"వాళ్ళు మా మొహాల మీదనే దిల్లీ తలుపులను మూసేశారు," బుట్టర్ సరింహ్ గ్రామం వెలుపల మాట్లాడుతూ అన్నారు బిట్టూ మల్లన్. "ఇప్పుడు పంజాబ్‌లోని ప్రతి గ్రామం తలుపులు వారికి మూసుకున్నాయి."
బిట్టూ మల్లన్ శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లా, మల్లన్ గ్రామానికి చెందిన ఐదెకరాల భూమి ఉన్న రైతు. ఆయన ప్రస్తావిస్తోన్న 'వాళ్ళు', 'వారికి' అనే మాటలు కేంద్రంలో అధికారంలో ఉన్న, ప్రస్తుతం జరుగుతోన్న లోక్‌సభ ఎన్నికలలో పంజాబ్ నుంచి చాలా ఒంటరిగా పోటీ చేస్తోన్న బిజెపి పార్టీ గురించి. దిల్లీలోకి ప్రవేశించకుండా తలుపులను మూసేసినది ఎవరికంటే, నవంబర్ 2020లో దేశ రాజధానికి కవాతు చేసిన వేలాదిమంది రైతులకు.
కిసాన్ ఆందోళన, జాతీయ రాజధాని గేట్ల వద్ద వారు నెలకొల్పుకున్న క్యాంపు పట్టణాల జ్ఞాపకాలు పంజాబ్‌లో లోతుగా వేళ్ళూనుకుపోయాయి. మూడు వేసవి కాలాల క్రితం, ఈ రాష్ట్రానికి చెందిన వేలాదిమంది రైతులు తమ ప్రతిఘటన, ఆశల సుదీర్ఘ యాత్రను ప్రారంభించారు. ట్రాక్టర్లు, ట్రైలర్‌ల వాహనశ్రేణిలో వందల మైళ్ళ దూరం ప్రయాణించిన వారు, కేవలం ఒకే ఒక్క డిమాండ్‌తో రాజధానికి చేరుకున్నారు: వారి జీవనోపాధికి ముప్పు తెచ్చే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం.
దిల్లీ ప్రవేశ ద్వారాల వద్దకు వారు చేరుకున్నప్పుడు, వారి విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన నిర్లక్ష్యపు ప్రభుత్వం నిర్మించిన భారీ కుడ్యాన్ని వారు ఎదుర్కోవలసి వచ్చింది. దాదాపు ఒక సంవత్సరం పాటు ఉష్ణోగ్రత కేవలం 2 డిగ్రీల సెల్సియస్ ఉందా, లేదంటే 45 డిగ్రీల సెల్సియస్‌కు ఎగబాకిందా అనే దానితో పనిలేకుండా, వారి రాత్రులను ఒంటరితనపు శైత్యం, అన్యాయపు వేడిమి చుట్టుముట్టాయి. ఇనుప ట్రెయిలర్లు, ట్రాలీలు వారి నివాసాలుగా మారాయి.
సుమారు 358 రోజుల ఆటుపోట్ల మధ్య, దిల్లీ చుట్టూ వారు ఏర్పాటు చేసుకున్న శిబిరాల్లో మరణించిన 700 మంది రైతుల మృతదేహాలు పంజాబ్‌కు తిరిగి చేరుకున్నాయి. ఈ మృతదేహాలు ఒక్కొక్కటి వారి పోరాటానికి వారు చెల్లించిన మూల్యానికి నిశ్శబ్ద నిదర్శనాలు. కానీ ఆందోళన అణగిపోలేదు. వారి త్యాగం, భారీ పోరాటం కారణంగా ఒక సంవత్సరం పాటు తిరస్కరణలు, అనేక గాండ్రింపుల తర్వాత చివరకు ప్రభుత్వం మోకరిల్లింది. నవంబర్ 19, 2021న ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించాడు.
ఇప్పుడు పంజాబ్‌లో లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం. బిట్టూ మల్లన్, ఇంకా అతని వంటి చాలామంది రైతులు దిల్లీలో తాము రుచి చూసిన చికిత్సను తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ 23న, చనిపోయిన ప్రతి రైతుకు సంబంధించిన లెక్కలను తేల్చడం తన కర్తవ్యంగా భావించే బిట్టూ, ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి హన్స్ రాజ్ హన్స్‌ను బుట్టర్ సరింహ్ గ్రామంలో ధైర్యంగా ఎదుర్కొన్నారు.







