“పద్నాలుగు, పదహారు, పద్దెనిమిది...” అఠ్ఠ్యా వీపుకు తగిలించిన కావడి సంచిలో తాను పెడుతున్న పచ్చి ఇటుకలను లెక్కించడం ఆపేసి, ఇక బయలుదేరమన్నట్టు ఆ గాడిదతో ఇలా అన్నారు ఖండూ మానే: “చలా (పద)...ఫ్ర్‌ర్...ఫ్ర్‌ర్...” ఆ వెంటనే అఠ్ఠ్యాతో పాటు మరో రెండు బరువులెక్కించిన గాడిదలు దాదాపు 50 మీటర్ల దూరంలో ఉన్న బట్టీ (ఆవం) వైపు నడక ప్రారంభించాయి; ఇటుకలను ఆవంలో కాల్చేందుకు అక్కడ దింపుతారు.
“ఇంకో గంట కష్టపడితే మేం విశ్రాంతి తీసుకోవచ్చు,” అన్నారు ఖండూ. కానీ, అప్పటికి సమయం ఉదయం తొమ్మిదే అయ్యింది! మా అయోమయం ముఖాలను చూసి అతనిలా వివరించారు: “మధ్యరాత్రి ఒంటిగంటకు చీకటితోనే పని మొదలుపెట్టాం. మా బదిలీ ఉదయం 10 గంటలకు ముగుస్తుంది. రాత్ భర్ హే అసంచ్ చాలూ అహే (రాత్రంతా మేం ఈ పనే చేస్తున్నాం).”
ఖండూకి చెందిన గాడిదల గుంపులోని నాలుగు గాడిదలు ఖాళీ సంచులతో ఆవం నుండి తిరిగి వచ్చాయి; అతను మళ్ళీ లెక్క మొదలుపెట్టారు: “పద్నాలుగు, పదహారు, పద్దెనిమిది...”
ఉన్నట్టుండి, “రుకో (ఆగు)...” అంటూ ఒక గాడిదని ఉద్దేశించి హిందీలో అరిచారు మానే. “ఇక్కడి మా గాడిదలు మరాఠీని అర్థంచేసుకుంటాయి కానీ, ఇది రాజస్థాన్‌కు చెందినది. దీనికి హిందీలో సూచనలివ్వాలి,” మనసుతీరా నవ్వుతూ చెప్పారాయన. అలాగే సరదాగా మాకొక డెమో కూడా ఇచ్చారు: “రుకో”. గాడిద ఆగింది; “చలో”. గాడిద కదిలింది!
తన నాలుగు కాళ్ళ స్నేహితులంటే ఖండూకి ఉన్న గర్వం స్పష్టంగా తెలిసిపోతోంది. “లింబూ, పంధర్యాలు మేతకు బయలుదేరాయి; అలాగే నాకిష్టమైన బుల్లెట్ కూడా. అది పొడుగ్గా, సొగసుగా ఉంటుంది. మహా చురుకైనది కూడా!”
















