ఆ వర్క్ షాప్ దగ్గర నేమ్ బోర్డు లేదు! “యే తో ఏక్ గుమ్నామ్ దుకాన్ హై (ఇది కేవలం ఒక అనామక దుకాణం),” అని మొహమ్మద్ అజీమ్ అన్నారు. 8x8 అడుగులున్న ఆ షెడ్డుకున్న ఆస్బెస్టాస్ గోడలు మసి, సాలెగూళ్ళతో నిండి ఉన్నాయి. ఒక మూల చిన్న ఇనప కొలిమి ఉంది; షెడ్డు మధ్యలో, నల్లగా కాలిన మట్టి కుప్పపై నీలిరంగు టాపోలిన్ (tarpaulin) షీట్ కప్పబడి ఉంది.
ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు, పశ్చిమ హైదరాబాద్‌లో దూద్ బౌలిలోని ఇరుకైన సందుల గుండా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి, అజీమ్ తన వర్క్ షాప్ దగ్గర దాన్నిపార్క్ చేస్తారు; ఆ షెడ్డు ప్రహరీ గోడ అవతల హకీమ్ మీర్ వజీర్ అలీ స్మశానవాటిక ఉంది.
మురికి ప్లాస్టిక్ డబ్బాలు, తుప్పు పట్టిన లోహపు పెట్టెలు, విరిగిన బకెట్లు, వివిధ రకాల పనిముట్లు నేలపై చెల్లాచెదురుగా పడిపోయి, అసలు కదలడానికి కూడా జాగా లేని ఆ దుకాణంలో – ఇసుక క్యాస్టింగ్ ద్వారా లోహపు టోకెన్లను తయారు చేస్తూ – అతను తన రోజుని ప్రారంభిస్తారు.
28 ఏళ్ల అజీమ్ అచ్చు వేసే ఈ టోకెన్లను (లేదా నాణేలను), ఇప్పటికీ హైదరాబాద్ లోని కొన్ని పాత టీ కొట్లు, రెస్టారెంట్లు ఉపయోగిస్తున్నాయి. గతంలో ఇలాంటి క్యాంటీన్ టోకెన్లను మిల్లులు, మిలిటరీ అవుట్లెట్లు, రైల్వేలు, బ్యాంకులు, క్లబ్‌లు, సహకార సంఘాలు, ఇతర సంస్థలు ఉపయోగించేవి. కాలక్రమేణా ప్లాస్టిక్ నాణేలు/పేపర్ రసీదులు అందుబాటులోకి రావడంతో, ఈ లోహపు టోకెన్లకు ఉండే గిరాకీ బాగా పడిపోయింది. కానీ, ఇప్పటికీ హైదరాబాద్ లోని కొన్ని రెస్టారెంట్‌లు, తమ రోజువారీ ఆదాయాన్ని లెక్కించేందుకు వీటిపైనే ఆధారపడ్డాయి: కస్టమర్లు ఏదైనా ఆర్డర్ చేస్తే, ఆ వంటకానికి సంబంధించిన నాణేలు వారికి ఇచ్చి, వాటి ఆధారంగా మొత్తం ఆదాయాన్ని లెక్కిస్తాయి.
ప్రస్తుతం ఈ నాణేలను తయారుచేసే నైపుణ్యం కలిగిన కొద్దిమంది హస్తకళాకారులలో – కేవలం 10 కంటే తక్కువ మంది మాత్రమే హైదరాబాద్ లో ఉన్నారు – తానూ ఒకడని అజ్జూ (అజీమ్ కుటుంబ సభ్యులు, దుకాణదారులు అతనికి పెట్టిన ముద్దు పేరు) అంచనా.



















