మోహన్‌లాల్ లోహార్‌కు గుర్తున్నంత వరకు, సుత్తె దెబ్బల శబ్ద మాధుర్యానికి మోహితుడయ్యేవారు. లయబద్ధమైన ఆ గణగణమనే చప్పుడును వింటూ, వాటిని రూపొందించడమే తన జీవితకాల అభిరుచిగా మారుతుందని తెలుసుకుని మరీ పెరిగారు.
మోహన్‌లాల్ రాజస్థాన్‌లోని బార్‌మేర్ జిల్లాలో ఉన్న నంద్ గ్రామంలో ఒక లోహార్‌ల (కమ్మరులు) ఇంటిలో పుట్టారు. తనకు ఎనిమిదేళ్ళ వయసులో తన తండ్రి, గతించిన భవ్రారామ్ లోహార్‌కు సుత్తెలు, ఇంకా ఇతర ఉపకరణాలను అందిస్తూ ఈ పనిని ప్రారంభించారు. "నేనెన్నడూ బడికి వెళ్ళలేదు. ఈ సామగ్రితో ఆడుకుంటూ ఉండేవాడిని," అని ఆయన చెప్పారు.
ఈ కుటుంబం రాజస్థాన్‌లో ఇతర వెనుకబడిన కులాల జాబితా కింద నమోదైన గడులియా లోహార్ సముదాయానికి చెందినది. వీరు మార్వాడీ, హిందీ భాషలను మాట్లాడుతారు. మోహన్‌లాల్ ఐదు దశాబ్దాల క్రితం 1980ల ప్రారంభంలో మరింత పనికోసం వెదుక్కుంటూ జైసల్మేర్‌కు వచ్చినప్పుడు యుక్తవయసులో ఉన్నారు. అప్పటినుంచీ ఆయన వివిధ రకాలైన అల్యూమినియం, వెండి, స్టీల్ లోహాలతోనే కాకుండా ఇత్తడిని కూడా ఉపయోగించి మోర్చంగ్‌లను తయారుచేశారు.
"అలా లోహపు ముక్కను తాకటంతోనే, అది మంచి ధ్వనిని ఇస్తుందో లేదో నేను చెప్పగలను," అని జైసల్మేర్ ఇసుక తిన్నెల మీదుగా సంగీతాన్ని వినిపించే మోర్చంగ్‌లను రూపొందించేందుకు 20,000 గంటలకు పైగా ఎర్రగా కాలిన ఇనుముతోనూ సుత్తెతోనూ గడిపిన మోహన్‌లాల్ చెప్పారు.
"మోర్చంగ్‌ను తయారుచేయటం కష్టమైన పని," అన్నారు 65 ఏళ్ళ మోహన్‌లాల్. ఇప్పటివరకూ తాను ఎన్ని మోర్చంగ్‌లను చేసి వుంటానో తనకు గుర్తులేదని అంటారాయన: "గిన్‌తీ సే బాహర్ హైఁ వో [లెక్కకు మించి ఉంటాయి]."
మోర్సింగ్ అని కూడా పిలిచే ఈ మోర్చంగ్ సుమారు 10 అంగుళాల పొడవుండి గుర్రపుడెక్క ఆకారపు లోహపు రింగుకు రెండు సమాంతర ఫోర్కులతో జతచేసి ఉంటుంది. వాటి మధ్య ట్రిగ్గర్ అని పిలిచే ఒక లోహపు నాలుక ఉంటుంది, దాని ఒక చివర కదలకుండా స్థిరంగా బిగించి ఉంటుంది. వాద్యకారుడు దానిని తన ముందు పళ్ళతో బిగించి పట్టుకొని దాని గుండా ఊపిరి పీల్చి వదులుతుంటారు. ఒక చేతితో మోర్చంగ్ నాలుకను కదిలించటం ద్వారా సంగీత స్వరాలను పలికిస్తూ, రెండవ చేతిని లోహపు కమ్మీని బిగించి పట్టుకోవడానికి ఉపయోగిస్తారు.












