1947 నాటి రక్తసిక్త విభజన ద్వారా రెండు దేశాల మధ్య ఒక సరిహద్దు ఏర్పడితే, రాడ్‌క్లిఫ్ లైన్ కూడా పంజాబ్‌ను రెండు భాగాలుగా విభజించింది. సరిహద్దు కమిషన్ల ఛైర్మన్‌గా పనిచేసిన బ్రిటిష్ న్యాయవాది పేరుతో ఉన్న ఆ సరిహద్దు రేఖ, పంజాబ్‌ను భౌగోళికంగానే కాక, పంజాబీ భాషకు చెందిన రెండు లిపులను కూడా విభజించింది. "పంజాబీ సాహిత్యంపై, భాషకు చెందిన రెండు లిపులపై దేశ విభజన ఎప్పటికీ తాజా గాయాన్ని మిగిల్చింది," అని రాష్ట్రంలోని లుథియాణా జిల్లా, పాయల్ తహసీల్‌లోని కటెహ్రీ గ్రామానికి చెందిన కిర్పాల్ సింగ్ పన్నూ అన్నారు.
పన్నూ 90 ఏళ్ళ వయసున్న మాజీ సైనికుడు. ఆయన తన జీవితంలోని మూడు దశాబ్దాల కాలాన్ని దేశ విభజన వలన అయిన ఈ ప్రత్యేక గాయానికి మలామా పూయడానికే అంకితం చేశారు. సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్)లో డిప్యూటీ కమాండెంట్‌గా ఉద్యోగ విరమణ చేసిన పన్నూ, గురుగ్రంథ సాహిబ్, మహాన్ కోశ్ [పంజాబ్‌లోని అత్యంత గౌరవనీయమైన సర్వసంగ్రహ నిఘంటువు (ఎన్‌సైక్లోపీడియా) లలో ఒకటి] వంటి గ్రంథాలనూ, పవిత్ర పుస్తకాలనూ, ఇతర సాహిత్య రచనలనూ గురుముఖి నుండి షాహ్‌ముఖిలోకీ, అలాగే షాహ్‌ముఖి నుండి గురుముఖిలోకీ లిప్యంతరీకరించారు.
ఉర్దూ భాషలాగా కుడి నుండి ఎడమకు రాసే షాహ్‌ముఖిని 1947 నుంచి భారతదేశపు పంజాబ్‌లో ఉపయోగించడంలేదు. 1995-1996లో పన్నూ గురు గంథ్ సాహిబ్‌ను గురుముఖి నుంచి షాహ్‌ముఖిలోకీ, అలాగే షాహ్‌ముఖి నుండి గురుముఖిలోకీ మార్చే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేశారు.
విభజనకు ముందు, ఉర్దూ మాట్లాడేవారు షాహ్‌ముఖిలో రాసిన పంజాబీని కూడా చదవగలిగేవారు. పాకిస్తాన్ ఏర్పడక ముందు అనేక సాహిత్య రచనలు, అధికారిక కోర్టు పత్రాలు షాహ్‌ముఖిలోనే ఉండేవి. గతంలో అవిభాజ్య ప్రావిన్స్‌కు చెందిన కథ చెప్పే సంప్రదాయక కళ అయిన కిస్సా కూడా షాహ్‌ముఖిని మాత్రమే ఉపయోగించింది.
ఎడమ నుండి కుడికి రాసే గురుముఖికి దేవనాగరి లిపితో కొంత పోలిక ఉంది. దీనిని పాకిస్తాన్ పంజాబ్‌లో ఉపయోగించరు. తత్ఫలితంగా, పంజాబీ మాట్లాడే పాకిస్తానీల తరువాతి తరాలు, గురుముఖిని చదవలేరు కాబట్టి వారి సాహిత్యానికి దూరంగా ఉండిపోయారు. తమకు తెలిసిన లిపి అయిన షాహ్‌ముఖిలో రూపొందించినప్పుడు మాత్రమే వారు అవిభక్త పంజాబ్‌కు చెందిన గొప్ప సాహిత్య రచనలను చదవగలిగారు.













