అబ్దుల్ లతీఫ్ బజరాన్ మేనెల ప్రారంభంలో తన 150 జంతువులతో - గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒక కుక్క - రజౌరి జిల్లాలోని పరి గ్రామాన్ని వదిలి కశ్మీర్ పర్వతాల పైన మేత బయళ్ళ కోసం వెతికేందుకు బయలుదేరారు. ఆయన తనతోపాటు తన కొడుకు తారిక్నీ, మరికొంతమందినీ తీసుకువెళ్ళారు. "బలహీనంగా ఉన్న జంతువులతో పాటు ఆహారాన్నీ గుడారాలనూ, ఇంకా అవసరమైన వస్తువులనూ నా కుటుంబంతో (ఆయన భార్య, కోడలు) పాటు ఒక మినీ ట్రక్కులో పంపించాను," జమ్మూకు చెందిన ఈ 65 ఏళ్ళ పశువుల కాపరి చెప్పారు.
కానీ రెండు వారాల తర్వాత, "వారిని చూసి (వయిల్లో) నేను దిగ్భ్రాంతి చెందాను," అన్నారాయన. వారు తమ గమ్యస్థానమైన మినిమార్గ్ (భారత్-పాకిస్తాన్ సరిహద్దులో) చేరి ఒక వేసవి శిబిరాన్ని సిద్ధంచేసి వుంటారని ఆయన ఊహించారు.
అందుకు బదులుగా వారు తమ గమ్యస్థానానికి 15 రోజుల దూరంలో ఉన్నారు. వాతావరణం సరిగ్గా లేకపోవటం వలన వారు ఆగిపోయారని ఆయన చెప్పారు. మినిమార్గ్ చేరాలంటే తప్పనిసరిగా తాము దాటవలసిన జోజిలా పాస్ వద్ద వారు మంచు కరగటం కోసం ఎదురుచూస్తూ ఆగిపోయారు.
జమ్మూ ప్రాంతంలో ప్రతిసారీ వేసవికాలం వస్తుందనగా గడ్డి దొరకటం అరుదైపోవటంతో, బకర్వాల్ల వంటి సంచార పశుపోషక సముదాయాలు మెరుగైన మేత బయళ్ళు దొరుకుతాయనే ఆశతో కశ్మీర్ లోయకు వలసపోతుంటారు. జమ్మూలో వాతావరణం చల్లగా మారుతుండే అక్టోబర్లో మాత్రమే వారు మళ్ళీ తిరిగివస్తారు.
కానీ ఎత్తులో ఉన్న మేతమైదానాలను మంచు ఇంకా కప్పి వుండటం వలన, అబ్దుల్ వంటి పశుపోషకులు మధ్యలో చిక్కుకుపోతారు - వారు కిందికి తమ గ్రామాలకు, అక్కడ మేయటానికి గడ్డి ఉండదు కాబట్టి - తిరిగివెళ్ళనూ లేరు, పైన ఉన్న పచ్చికబయళ్ళను చేరుకోనూలేరు.











