శేరింగ్ దోర్జీ భూటియా తన ఆదాయం కోసం విల్లుల తయారీ మీద ఎన్నడూ ఆధారపడలేదనే సంగతి ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టిన కాసేపటికి కానీ అర్థం కాలేదు. ఎందుకంటే, పాక్‌యోంగ్ జిల్లాలోని కార్తోక్ గ్రామంలోని తన జీవితం అంతా ఈ హస్తకళా నైపుణ్యంలోనే గడిచిపోయిందన్న విషయాన్ని ఈ 83 ఏళ్ల వృద్ధుడు పలుమార్లు నొక్కి చెప్పారు. 60 ఏళ్ల పాటు ఆయన చెక్కపని ద్వారా -ప్రధానంగా ఫర్నీచర్ మరమ్మత్తుల ద్వారా - ఆదాయం గడించారు. అయితే ఆయనకు స్ఫూర్తినిచ్చింది మాత్రం తన స్వస్థలం అయిన సిక్కిం రాష్ట్ర సంస్కృతిలో ఇమిడి ఉన్న విలువిద్య మాత్రమేనని ఆయన చెప్పారు.
ఆయనకు ఎన్నో దశాబ్దాలుగా చెక్కపనిలో నైపుణ్యం ఉన్నా, దానిపై ఆయనకు అంతగా ఆసక్తి లేదు. దానికి బదులుగా పాక్‌యోంగ్ విల్లు తయారీ నిపుణుడిగా పేరొందడమే ఆయన ఆకాంక్ష.
“నాకు 10 - 12 ఏళ్లు ఉన్నప్పటి నుండే చెక్కతో వివిధ వస్తువులను తయారు చేసేవాడిని. నెమ్మదిగా అవి విల్లు ఆకారాన్ని సంతరించుకొన్నాయి, జనం వాటిని కొనడం ప్రారంభించారు. అలా నాలో విల్లు తయారీదారు జన్మించాడు,” అని శేరింగ్ PARIతో చెప్పారు.
“గతంలో, ఈ విల్లును వేరే విధంగా తయారు చేసేవారు,” అని తాను తయారు చేసిన వాటిలో కొన్నింటిని మాకు చూపిస్తూ వివరించసాగారు. “ఇది పాత రకానికి చెందినది, దీనిని [నేపాలీ భాషలో] తబ్జూ అని పిలుస్తారు. ఇందులో రెండు కర్ర ముక్కలను చేర్చి కట్టి, పైన చమడా (తోలు)తో చుట్టేవారు. ఈరోజుల్లో మేము చేస్తున్నదాన్ని ‘బోట్ డిజైన్’ అని పిలుస్తారు. ఒక విల్లును తయారు చేయడానికి కనీసం మూడు రోజులు పడుతుంది. యువకులకు ఆ మాత్రం సమయం సరిపోతుంది. ముసలివాళ్లకు ఇంకొన్ని రోజులు పడుతుంది,” అని శేరింగ్ అల్లరిగా నవ్వుతూ చెప్పారు.














