జైపూర్ లోని ఉన్నత న్యాయస్థాన ప్రాంగణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కాని అక్కడి తోటలో ఉన్న ఒక వస్తువు మాత్రం రాజస్థాన్లో చాలామందిని కలవరపెడుతుంది. దేశం మొత్తంలో ‘చట్టం అందించే మను’ విగ్రహాన్ని గర్వంగా ప్రదర్శించే న్యాయస్థాన ప్రాంగణం బహుశా ఇదొక్కటే. (కవర్ ఫోటో చూడండి)
మను అనే వ్యక్తి నిజంగా ఉండేవాడో లేదో అసలు రుజువే లేని పరిస్థితిలో, ఈ విగ్రహాన్ని కళాకారుడి ఊహే రూపొందించిందని చెప్పవచ్చు. కాని ఆ ఊహ ఒక హద్దు దాటి వెళ్ళలేకపోయిందని తెలుస్తుంది. ఇక్కడ మను సినిమాలలో పదే పదే కనిపించే ‘ఋషి’ ఆకారాన్ని ధరించాడు.
పురాణాలలో, ఈ పేరుగల అతను మనుస్మృతిని రాసినట్టుంది. నిజానికి ఈ స్మృతులు శతాబ్దాల క్రితం బ్రాహ్మణులు సమాజం మీద విధించాలని చూసిన నిబంధనలు. ఈ నిబంధనలు విపరీతంగా కులతత్వమైనవి. ఎన్నో స్మృతులు ఉండేవి - ఇవి చాలామటుకు క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 1000 మధ్యలో రచించినవి. ఎందరో రచయితలు చాలా కాలం పాటు వీటిని సంగ్రహించారు. వీటిలో అన్నిటికన్నా ప్రాచుర్యం చెందినది మనుస్మృతి. ఒకే నేరానికి కులాన్ని బట్టి ప్రమాణాలను మార్చేయడంలోనే ఉంది దీని అసాధారణ తత్త్వం.
ఈ స్మృతిలో, తక్కువ కులాల వారి జీవితాలకు విలువ అంతంతమాత్రమే. ఉదాహరణకు “శూద్రుడిని హత్య చేసినందుకు చేసుకోవలసిన ప్రాయశ్చిత్తా”న్ని తీసుకోండి: వాళ్ళు చేయవలసింది “ఒక కప్ప, ఒక కుక్క, ఒక గుడ్లగూబ, లేదా ఒక కాకి”ని చంపిన మనిషి చేయవలసిన ప్రాయశ్చిత్తమే. “ఒక నీతిమంతుడైన శూద్రుడి”ని హత్య చేసినందుకు చేయవలసిన ప్రాయశ్చిత్తం మహా అయితే ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు చేయవలసిన దాంట్లో పదహారో వంతు.
ఇది, చట్టం అందరికీ సమానమే, అన్న నియమం మీద ఆధారపడే వ్యవస్థ అనుసరించవలసినదైతే కాదు. వారి పీడనకు చిహ్నమైన ఆ విగ్రహం న్యాయస్థానంలో ఉండటం రాజస్థాన్లో దళితుల కోపానికి కారణమవుతోంది. ఇంకా ఉద్రేకపరచే విషయం ఏమిటంటే, భారతదేశ రాజ్యాంగ నిర్మాతకి ఈ ప్రాంగణంలో చోటు లేదు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వీధి చివరన వచ్చీపోయే వాహనాల ఎదుట నించుని ఉంటుంది. మను మాత్రం న్యాయస్థానానికి వచ్చేవాళ్ళందరి ఎదుట హుందాగా నించునివుంటాడు.







