శాంతిలాల్, శాంతు, టిన్యో- ఒకే మనిషి, మూడు పేర్లు. ఇది చాలనట్టు అతనికి నాలుగో పేరు కూడా ఉంది. సాబర్కాంఠా జిల్లాలోని వడాలి గ్రామపు పలుకుబళ్ల పుణ్యమా అని అతన్ని శొంతూ అని పిలుస్తారు. మనమూ అదే పేరుతో పిలుద్దాం.
శొంతు ఒక ప్రత్యేకమైన మనిషి. ప్రత్యేకమూ అంటే అద్భుతం, ఒకే ఒక్కడు, ప్రముఖుడు- ఇలాంటి విశేషణాలకు చెందిన ప్రత్యేకత కాదది. బలహీనవర్గాల నిరుపేద దళితవ్యక్తి. విలువలకు కట్టుబడి ఉండటం అన్నది ఉంది చూశారూ- దానివల్ల అతగాడు గందరగోళపడుతూ, బాధలుపడుతూ, వాటిని సహిస్తూ ముందుకు సాగే మనిషిగా పరిణమించాడు శొంతూ. ఒకోసారి అతగాడు అసలు ఉనికేలేని జీవి అనిపిస్తాడు. మరోసారి అతడు ఒక సగటు మనిషికి ఎంతపాటి అస్తిత్వం ఉండదగునో అంతపాటి, ఛాయామాత్రపు ఉనికితో కనిపిస్తాడు.
ఆరుగురు కుటుంబ సభ్యులు - తల్లిదండ్రులు, ఒక అన్న, ఒక అక్క, ఒక చెల్లి. కనీస అవసరాలు తీర్చుకోలేని కటిక దారిద్ర్యం. పెరిగే నిత్యావసరాలు. తీర్చుకోలేని ఆర్థిక పరిస్థితి... ఈ నేపథ్యంలో పెరిగాడు శొంతూ. తల్లిదండ్రులు, అక్క, అన్న కలసి రెండుపూటలా తిండికి సరిపడేంత సంపాదిస్తారు. తండ్రి సరుకులు రవాణా చేసే మెటడోర్ వ్యాను డ్రైవరు. సరుకులే తప్ప అదనంగా ప్రయాణీకుల్ని ఎక్కించుకోరు- అంచేత ఆ అదనపు ఆదాయం రాదు. తల్లి కూడా రోజుకూలీగా పనిచేస్తుంది. ఆ పని ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు. తండ్రికి తాగుడు అలవాటు లేకపోవడం, ఇంట్లో అలజడులు లేకపోవడమనేది అదో సుకృతం. అది సుకృతమన్న సంగతి శొంతూకు ఎంతోకాలం తర్వాతగానీ తెలియలేదు.
వడాలి గ్రామంలోని హైస్కూల్లో శొంతూ తొమ్మిదోక్లాసు చదువుతున్నపుడు ఊర్లోకి సర్కస్ వచ్చింది. కానీ టిక్కెట్లు బాగా ఖరీదు. అయినా స్కూలు పిల్లలకు ఐదురూపాలకే అమ్మారు. శొంతూవాళ్ళకు ఆ ఐదు రూపాయలు కూడా కష్టమే. "నించో" టీచరు అజ్ఞాపించారు. "ఏం బాబూ, డబ్బులు తేలేదేం?" వాత్సల్యంగానే అడిగారు టీచర్. "మామ్, మా నాన్నకు జొరం. పత్తి మిల్లు కూల్డబ్బులు మా అమ్మకు ఇంకా అందలేదు," అంటూ శొంతూ ఏడవసాగాడు.
మర్నాడు కుసుమ్ పఠాన్ అన్న తోటి విద్యార్థిని- రంజాన్ పండుగ ఆశీర్వాదాలు పొందే ప్రక్రియలో భాగంగా- శొంతూకు పదిరూపాయలు అందించింది. ఆ మర్నాడు 'నేనిచ్చిన పది రూపాయలు ఏం చేశావ్?' అనడిగింది. 'ఐదు రూపాయలు సర్కస్ టికెట్టుకిచ్చాను. మిగిలిన ఐదూ ఇంటిఖర్చుల కోసం అప్పుగా ఇచ్చాను,' నిజాయితీగా చెప్పాడు శొంతూ. కుసుమ్, రంజాన్, శొంతూ, సర్కస్- అదో సౌమ్యమైన దయనిండిన ప్రపంచం.
అతను పదకొండో తరగతిలో ఉన్నపుడు వాళ్ళ మట్టి ఇంటిని ఇటుకలు, సిమెంటుతో తిరిగి కట్టాల్సిన అవసరం పడింది- గోడలకు గిలాబా(ప్లాస్టరింగ్) చేయించడం అన్న మాట ప్రణాళికలో లేదు. దానిక్కూడా వాళ్ళకు ఆర్థిక స్తోమత లేదు. తాపీ పనికి ఒక మనిషిని పెట్టుకుని ఇంటిల్లపాదీ ఆ పనిలో మునిగిపోయారు. అయితే ఆ పనికి చాలాకాలం పట్టింది. శొంతూ గమనించేలోగానే ఫైనల్ పరీక్షలు వచ్చేశాయి. పరీక్షలు రాయడానికి హాజరు తక్కువయింది. పరిస్థితి వివరించి బ్రతిమాలితే, ప్రధానోపాధ్యాయులు శొంతూను పరీక్షలు రాయనిచ్చారు.
పరీక్ష గట్టెక్కి పన్నెండో క్లాసుకు వెళ్లాడు శొంతూ. ఈసారి ఇంకా బాగా చదవాలి అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. గట్టిగా చదవడం మొదలెట్టాడు. ఈలోగా వాళ్ళమ్మకు జబ్బుచేసింది. జబ్బు ముదిరి ఆమె శొంతూ ఫైనల్ పరీక్షలకు కాస్తంత ముందు కన్నుమూశారు. ఆమెను పోగొట్టుకోవడం, ఆ వ్యథ- పద్దెనిమిదేళ్ళ కుర్రాడు భరించలేనంత బాధ. అయినా పరీక్షల కోసం బాగా చదివే ప్రయత్నం చేశాడు. కష్టపడి చదివాడు. ఫలితం లేకపోయింది. అరవై ఐదు శాతం మార్కులే వచ్చాయి. ఇక పైచదువులు అన్న ఆలోచన వదులుకోవాలనుకున్నాడు.
అతనికి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. రోజూ ఊళ్లోని గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు ఇంటికి తెచ్చుకుంటూండేవాడు. అతని ఆసక్తిని గమనించిన ఓ స్నేహితుడు వడాలి ఆర్ట్స్ కళాశాలలో చరిత్ర సబ్జెక్టుగా తీసుకొని డిగ్రీ చదవమని ప్రోత్సహించాడు. 'ఆ సబ్జెక్టు తీసుకుంటే ఎన్నో గొప్ప పుస్తకాలు చదివే అవకాశం ఉంటుంది ' అని వివరించాడు. శొంతూ కళాశాలలో చేరాడు. కానీ అక్కడి గ్రంథాలయంలో పుస్తకాలు తెచ్చి ఇచ్చిరావడానికే తన రాకపోకలు పరిమితం చేశాడు. మిగిలిన సమయమంతా పత్తి మిల్లులో పనిచెయ్యడానికే వినియోగించసాగాడు. సాయంత్రాలు ఊళ్లో రికామీ తిరిగేవాడు. పుస్తకాలు చదివేవాడు. బియ్యే మొదటి ఏడాదిలో అరవైమూడు శాతం మార్కులు వచ్చాయి.
ఆ మార్కులు చూసి వాళ్ల ప్రొఫెసరు 'కాలేజీకి రెగ్యులర్గా రా' అని చెప్పారు. శొంతూకు క్రమక్రమంగా డిగ్రీ చదువు మీద మక్కువ ఏర్పడింది. అలా బియ్యే మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఆ ఏడాది వాళ్ళ కళాశాలవాళ్ళు పుస్తకాలు చదివే నైపుణ్యం ఉన్న విద్యార్థికి ఎవార్డు ఇవ్వాలనుకున్నారు. ఆ ఎవార్డు శొంతూకు వచ్చింది. 'నీకు గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తీసుకునేంత సమయం ఎలా కుదురుతోంది శాంతిలాల్?" గొప్ప ఆశ్చర్యంతో అడిగారు వాళ్ల ప్రొఫెసరు. 2003లో బియ్యే మూడో సంవత్సరం అరవై ఆరు శాతం మార్కులతో పాసయ్యాడు శొంతూ.







