ఉత్తర తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా తీరప్రాంతంలో ఉన్న గ్రామాల సరిహద్దులను కన్నిసామి కాపలా కాస్తుంటాడు. మత్స్యకార సముదాయాల సంరక్షకుడైన ఈ దేవుడు సాధారణంగా ఈ వర్గానికి చెందిన వ్యక్తిలానే కనిపిస్తాడు: మెరిసిపోయే రంగు రంగుల చొక్కాలు, వేట్టి (ధోవతి లేదా పంచె) ధరించి, తలపై టోపీ కూడా పెట్టుకొని ఉంటాడు. సముద్రంలోకి ప్రవేశించే ముందు తాము క్షేమంగా తిరిగి రావాలని మత్స్యకారులు ఆయనకు ప్రార్థనలు చేస్తారు.
మత్స్యకార కుటుంబాలు కన్నిసామిని వేర్వేరు రూపాలలో పూజిస్తారు. అంతేకాకుండా, ఇలా పూజించడం ఉత్తర చెన్నై నుండి పళవేర్కాడు (ప్రళయకావేరి లేదా పులికా ట్గా ప్రసిద్ధి చెందింది) వరకు అనుసరిస్తూ వస్తోన్న ఒక ప్రసిద్ధ ఆచారం.
ఎణ్ణూర్ కుప్పం మత్స్యకారులు కన్నిసామి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలోని అత్తిపట్టుకు వెళ్తారు. జూన్లో జరిగే ఈ వార్షిక పండుగ వేడుక ఒక వారం పాటు కొనసాగుతుంది. నేను 2019లో ఈ గ్రామానికి చెందిన మత్స్యకారుల బృందంతో యాత్రకు వెళ్ళాను. మేం ఉత్తర చెన్నైలోని థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలో ఉన్న కొసస్థలైయ్యార్ నది ఒడ్డున దిగి, అత్తిపట్టు గ్రామం వైపుకి నడిచాం.
మేం రెండు అంతస్తులున్న ఒక ఇంటికి చేరుకున్నాం, అక్కడ అనేక కన్నిసామి విగ్రహాలు నేలపై పెట్టి ఉన్నాయి. విగ్రహాలను తెల్లటి గుడ్డతో చుట్టి ఉంచారు. 40 ఏళ్ళు దాటిన ఒక వ్యక్తి, తెల్లటి చారల చొక్కా, వేట్టిని ధరించి, తన నుదుటిపైన తిరునీర్ [విభూతి] పూసుకుని, కర్పూరం వెలిగించి విగ్రహాల ముందు నిలబడి ఉన్నారు. ప్రతి మత్స్యకారుని భుజాలపై ఒక విగ్రహం పెట్టే ముందు అతను ఆ విగ్రహానికి పూజై (పూజ) చేస్తారు.



































