“మా గ్రామంలో 50 గోండు కుటుంబాలున్నాయి. మిగిలిన వాళ్ళంతా హిందువులు, ముసల్మానులు, 'జై భీమ్' [దళితులు]. గ్రామంలో అందరూ ఉన్నారు," అన్నారు అమ్జద్. “మమ్మల్ని మినహాయిస్తే, మిగిలిన అన్ని సముదాయాలలో చదువుకున్నవాళ్ళు ఉన్నారు. అయితే నా మేనల్లుడు చదువుకున్నాడు. అతని పేరు శివ." శివ 15 లేదా 16 సంవత్సరాల వయసు వచ్చేవరకు చదువుకున్నాడు. సైన్యంలో చేరాలని అనుకున్నాడు, కానీ సాధించలేకపోయాడు. ఇప్పుడతను పోలీసుల్లో చేరటం కోసం ప్రయత్నిస్తున్నాడని అమ్జద్ చెప్పారు. అమ్జద్ కుటుంబంలో కనీసం ఒక యువకుడు కెరీర్ గురించీ, చదువు గురించీ ఆలోచిస్తున్నాడు.
అమ్జద్‌కు కూడా తనకంటూ ఓ కెరీర్ ఉంది. "మాకు కెజిఎన్ కవ్వాలీ పార్టీ ఉంది." కెజిఎన్ అంటే ఖ్వాజా గరీబ్ నవాజ్. అతను తన సోదరులతో కలిసి దీన్ని ప్రారంభించారు. వివాహాలు, ఇతర కార్యక్రమాలలో వాళ్ళు ప్రదర్శనలు ఇస్తారు. "మీరు ఎంత సంపాదిస్తారు?" నేను అడిగాను. "అది నిర్వాహకుడిపై ఆధారపడి ఉంటుంది. మాకు 5,000 నుంచి 10,000 రూపాయలు లభిస్తాయి. ప్రేక్షకులు కూడా కొంత డబ్బు ఇస్తారు. మొత్తం మీద మేం ఒక కార్యక్రమం చేస్తే 15,000 నుండి 20,000 వరకు సంపాదిస్తాం,” అమ్జద్ చెప్పారు. సభ్యులందరూ ఆ డబ్బును పంచుకుంటే ఒక్కొక్కరికీ రూ. 2,000-3,000 కంటే ఎక్కువ రాదు. పెళ్ళిళ్ళ సీజన్ అయిపోగానే ఇంకే కార్యక్రమాలు ఉండవు. అప్పుడు అమ్జద్ పుణే వస్తారు.
ఇక్కడ ఖేడ్‌శివపూర్‌లోని హజ్రత్ కమర్ అలీ దర్వేశ్ దర్గా వద్ద అతనెప్పుడూ ఎంతో కొంత డబ్బు సంపాదిస్తారు. అతను రాత్రిళ్ళు నేలమాళిగలో కాలం గడుపుతారు. “ఊపర్‌వాలా భూఖా నహీ సులాతా! [సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆకలితో పడుకోనివ్వడు]” చాలామంది తమ కోరికలు నెరవేరితే విందు భోజనమో లేదా ఏదో ఒకటి తినడానికి ఇచ్చి పోతారు. అతను ఒక వారం పాటు ఇక్కడే ఉండి, కవ్వాలీ ప్రదర్శన చేసి, తద్వారా సంపాదించినదాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తారు. అదీ అతని పని. ఇక్కడ అతని సంపాదన గురించి అడిగినప్పుడు, అది 10,000 - 20,000 మధ్య ఉంటుందని అమ్జద్ చెప్పారు. “అయితే అతిగా ఆశ పడకూడదు. ఒకవేళ మీరు ఎక్కువ సంపాదించినా, ఆ డబ్బును ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి, నేను ఎంత సంపాదిస్తే అంత తీసుకుని ఇంటికి పోతాను!" అని నాతో చెప్పారతను.
"బతకడానికి అది సరిపోతుందా?" అని నేను అడిగాను. “హాఁ, చల్ జాతా హై! [అవును, నడిచిపోతుంది] మా గ్రామానికి తిరిగి వచ్చాక కూడా నేను పని చేస్తాను,” అని అతను చెప్పారు. అతనికి భూమి గానీ, మరే ఇతర ఆస్తి గానీ లేదు కదా, ఏం పని చేస్తాడా అని నేను ఆశ్చర్యపోయాను.
అమ్జద్ నా ప్రశ్నను సమాధానంగా, “రేడియం పని. నేను ఆర్‌టిఒ [ప్రాంతీయ రవాణా కార్యాలయం] దగ్గరకు వెళ్ళి వాహనాల పేర్లు, నంబర్ ప్లేట్లకు రంగులు వేస్తాను," అని వివరించారు.“ కవ్వాలీ కార్యక్రమాలు చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మధ్యలో ఏదైనా పని కోసం వెతకాలని నేను నిర్ణయించుకున్నాను. నేను నా సంచి తీసుకొనిపోయి కొంత రేడియం పెయింట్ కొన్నాను. దారిలో, ఒక వాహనం వద్ద ఆగి, దాన్ని పెళ్ళికూతురిలా అలంకరించాను." ఇది అతను కళను ఉపయోగించుకుని చేసే సైడ్ బిజినెస్. దాని వల్ల అతను కొంచెం డబ్బులు సంపాదించుకుంటున్నారు.