అస్సామ్ ఖోల్ డ్రమ్ముల శబ్దం బెంగాలీ ఖోల్ శబ్దం కంటే మంద్రస్థాయిలో ఉంటుంది. నెగెరా కంటే ఢోల్ స్థాయి హెచ్చుగా ఉంటుంది. ఈ విషయం గిరిపద్ బాద్యకార్‌కు బాగా తెలుసు. తట్టు వాయిద్యాలను తయారుచేసే ఈయన, తన రోజువారీ పనులలో ఈ జ్ఞానాన్ని ఉపయోగిస్తారు.
అస్సామ్‌లోని మాజులీలో ఉండే ఈ అనుభవజ్ఞుడైన కళాకారుడు మాట్లాడుతూ, “అబ్బాయిలు తమ స్మార్ట్‌ఫోన్‌లను నాకు చూపించి, ట్యూనింగ్‌ను నిర్దిష్ట స్థాయికి సర్దుబాటు చేయమని అడుగుతుంటారు," అన్నారు. "అందుకు మాకు యాప్ అవసరం లేదు."
ట్యూనర్ యాప్‌తో కూడా, ఈ ప్రక్రియను అనేక విధాలుగా ప్రయత్నించి చివరకు సాధించడమేనని గిరిపద్ వివరించారు. ఇందుకు తట్టు వాయిద్యపు తోలు పొరను సరిగ్గా అమర్చి, బిగించడం అవసరం. "అప్పుడే ట్యూనర్ యాప్ పని చేస్తుంది."
గిరిపద్, ఆయన కొడుకు పదుమ్‌లు సుదీర్ఘమైన వాద్యకారుల శ్రేణికి చెందినవారు. ధులి లేదా శబ్దకార్ అనే పేరుతో పిలిచే ఈ సముదాయం, సంగీత వాద్యాలను తయారుచేయటానికీ, మరమ్మత్తులు చేయటానికీ ప్రసిద్ధి చెందింది. త్రిపుర రాష్త్రంలో షెడ్యూల్డ్ కులంగా జాబితా అయివుంది.
పదుమ్, గిరిపద్‌లు ప్రధానంగా ఢోల్, ఖోల్, తబలా లను తయారుచేస్తారు. "ఇక్కడ సత్రాలు ఉండటంవలన, మాకు ఏడాది పొడవునా పని ఉంటుంది," అన్నాడు పదుమ్. "అందువల్ల మాకు సరిపోయేంత సంపాదన కూడా ఉంటుంది."
ఫగుణ్ (ఫిబ్రవరి-మార్చ్) మాసంలో, మిసింగ్ (మిషింగ్) సముదాయానికి చెందిన వసంతోత్సవ పండుగ అలి ఆయె లిగాంగ్ నుంచి మొదలయ్యే పండుగ సీజన్‌లో సంపాదన ఊపందుకుంటుంది. ఈ పండుగ సమయంలో ప్రదర్శించే గుమ్‌రాగ్ నృత్యంలో ఢోలులు ఒక ముఖ్యమైన భాగం కావటంతో సోట్ (మార్చ్-ఏప్రిల్) మాసంలో కొత్త ఢోలుల కు, పాత ఢోలుల మరమ్మత్తులకు గిరాకీ తారాస్థాయిని అందుకుంటుంది. రాష్ట్రంలో వసంతకాలపు అతి పెద్ద పండుగ అయిన బొహాగ్ బిహూ ఉత్సవాల్లో కూడా ఢోలుల కు గిరాకీ పెరుగుతుంది.
భాద్రొ మాసంలో నెగెరాలకు, ఖోల్‌లకు పెద్ద గిరాకీ ఉంటుంది. రాస్ నుండి బిహూ వరకూ అస్సామ్ సాంస్కృతిక ఉత్సవాలలో తట్టు వాయిద్యాలు ముఖ్యపాత్రను పోషిస్తాయి. అస్సామ్‌లో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన ఆరు రకాల డ్రమ్‌లు ఉన్నాయని అంచనా. వీటిలో చాలా వరకు ఇక్కడ మాజులీలోనే తయారవుతాయి, ఉపయోగించబడుతున్నాయి కూడా. చదవండి: మాజులీలో సత్రాలు, రాస్ మహోత్సవం
తన దుకాణం బయట వేడిగా ఉండే ఏప్రిల్ మాసపు ఎండలో కూర్చొనివున్న పదుమ్ పశువుల చర్మంపై ఉన్న వెంట్రుకలను గీరి తొలగిస్తున్నాడు. ఆ చర్మం తబలా, నెగెరా లేదా ఖోల్ కు తోలు పొరగా లేదా తాలి గా మారుతుంది. బ్రహ్మపుత్రలోని మాజులీ ద్వీపంలో ఉన్న ఐదు సంగీత దుకాణాలన్నిటినీ వలస వచ్చిన బెంగాలీ సముదాయానికి చెందిన బాద్యకార్ కుటుంబాలే నిర్వహిస్తున్నాయి.
“తాను గమనించడం ద్వారా నేర్చుకున్నాడు కాబట్టి, నేను కూడా అలాగే నేర్చుకోవాలని మా నాన్న చెప్పాడు," 23 ఏళ్ళ పదుమ్ చెప్పాడు. " హతోత్ ధరీ సికాయి నిదియె [నేర్పేటపుడు ఆయన చేతుల్ని పట్టుకోడు]. ఆయన నా తప్పులను కూడా సరిచేయడు. గమనించడం ద్వారా నేను నా తప్పులను సరిచేసుకోవాల్సిందే."
పదుమ్ శుభ్రం చేస్తోన్నది ఒక ఎద్దు పూర్తి చర్మాన్ని. దానిని వాళ్ళు రూ. 2000కు కొన్నారు. ఇందులో మొదటి దశ, చర్మంపై ఉన్న వెంట్రుకలను ఫూత్‌సాయి (పొయ్యిలో బూడిద), లేదా పొడి ఇసుకను ఉపయోగించి శుభ్రంచేస్తారు. ఆ తర్వాత దానిపై చదును అంచున్న ఉలి, బతాలి తో రుద్దుతారు.
శుభ్రంచేసిన చర్మాన్ని ఒక వంపు తిరిగిన ఎక్‌టేరా అని పిలిచే దావ్ బ్లేడ్‌తో గుండ్రని ముక్కలుగా కోస్తారు. ఇవి తాలి (చర్మపు పొర)గా మారతాయి. వాయిద్యపు ముఖ్యభాగానికి ఈ తాలి ని కట్టే తాళ్ళను కూడా తోలుతోనే తయారుచేస్తారు," పదుమ్ వివరించాడు. "అవి మరింత చిన్నవయసు జంతువు నుంచి వస్తాయి, మరింత మెత్తగా సున్నితంగా ఉంటాయి."
స్యాహీ ( తాలి మధ్యలో నలుపు రంగులో ఉండే గుండ్రని భాగం)ని పొడిచేసిన ఇనుము లేదా ఘున్ ను ఉడికించిన అన్నంతో కలిపి ముద్దలా తయారుచేస్తారు. "దీనిని [ ఘున్ ] ఒక యంత్రంలో తయారుచేస్తారు," ఒక చిన్న గుప్పెడు ఇనుప పొడిని తన అరచేతిలోకి తీసుకొని చూపిస్తూ చెప్పాడతను. "ఇది స్థానికంగా ఉండే కమ్మరి చేసే పొడి కంటే మెరుగైనది. కమ్మరి చేసేది ముతకగా, పెచ్చులుపెచ్చులుగా ఉండి మీ చేతికి గాయాలు చేస్తుంది."
మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ యువశిల్పి చిక్కటి బూడిద రంగులో ఉన్న ఘున్ ను కొద్దిగా ఈ విలేకరి అరచేతిలో పోశాడు. ఆశ్చర్యమేమంటే, ఆ పొడి చాలా కొద్దిగా ఉన్నా చాలా బరువుగా ఉంది.
తాలి పైన ఘున్ ను పూయటానికి మరింత శ్రద్ధ, జాగ్రత్త అవసరం. తాలి పై ఒక పొరలాగా ఉడికించిన అన్నాన్ని పూసి, ఎండబెట్టడానికి ముందు తాలి ని మూడు నాలుగు సార్లు శుభ్రంచేస్తారు. అన్నంలో ఉండే గంజి తాలి ని జిగురుగా అంటుకునేలా చేస్తుంది. తాలి పూర్తిగా ఎండిపోవడానికి ముందే ఒక పొర స్యాహీ ని పూసి, ఆ పైభాగాన్ని ఒక రాయిని ఉపయోగించి మెరుగుపెడతారు. ప్రతి పొరను పూయడానికి ముందు ఒక 20-30 నిముషాల విరామమిచ్చి మూడుసార్లు ఇలా చేస్తారు. ఆ తర్వాత దానిని నీడలో ఒక గంటపాటు ఆరబెడతారు.
"అది పూర్తిగా ఆరిపోవడానికి ముందే మనం రుద్దుతూ ఉండాలి. సంప్రదాయికంగా అలా 11 సార్లు చేస్తారు. వాతావరణం మబ్బుగా ఉన్నప్పుడు ఈ పద్ధతి మొత్తం పూర్తికావటానికి ఒక వారం మొత్తం పడుతుంది."
*****
నలుగురు అన్నదమ్ములలో చిన్నవాడైన గిరిపద్, తనకు 12 ఏళ్ళ వయసప్పటి నుంచి ఈ కుటుంబ వ్యాపారంలో సాయం చేస్తూ ఉన్నారు. అప్పట్లో అతను కొల్‌కతాలో నివసించేవారు. ఆయన తల్లిదండ్రులు ఒకరివెంట ఒకరు చనిపోవడంతో ఆయన ఒంటరి అయిపోయారు.
"నాకు ఈ పనిని నేర్చుకోవాలనే మనసు లేదు," అని ఆయన గుర్తుచేసుకున్నారు. కొన్నేళ్ళకు ఈ పనిపై ప్రేమ కలగటంతో అస్సామ్‌కు వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నారు. మొదట్లో ఆయన ఢోలులు తయారుచేసే ఒక దుకాణంలో పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఒక రంపపు మిల్లులో పనిచేశారు. ఆపైన కర్ర దుంగల వ్యాపారంలోకి వచ్చారు. దుంగలతో నిండిన ట్రక్కులు వర్షాకాలపు బురద నిండిన రోడ్ల మీద కిందికి దిగేటప్పుడు జరిగిన అనేక ప్రమాదాలలో, "ఎన్నో చావులను నేను ఈ కళ్ళతో చూశాను," అని ఆయన గుర్తు చేసుకున్నారు.
తిరిగి ఈ పనిలోకే వచ్చిన గిరిపద్, 10-12 ఏళ్ళు జోర్‌హాట్‌లో పనిచేశారు. ఆయన ముగ్గురు పిల్లలు - ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి - ఇక్కడే పుట్టారు. అరువు తీసుకున్న ఢోల్ ను తిరిగి ఇవ్వడం గురించి కొంతమంది అస్సామీ అబ్బాయిలతో ఆయనకు సమస్య తలెత్తింది. గూండాలుగా అందరికీ తెలిసిన ఆ అబ్బాయిలు ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టవచ్చుననే ఆలోచనతో స్థానిక పోలీసులు అతన్ని మరెక్కడైనా దుకాణం పెట్టుకోమని సలహా ఇచ్చారు.
"మేం బెంగాలీలం కాబట్టి, వాళ్ళు ముఠాగా ఏర్పడి గొడవకు దిగి అది వర్గకలహంగా మారితే నా ప్రాణాలకూ, నా కుటుంబానికీ ప్రమాదం ఉంటుందని నేను కూడా ఆలోచించాను," అని అతను చెప్పారు. "కాబట్టి నేను జోర్‌హాట్ వదిలేయాలని [మాజులీ కోసం] నిర్ణయించుకున్నాను." మాజులీలో అనేక సత్రాలు (వైష్ణవ మఠాలు) ఉన్నందున, సత్రియా ఆచారాలలో విస్తృతంగా ఉపయోగించే ఖోల్ డ్రమ్ములను తయారుచేయడం, వాటిని మరమ్మత్తు చేయడంలో ఆయనకు స్థిరమైన పని దొరుకుతుంది.
"ఈ ప్రదేశాలు అప్పుడు ఒక అడవిలాగా ఉండేవి, ఈ చుట్టుపక్కల దుకాణాలు కూడా ఎక్కువగా ఉండేవి కావు." ఆయన తన మొదటి దుకాణాన్ని బాలిసపరి (బాలి సపొరి) గ్రామంలో తెరిచారు, కొన్నేళ్ళ తర్వాత దానిని గరముర్‌కు తరలించారు. ఈ కుటుంబం 2021లో తమ మొదటి దుకాణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నయా బజార్‌లో ఇంకొంచం పెద్దదైన తమ రెండవ దుకాణాన్ని తెరిచింది.
ఒక ఖోలుల వరుస దుకాణం గోడలను అలంకరిస్తూ ఉంది. పశ్చిమ బెంగాల్‌లో మట్టితో చేసిన బెంగాలీ ఖోలులు వాటి వాటి పరిమాణాలను బట్టి రూ. 4000, ఆ పైన ధర పలుకుతాయి. ఇందుకు విరుద్ధంగా అస్సామీ ఖోలుల ను చెక్కతో తయారుచేస్తారు. తయారీకి ఉపయోగించిన చెక్కను బట్టి ఢోలులు రూ. 5,000, ఆ పైన ధర పలుకుతాయి. వీటిపై ఉండే చర్మాన్ని మార్చి కొత్త చర్మాన్ని వేయటానికి సుమారు రూ. 2,500 ఖర్చవుతుంది.
మాజులీలోని నామ్‌ఘర్ లలో (ప్రార్థన గృహాలు) ఒకదానికి చెందిన దోబా ఆ దుకాణం నేల మీద ఉంది. దీనిని వాడేసిన కిరోసిన్ డబ్బాతో తయారుచేశారు. కొన్ని దోబాల ను ఇత్తడి లేదా అల్యూమినియంతో తయారుచేస్తారు. “ఏదైనా డబ్బాను చూసి దోబా తయారు చేసివ్వమని ఎవరైనా మమ్మల్ని అడిగితే, మేం అలా చేసిస్తాం. అలాకాకుండా కొనుగోలుదారుడే డ్రమ్ తీసుకువస్తే కూడా మేం దానికి తోలును అమర్చి ఇస్తాం,” అని పదమ్ చెప్పాడు. ఈ దోబా మరమ్మతుల కోసం వచ్చింది.
"ఒకోసారి మేం దోబా ను మరమ్మత్తు చేయటం కోసం ఆ సత్రాని కి, నామ్‌ఘర్ కి వెళ్తుంటాం," అతను మరింత వివరించాడు. "మేం మొదటి రోజు వెళ్ళి కొలతలు తీసుకుంటాం. ఆ మరుసటి రోజున తోలు తీసుకువెళ్ళి ఆ సత్రం లోనే దానికి మరమ్మత్తులు చేస్తాం. ఇది చేయటానికి మాకు దాదాపు ఒక గంట పడుతుంది."
చర్మకారులకు వివక్షను ఎదుర్కోవటంలో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. " ఢోల్ ను వాయించేవారు తమ వేళ్ళకు ఉమ్ము రాసుకుంటారు. గొట్టపుబావిలో ఉండే వాషర్‌ను కూడా తోలుతోనే తయారుచేస్తారు," అంటారు గిరిపద్. "అందుకే జాత్-పాత్ పేరుతో వివక్ష చూపడం అర్థంలేనిది. చర్మం గురించి అభ్యంతరపెట్టడం పనికిమాలిన పని."
ఐదేళ్ళ క్రితం ఈ కుటుంబం నయా బజార్‌లో కొంత భూమిని కొని అందులో ఇల్లు కట్టుకుంది. వారంతా మిసింగ్, అస్సామీ, దేవురీ, బెంగాలీ ప్రజలతో కలిసివున్న సమాజంలో జీవిస్తున్నారు. వారెప్పుడైనా వివక్షను ఎదుర్కొన్నారా? "మేం మనిదాసులం. మాకంటే చచ్చిన జంతువుల చర్మాలను ఒలిచే రబిదాస్ వర్గానికి చెందిన ప్రజలు కొంత వివక్షను ఎదుర్కొంటారు. కుల ఆధారిత వివక్ష బెంగాల్‌లో చాలా ఎక్కువ. ఇక్కడ అంతగా లేదు," గిరిపద్ జవాబిచ్చారు
*****
వాద్యకారులు ఒక ఎద్దు పూర్తి చర్మాన్ని జోర్‌హాట్, కాకజన్‌లోని ముస్లిమ్ వ్యాపారుల వద్ద రూ. 2000కు కొంటారు. దగ్గరలో ఉన్న లఖింపుర్ జిల్లాలో కంటే ఇక్కడి చర్మాల ధర ఎక్కువైనా వాటి నాణ్యత మెరుగ్గా ఉంటుంది. "వారు (లఖింపుర్) తోలును ఉప్పుతో క్షాళన చేస్తారు. అందువల చర్మం మన్నిక తగ్గిపోతుంది," పదుమ్ అన్నాడు
చట్టాలలోని మార్పుల వల్ల తోలు కోసం చర్మాలను సంపాదించడం ఈ రోజుల్లో చాలా కష్టమైపోతోంది. అస్సామ్ పశు పరిరక్షణ చట్టం, 2021 అన్ని రకాల గోవులను సంహరించడాన్ని నిరోధిస్తోంది. మిగిలిన పశువులను వధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తున్నప్పటికీ, అందుకోసం ఒక గుర్తింపు పొందిన పశు వైద్యాధికారి ఆ పశువుకు 14 ఏళ్ళ వయసు నిండినదనీ, పూర్తిగా వట్టిపోయినదనీ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇది చర్మాల ఖరీదు పెరిగేందుకు దారితీసింది, అదేవిధంగా కొత్త పరికరాల ధరలనూ, మరమ్మత్తుల ధరలనూ పెంచివేసింది." అన్నాడు పదుమ్.
ఒకసారి గిరిపద్ పనికివెళ్ళి, తన తోలు పని పరికరాలనూ, దావ్ బ్లేడులనూ తీసుకొని తిరిగివస్తుండగా, ఒక చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు అతనిని ఆపి ప్రశ్నలు వేయటం మొదలెట్టారు. "నేను ఫలానా పని చేస్తాననీ, ఒక వాయిద్యాన్ని ఇవ్వడానికి ఇక్కడకు వచ్చాననీ మా నాన్న చెప్పినప్పటికీ" పోలీసులు ఆయన వెళ్ళిపోవటానికి ఒప్పుకోలేదు.
"పోలీసులు మమ్మల్ని నమ్మరని మీకు తెలుసు కదా. మా నాన్న ఎక్కడో ఆవులను వధించటానికి వెళ్ళివస్తున్నాడని వారి ఆలోచన," పదుమ్ గుర్తుచేసుకున్నాడు. తిరిగి ఇంటికి చేరుకోవడానికి గిరిపద్ ఆ పోలీసులకు రూ. 5000 ఇవ్వవలసి వచ్చింది.
బాంబులు తయారుచేయటానికి కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఘున్ ను రవాణా చేసుకోవటం కూడా ప్రమాదంతో కూడుకున్నదే. గిరిపద్ తనకు అవసరమైన ప్రతిసారీ గోలాఘాట్‌లో లైసెన్స్ ఉన్న ఒక దుకాణం నుంచి ఒకటి లేదా రెండు కిలోల ఘున్ ను కొంటుంటారు. అతి దగ్గరి దారి ద్వారా ఒక్కసారి ఆ దుకాణానికి వెళ్ళి రావాలంటే 10 గంటల సమయం పడుతుంది, ఒక ఫెర్రీ మీద బ్రహ్మపుత్రా నదిని దాటవలసి ఉంటుంది కూడా.
"మేం దానికి తీసుకువెళ్ళటం పోలీసులు చూసి మమ్మల్ని పట్టుకుంటే జైలుకు వెళ్ళే ప్రమాదం ఉంది," అన్నారు గిరిపద్. "మేం దాన్ని తబలా మీద ఎలా ఉపయోగిస్తామో చేసి చూపించి వారిని నమ్మించగలిగితే మంచిదే. లేదంటే మేం జైలుకు వెళ్ళాల్సిందే."
ఈ కథనానికి మృణాళినీ ముఖర్జీ ఫౌండేషన్ (ఎమ్ఎమ్ఎఫ్) ఫెలోషిప్ మద్దతు ఉంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి