ ఊర్లన్నీ విజయ్‌పుర్ తెహసిల్లోని గోపాల్‌పురా గ్రామానికి ఆనుకొని ఉన్న సుతైపుర అనే పల్లె చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వ్యాసార్ధంలో ఉంటాయి. ఇది కాకుండా ఈ పల్లెల్లోనూ గ్రామాలలోనూ అందుబాటులో ఉండే చిరుతిండ్లు- ప్యాకెట్లలో లభించే చిప్సు, బిస్కత్తులూ మాత్రమే.
ఆదివాసులు ఎక్కువగావుండే 500 మంది జనాభా నివసించే ఈ అహర్వానీ అనే పల్లెకు ఆయన వారంలో కనీసం రెండుమూడుసార్లు వస్తారు. ఆహర్వానీ కొత్తగా ఏర్పడిన గ్రామం. ఇక్కడ నివసిస్తున్నవారంతా వారు ఉండే ప్రదేశాలను సింహాలకు రెండవ స్థిరనివాసంగా మార్చేందుకు 1999లో కూనో నేషనల్ పార్క్ నుండి పంపించివేసినవారు. చదవండి: కూనో: చిరుతల కోసం ఆదివాసుల స్థానభ్రంశం.సింహాలైతే రాలేదు కానీ, 2022 సెప్టెంబర్‌లో ఆఫ్రికా నుండి వచ్చిన చిరుతపులులను మాత్రం ఇక్కడకు తరలించారు.






