“ఆమె ఎందుకు చనిపోయిందో నాకు తెలీదు కానీ, ఆమెకు శ్రద్ధగా చికిత్స చేయలేదని మాత్రమే చెప్పగలను,” అన్నాడు సుభాష్ కబడే, చనిపోయిన తన చెల్లి గురించి చెబుతూ.

మహారాష్ట్ర బీడ్ నగరంలోని  సివిల్ హాస్పిటల్ లో, లతా సుర్వసే చనిపోయే ముందు రాత్రి, ఆమెకు  అర్జెంటుగా ఇవ్వవలసిన రెండు ఇంజెక్షన్ల ను ఒక డాక్టర్  ప్రిస్క్రిప్షన్ రాసాడు. సుభాష్ వెంటనే మెడికల్ షాప్ కు పరుగెట్టి, నిముషాలలో ఇంజెక్షన్లను తెచ్చిపెట్టాడు. కానీ అప్పటికే ఆ డాక్టరు వెళ్లిపోయాడు.

“ఆయనకు అప్పటికే చాలామంది పేషెంట్లున్నారు. ఆయన వేరే వార్డ్ కి వెళ్ళిపోయాడు.” అన్నాడు పాతికేళ్ల సుభాష్. “నేను నర్స్ కి ఆ ఇంజెక్షన్లు ఇమ్మన్నాను కాని ఆ నర్స్, మా చెల్లి ఫైల్ వెతికి, అందులో ఏమి రాయలేదని చెప్పింది. కొద్ధినిముషాల క్రితమే ఆ మందులు డాక్టర్ నాకు రాసి ఇచ్చారని కాబట్టి ఫైల్ లో ఆ మందుల వివరాలు ఉండవని, చెప్పడానికి ప్రయత్నించాను.”

కానీ నర్స్ అతని మాటను వినలేదు. అతను గాభరాగా ఇంజెక్షన్లని ఇమ్మని బతిమాలితే, “ఆ వార్డ్ ఇంచార్జి సెక్యూరిటీ ని పిలుస్తానని బెదిరించాడు.” అన్నాడు సుభాష్. ఈ గొడవ సమసి ఆ రోగికి ఇంజక్షన్ ఇవ్వడానికి గంట పైనే పట్టింది.

లత ఆ తరవాత రోజు ఉదయం, మే 14 న చనిపోయింది. ఆమె ఏప్రిల్ 23 నుంచి ఆసుపత్రిలో ఉంది. ఆమెకి కోవిడ్ పాజిటివ్ అని పరీక్ష లో తేలింది. “అప్పుడప్పుడు నయం అవుతున్న లక్షణాలు కనిపించేవి.” అన్నాడు బీడ్ లో లాయర్ గా పనిచేస్తున్న సుభాష్. అతను ఇంజెక్షన్ల   గురించి కచ్చితంగా ఏం చెప్పలేకపోతున్నాడు, అవి సరైన టైం కి ఇచ్చి ఉంటే ఆమె బతికేదేమో. కానీ ఆసుపత్రిలో సిబ్బంది ఉండవలసిన వారి కన్నా చాలా  తక్కువగా ఉన్నారని మాత్రం అతనికి కచ్చితంగా తెలుసు. “దీని వలన రోగులకు ఇబ్బంది  అవుతోంది.” అన్నాడు.

కోవిడ్ 19 మార్చ్ నుంచి బాగా వ్యాపించడంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాల పై చాలా భారం పడింది. తక్కువ మంది సిబ్బంది ఉన్న ఆసుపత్రులు, అలసటతో పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, సరైన చికిత్స కొరవడిన రోగులు- ఇవి గ్రామీణ ప్రాంతాలలో లక్షలాదిమందికి అందే వైద్య సంరక్షణ గురించి చెబుతాయి.

Subash Kabade, whose sister died in the Beed Civil Hospital, says that the shortage of staff has affected the patients there
PHOTO • Parth M.N.

బీడ్ ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది లేకపోవడం వలన, రోగులకు చాలా ఇబ్బంది అవుతుంది అని అదే ఆసుపత్రి లో తన చెల్లి ని పోగొట్టుకున్న సుభాష్ కబడే అన్నాడు.

అసలే వాతావరణ మార్పు, నీటి ఎద్దడి, వ్యవసాయ సంక్షోభంలో ఉన్న ఈ మరాట్వాడా ప్రాంతం లోని బీడ్ లో సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ జూన్ 25 కు 92,400 పాజిటివ్ కేసులు, దగ్గరగా 2500 చావులు సంభవించాయి. కానీ రెండో వేవ్ లో ఒక దశలో కేసులు చాలా త్వరగా వ్యాపించాయి- ఏప్రిల్ 1 లో 26,400 కేసులు ఉంటే, మే 31 కి 87,400 కు పెరిగాయి. బీడ్ లో ఆరోగ్యసేవ, పెరిగిన కేసుల భారం కింద నలిగిపోయింది.

బీడ్ లో చాలా మంది ఉచిత చికిత్స దొరుకుతుందని ప్రజావైద్యసౌకర్యాలకే వెళ్తారు. ఇది ఎందుకంటే 26 లక్షల మంది ఉన్న ఈ జిల్లాలో వ్యవసాయ ఇబ్బందుల మూలంగా అప్పటికే చాలా కుటుంబాలు కొన్నేళ్లుగా అప్పులపాలై ఉన్నాయి.

జిల్లా లో తక్కువ లక్షణాలు కల కోవిడ్ రోగులను ముందుగా పంపించే 81 కోవిడ్ కేర్ సెంటర్లలో, మూడు సెంటర్లు తప్ప మిగిలిన వాటిని రాష్ట్ర ప్రభుత్వమే నడుపుతుంది. నయం కాని కోవిడ్ రోగులను  డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్(DCHC)కు బదిలీ చేస్తారు. బీడ్ లో మొత్తంగా 45 DCHC లు ఉన్నాయి, కానీ 10 మాత్రమే రాష్ట్రం నడుపుతుంది. అధికార యంత్రాంగం మొత్తం 48 DCHC లలో 5 DCHC లను నిర్వహిస్తుంది. ఈ ఐదు ఆసుపత్రులలో క్లిష్టమైన కేసులను చూస్తారు.

ఈ ప్రభుత్వ సౌకర్యాలలో సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు.

రెండో కోవిడ్ వేవ్ చాలా అధిక స్థాయిలో ఉన్నప్పుడు, బీడ్ లో రాష్ట్రం నడిపే కోవిడ్ సెంటర్లలో ఆరోగ్య సిబ్బంది సరిపడాలేరు. జిల్లా యంత్రాంగం తాత్కాలిక సిబ్బందిని తీసుకోమని అనుమతినిచ్చినా ఆ పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.

జిల్లా ఆరోగ్య అధికారి(District Health Officer/DHO) రాధాకృష్ణ పవార్ ప్రకారం, కేటాయించిన 33 ఫిజిషియన్ పోస్టులలో 9 మాత్రమే భర్తీ చేయబడ్డాయి.మొత్తం 21 ఆనెస్తిస్ట్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేటాయించిన స్టాఫ్ నర్సుల పోస్టులలో 448, 1004 వార్డ్ బాయ్(వార్డ్ అసిస్టెంట్ల) పోస్టులలో 301 ఖాళీగా ఉన్నాయి.

మొత్తంగా 16 క్యాటగిరీలలో  3,194 అనుమతించబడిన పోస్టులలో, 34 శాతం అంటే 1,085 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దీనివల్ల పని ఒత్తిడి చాలా  పెరుగుతోంది.

PHOTO • Parth M.N.

జ్యోతి కదం భర్త, బాలాసాహెబ్, ఆసుపత్రిలో చేర్పించిన ఒకరోజుకు చనిపోయాడు.

రెండో వేవ్ లో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది- ఏప్రిల్ 1 న 26,400 ఉన్న కేసులు, మే 31 నాటికి 87,400 కు పెరిగాయి. బీడ్ లో ఆరోగ్య సేవ ఇన్ని కేసుల భారంతో నలిగిపోయింది.

అందువలన 38 ఏళ్ళ బాలాసాహెబ్ కదం కు బీడ్ సివిల్ ఆసుపాత్రిలో వెంటిలేటర్ బెడ్ దొరికినప్పుడు, అతని బంధువులు ఆక్సిజన్ సిలిండరును ఆ ఆసుపత్రి స్టోరేజ్ గది నుండి  వార్డ్ వరకు మోసుకు రావలసి వచ్చింది. “సిబ్బంది లో ఒక్కరు కూడా చుట్టుపక్కల లేరు, అతని ఆక్సీజన్ పడిపోతూ ఉంది,” అని 33 ఏళ్ళ అతని భార్య జ్యోతి చెప్పింది. “అతని తమ్ముడు సిలిండర్ ని భుజాల మీద మోసుకుంటూ తెచ్చాడు. ఆ తరవాత వార్డ్ బాయ్ వచ్చి దానిని నా భర్తకి అమర్చాడు.”

కానీ బాలా సాహెబ్ బతకలేదు. నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోని యెలాంభట్ గ్రామం లో డిప్యూటీ సర్పంచ్ గా పని చేస్తున్న బాలాసాహెబ్, “ఎప్పుడూ బయట తిరుగుతూనే ఉండేవాడు”, అని చెప్తుంది జ్యోతి. “ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అతని సహాయం కోసం వచ్చేవారు.” అన్నది.

బాలాసాహెబ్  యెలాంభట్ లో వాక్సిన్ల గురించి అవగాహన పెంచేవాడు, అన్నది జ్యోతి. ఆమె స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. “అతను ప్రజలకు వాక్సిన్ల  పై అనుమానాలు పోయేలా పని చేసేవాడు. అందుకోసం అతను ఇంటింటికీ తిరిగేవాడు.” అలా అతను తిరిగిన సమయాల్లోనే  ఎప్పుడో కరోనా అంటుకుని ఉంటుందని జ్యోతి నమ్ముతుంది. ఇప్పుడు 9,14 ఏళ్ళ వయసున్న తన ఇద్దరు ఆడపిల్లలను ఆమె ఒంటరిగా పెంచవలసి ఉంది.

ఏప్రిల్ 25 న బాలా సాహెబ్ ఊపిరి ఆడక ఆయాసపడ్డాడు-  ఇది కరోనా లక్షణం. “అంతకు ముందు రోజు ఆతను మా పొలం లో పనిచేశాడు. అతనికి వేరే ఆరోగ్య ఇబ్బందులేమీ లేవు. కానీ అతను ఆసుపత్రిలో చేరిన ఒక్కరోజు లోనే చనిపోయాడు(ఏప్రిల్ 26 న)”, అన్నాడు అరవైయ్యేళ్ల అతని తండ్రి భగవత్ కదం. “అతను భయపడ్డాడు. అటువంటి సమయాల్లో డాక్టర్లు తమ రోగులతో అంతా బానే ఉందని చెప్పాలి. కాని డాక్టర్ల కి ఈ సమయం లో అంతగా మాట్లాడే అవకాశం ఎక్కడిది?”

ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నాగాని, కోవిడ్ రోగుల  కుటుంబ సభ్యులు వార్డ్ లో ఉన్న తమవారిని తామే చూసుకుంటామని అడుగుతారు. ఇది ముఖ్యంగా సిబ్బంది  తక్కువగా ఉన్న ఆసుపత్రులలో జరుగుతుంది. బీడ్ సివిల్  ఆసుపత్రులలో, అధికారులు బంధువులను దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆసుపత్రి సిబ్బందికి, పోలీసులకి, రోగుల కుటుంబ సభ్యులకి మధ్య వాగ్వాదాలు చాలా  జరుగుతాయి.

Bhagwat Kadam, Balasaheb's father, says his son was scared but the doctors didn't have time to assuage his fears
PHOTO • Parth M.N.

బాలాసాహెబ్ తండ్రి భాగవత్ కదం, తన కొడుకు భయపడినప్పుడు ధైర్యం చెప్పే డాక్టర్లు కరువయ్యారు అని చెప్పారు

అయినా సరే, వెళ్లిపొమ్మని ఎంత చెప్పినా రోగి కుటుంబ సభ్యులు ఆ చుట్టుపక్కలే ఉండి  ఏమాత్రం అవకాశం వచ్చినా, దొంగతనంగానైనా వెళ్లి ప్రియమైన వారిని చూసుకుని వస్తుంటారు. “మా వారిని బాగా చూసుకుంటారని ఏ మాత్రం నమ్మకం ఉన్నా, మేము అలా వెళ్లి చూడవలసిన అవసరం ఉండేది  కాదు”, అన్నారు 32 ఏళ్ళ నితిన్ సాథే, ఆసుపత్రి బయట పార్క్ చేసిన మోటార్ బైక్ పై కూర్చుని. “నా తల్లిదండ్రులిద్దరూ అరవైయేళ్ల పైబడిన వారే, ఇద్దరూ ఆసుపత్రిలో ఉన్నారు. వారిని అక్కడ ఎవరూ మంచినీళ్లు కావాలా, దాహం వేస్తుందా అని కూడా అడగరు.”

భయపడ్డ రోగికి మానసిక స్థైర్యం ఇవ్వడం చాలా ముఖ్యం, అంటాడు సాథే, ఇతను బ్యాంకు క్లర్క్ గా పని చేస్తున్నాడు. “నేను అక్కడే ఉంటే వారికి కావలసినవి సమకూర్చేవాడిని, ధైర్యం చెప్పేవాడిని. దానివలన వారిలో మానసిక బలం పెరిగేది. ఒకరే ఉంటే ఏవోక చెడు ఆలోచనలు వచ్చి, ఏం జరుగుతుందో అనే బెంగలో పడిపోతారు. దానివలన అనారోగ్యం నుంచి బయటపడడం కూడా కష్టమైపోతుంది.”

సాథే ఇక్కడున్న విషాదాన్ని గురించి కూడా చెబుతారు. “ఒకవైపేమో మమ్మల్ని ఆసుపత్రి బయటకు బలవంతంగా పంపించేస్తారు. ఇంకో పక్క ఆసుపత్రిలో రోగుల కోసం సరిపడా సిబ్బంది ఉండరు.”

మే రెండో వారం, సిబ్బంది తక్కువగా ఉండడం వలన జిల్లా యంత్రాంగం ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టివేయబడింది. ఒక స్థానిక పాత్రికేయుడు చాలా వరకు కోవిడ్ మరణాలను  అధికారిక లెక్కల్లోకి వేయలేదని కనిపెట్టారు.

29 ఏళ్ళ సోమనాథ్ ఖాతాల్ అనే పాత్రికేయుడు లోక్ మాట్ పత్రికకు పనిచేస్తాడు. అతను క్రెమటోరియం లో చనిపోయిన సంఖ్యను అధికారిక సంఖ్యలతో సరిచూస్తే 105 వరకు మరణాలు నమోదు కాలేదు అని తెలిసింది. “ఈ వార్త బయటపడగానే, జిల్లా  యంత్రాగం 200 వరకు మరణాలని ఎలానో సర్దవలసి వచ్చింది. కొందరు 2020 లో చనిపోయిన వారి వివరాలు కూడా అందులో ఉన్నాయి.” అన్నాడు ఆయన.

DHO పవార్ అది సిబ్బంది లేకపోవడం వలన జరిగిన పొరపాటు అని ఒప్పుకున్నారు. అంతే కాని జరిగిన మరణాలను తగ్గించడం కోసం చేసినది కాదని చెప్పారు. “మాకు ఒక పద్ధతి ఉంటుంది. ఒక మనిషి కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే మాకు కోవిడ్ పోర్టల్ ద్వారా సమాచారం చేరుతుంది. ఇక్కడ రోగిని అడ్మిట్ చేసుకుని, ఎంట్రీ వేసి చికిత్స, దాని పర్యవసానం చెప్పాలి”, వివరించారు పవర్.

Nitin Sathe sitting on a motorbike outside the hospital while waiting to check on his parents in the hospital's Covid ward
PHOTO • Parth M.N.

కోవిడ్ వార్డ్ లో ఉన్న తన తల్లిదండ్రుల గురించి కనుక్కోవాలని, ఆసుపత్రి బయట తన మోటార్ బైక్  పైన కూర్చుని ఎదురు చూస్తున్న నితిన్ సాథే

కానీ రోజుకు 25-30 మధ్య వచ్చే కోవిడ్ రోగులు, ఒకేసారి 1500 పైన పెరిగిపోయారు. “అంతమంది ఒకేసారి వచ్చినప్పుడు, ఎవరూ అంత శ్రద్ధ వహించలేకపోయారు.” అన్నారు పవార్. “వారు కోవిడ్-19 రోగులుగానే చికిత్స పొందారు కానీ మరణాలను పోర్టల్ లో అప్డేట్ చేయలేదు. మేము మా వలన జరిగిన తప్పును ఒప్పుకుని (వార్తను ప్రచురించాక) జిల్లాలలో మరణాల సంఖ్యను అప్డేట్ చేసాము.”

జిల్లా యంత్రాంగం తమ తప్పును ఒప్పుకున్నా, సుభాష్ విషయం లో మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకుంది. అతను కోవిడ్  ప్రోటోకాల్ ని పాటించకుండా “లత శవాన్ని అగౌరవపరిచాడు”, అని వారు చెప్పారు.

“ఆ ఆసుపత్రి సిబ్బంది యాంటిజెన్ టెస్ట్ చేశారు (శవం మీద), అది నెగటివ్ అని వచ్చింది,” అన్నాడు సుభాష్. “అందుకని వాళ్ళు నన్ను మా చెల్లి శవాన్ని ఇంటికి తీసుకెళ్లామన్నారు.”

సుభాష్, లత శవాన్ని బీడ్ కి 35 కిలోమీటర్ల  దూరంలో ఉన్న  జియోరై తాలూకాలో  ఆమె గ్రామమైన కుంభర్వాడి కి తీసుకువెళ్ళొచ్చేమో అని  ఆసుపత్రి సిబ్బందిని కనుక్కున్నాడు. లత తన భర్త రుస్తుం, నాలుగేళ్ల కొడుకు శ్రేయాస్ తో తన గ్రామం లో నివసించేది. “అది మా కుటుంబ కోరిక. ఆమెకు అంత్యక్రియలు జరపాలని అనుకున్నాము.”

కానీ వారు కుంభర్వాడి కి సగం దారిలో ఉండగానే ఆసుపత్రి సుభాష్ కి ఫోన్ చేసి శవాన్ని వెనక్కి తీసుకు రమ్మని చెప్పింది. “నేను నా బంధువులతో ఆసుపత్రి వారు చెప్పినట్లే చేయాలని,  ఎందుకంటే  ఇది అందరికి కష్టకాలమని చెప్పాను. మేము యు టర్న్ తీసుకుని శవాన్ని తీసుకుని వచ్చేసాము.”

కానీ సివిల్ ఆసుపత్రి సుభాష్ మీద ఎపిడెమిక్ డిసీజ్ ఆక్ట్, 1897 పై FIR ఫైల్ చేసింది. “ఒక కోవిడ్ పేషెంట్ హాస్పిటల్ లో చనిపోతే, అక్కడ కొన్ని ప్రొటొకాల్స్  ఆచరించాలి. ఈ ప్రొటొకాల్స్ ను లత బంధువులు పాటించలేదు,” అని రవీంద్ర జగ్తాప్, బీడ్ జిల్లా  డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ చెప్పారు. అటువంటి సందర్భం లో యాంటిజెన్ టెస్ట్ కు అర్థమే లేదు అని కూడా అన్నారు.

Left: Subash Kabade shows his letter to the district collector explaining his side in the hospital's complaint against him. Right: Somnath Khatal, the journalist who discovered the discrepancy in official number of Covid deaths reported in Beed
PHOTO • Parth M.N.
Left: Subash Kabade shows his letter to the district collector explaining his side in the hospital's complaint against him. Right: Somnath Khatal, the journalist who discovered the discrepancy in official number of Covid deaths reported in Beed
PHOTO • Parth M.N.

ఎడమ: జిల్లా కలెక్టర్ కి తను రాసిన ఉత్తరాన్ని చూపిస్తున్న సుభాష్ కబడే. కుడి : కోవిడ్ మరణాల సంఖ్యలో తేడాను గమనించిన పాత్రికేయుడు సోమనాథ్ ఖాతాల్

కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ తో మరణించిన రోగిని లీక్ అవని కవర్ లో చుట్టి, హాస్పిటల్ నుంచి క్రెమటోరియయంకి నేరుగా తీసుకువెళ్ళాలి.

లత శవాన్ని ఆసుపత్రి వారు తీసుకువెళ్లామన్నారు కాబట్టే తీసుకువెళ్ళానని సుభాష్ చెప్పాడు. “నేను ఒక లాయర్ ని, నాకు ప్రొటొకాల్స్ అర్థం అవుతాయి. నేను ఆసుపత్రికి వ్యతిరేకంగా ప్రవర్తించి నా కుటుంబాన్ని ఎందుకు కష్టపెడతాను?” అని అడిగాడు.

అతను  అంతకు ముందు కొన్ని రోజులుగా ఆసుపత్రిలో సిబ్బందికి, రోగులకు ఎటువంటి సహాయం అందించాడో గుర్తుంచుకొని బాధపడ్డాడు. “నేను కనీసం 150 మందిని ఆసుపత్రిలో చేరడానికి సాయం చేసాను. చాలా మంది రోగులకు చదవడం రాయడం రాదు, అందుకని భయపడ్డారు. నేను వారికి ఫార్మ్ నింపడానికి సాయం చేసి, వారు ఆసుపత్రి లో చేరేలా చూసాను. ఇదంతా ఆసుపత్రి వారు చేయవలసిన పని, కానీ సిబ్బంది తక్కువయ్యారని అర్థం చేసుకుని, నేను సహాయం చేసాను,” అన్నాడు సుభాష్.

లతకు కోవిడ్ సోకకముందు కూడా సుభాష్ రోగులకు ఆసుపత్రిలో చేరడానికి సహాయం అందిస్తూనే ఉన్నాడు. తన చెల్లి ఆసుపత్రిలో చేరడం తో కలిపి అతను మొత్తం ఒక నెలన్నర పాటు ఆసుపత్రికి తన సేవలు అందించానని చెప్పాడు.

అతని చెల్లి ఆసుపత్రిలో ఉండగా ఒకసారి ఒక కోవిడ్ రోగి బెడ్ మీద నుండి కింద పడిపోతే ఎత్తుకుని మళ్లీ పైకి చేర్చానని సుభాష్ చెప్పాడు. “ఆమె ఒక ముసలావిడ. ఆవిడ పడిపోతే ఎత్తి మళ్లీ బెడ్ మీద చేర్చేవాళ్ళు లేకపోయారు. ఆసుపత్రిలో పరిస్థితి ఇది. “

మనస్తాపానికి గురయి, కోపంగా ఉన్న సుభాష్, తన ఇంటికి ఎవరిని  పిలవకూడదు కాబట్టి, నన్ను బీడ్ హోటల్ లాబీలో కలిసాడు.“మా అమ్మానాన్న ఇంకా, మా చెల్లి చనిపోయిన షాక్ లోనే ఉన్నారు. వారు కనీసం మాట్లాడలేకపోతున్నారు. నేను కూడా సరిగ్గా లేను. లత  కొడుకు ఫోన్ చేసి, ‘మా అమ్మ ఎప్పుడు వస్తుంది’, అని అడుగుతున్నాడు. ఏమని చెప్పాలో తోచట్లేదు.”

అనువాదం : అపర్ణ తోట

Parth M.N.

पार्थ एम एन हे पारीचे २०१७ चे फेलो आहेत. ते अनेक ऑनलाइन वृत्तवाहिन्या व वेबसाइट्ससाठी वार्तांकन करणारे मुक्त पत्रकार आहेत. क्रिकेट आणि प्रवास या दोन्हींची त्यांना आवड आहे.

यांचे इतर लिखाण Parth M.N.
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

यांचे इतर लिखाण Aparna Thota