సోమవారం ఉదయం 11 గంటలకు, మునేశ్వర్ మాంఝీ (41) తన ప్లాస్టరింగ్ చేయని, శిథిలమైన ఇంటి వెలుపల ఉన్న చౌకీ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నివాసం ముందున్న ఆ ఖాళీ స్థలంలో, వెదురు స్తంభాలకు కట్టివున్న నీలిరంగు పాలిథిన్ పట్టా అతనికి ఎండ తగలకుండా కాపాడుతోంది. కానీ అది ఉమ్మదం నుండి ఎటువంటి ఉపశమనాన్నీ కలిగించటం లేదు. “గత 15 రోజులుగా నాకు పని లేదు," అన్నారు, పాట్నా నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకో పట్టణానికి సమీపంలోని ముసహరి టోలా లో నివసించే మునేశ్వర్.
ముసహరి టోలా అనే పదాన్ని, దళిత సామాజిక వర్గమైన ముసహర్కు చెందిన వ్యక్తులు నివసించే ప్రాంతాన్ని సూచించేందుకు ఉపయోగిస్తారు. ఈ టోలా లో 60 కుటుంబాలు నివాసముంటాయి. మునేశ్వర్తో సహా ఆ టోలా లో నివసించేవారు సమీపంలోని వ్యవసాయ భూముల్లో పనిచేయడం ద్వారా వచ్చే రోజువారీ కూలీపై ఆధారపడి జీవిస్తారు. అయితే పనులు సక్రమంగా దొరకడం లేదని మునేశ్వర్ చెబుతున్నారు. ఖరీఫ్ , రబీ పంటలు విత్తేటప్పుడూ, కోత సమయంలోనూ సంవత్సరంలో 3-4 నెలలు మాత్రమే వారికి పని దొరుకుతుంది.
అతనికి చివరిసారి పని దొరికింది,' బాబు సాహిబ్ ' అనే రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన భూ యజమాని పొలంలో. “రోజులో ఎనిమిది గంటల పనికి మాకు 150 రూపాయల నగదు, లేదా 5 కిలోల బియ్యం చెల్లిస్తారు. అంతే," అంటూ వ్యవసాయ కూలీలకు దొరికే రోజువారి కూలీ గురించి మునేశ్వర్ చెప్పారు. నగదుకు బదులుగా ఇచ్చే బియ్యంతో పాటు మధ్యాహ్న భోజనంగా 4-5 రోటీలు, లేదా అన్నం, పప్పు, కాయగూరలతో చేసిన ఒక కూర ఇస్తారు.
భూమిలేని పేదలకు పంచేందుకు భూస్వాములు తమ భూమిలో కొంత భాగాన్ని వదులుకున్న 1955 నాటి భూదాన్ ఉద్యమ సమయంలో అతని తాతకు మూడు బిఘాల (దాదాపు రెండు ఎకరాలు) వ్యవసాయ భూమి లభించినప్పటికీ, అది ఇతనికి పెద్దగా ఉపయోగపడలేదు. “ఆ భూమి మేము నివసించే ప్రదేశానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. మేం పంట వేసినప్పుడల్లా జంతువులు వాటిని తినేయటంతో మాకు నష్టమే మిగులుతోంది,” అని మునేశ్వర్ వివరించారు.
సంవత్సరంలో ఎక్కువ రోజులు మునేశ్వర్ కుటుంబంతో పాటు టోలాలోని ఇతర కుటుంబాలు మహువా దారూ (విప్ప సారా)ను – ( మధుకా లాంగిఫోలియా వర్ . లాటిఫోలియా ) మహువా పువ్వులతో తయారుచేసిన మద్యం - తయారుచేసి, అమ్ముతూ జీవిస్తున్నారు.
అయితే, ఇది ప్రమాదకరమైన వ్యాపారం. బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం, 2016 అనే ఒక కఠినమైన రాష్ట్ర చట్టం మద్యం లేదా మత్తు పదార్థాల తయారీనీ, వాటిని కలిగివుండటాన్నీ, వాటి అమ్మకం లేదా వినియోగాన్నీ నిషేధించింది. 'దేశీయ లేదా సంప్రదాయ మద్యం'గా చెప్పే మహువా దారూ ( విప్ప సారాయి) కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది.
కానీ ప్రత్యామ్నాయ ఉద్యోగావకాశాలు లేకపోవడం వల్ల దాడులు, అరెస్టులు, అభియోగాల భయం ఉన్నప్పటికీ మునేశ్వర్ మద్యం తయారీని కొనసాగించాల్సి వచ్చింది. “ఎవరు మాత్రం భయపడరు? మాకు భయం అనిపిస్తుంది. కానీ, పోలీసులు దాడులు చేసినప్పుడు, మేము మద్యాన్ని దాచేసి పారిపోతాం,” అని అతను చెప్పారు. అక్టోబర్ 2016లో నిషేధం అమలులోకి వచ్చినప్పటి నుండి పోలీసులు టోలాపై 10 కంటే ఎక్కువ సార్లే దాడి చేశారు. “నేప్పుడూ అరెస్టు కాలేదు. వాళ్ళు పాత్రలనూ, చుల్హా (మట్టి పొయ్యి) ను చాలాసార్లు నాశనం చేశారు, కానీ మా పనిని మేం చేసుకుంటూపోతున్నాం.
ముసహర్ ల లో ఎక్కువ మంది భూమి లేనివారు. దేశంలో అత్యంత అట్టడుగున ఉండి , సామాజికంగా వివక్షకు గురవుతున్న వర్గాలలో ఒకటి. వాస్తవానికిది అడవులలో నివసించే ఒక మూలవాసీ తెగ. ఈ వర్గానికి ఈ పేరు ముసా (ఎలుక), ఆహార్ (ఆహారం) అనే రెండు పదాల నుండి నుండి వచ్చింది. దీని అర్థం 'ఎలుకలను తినేవారు' అని. బిహార్‌లో ముసహర్లు షెడ్యూల్డ్ కులంగా, దళితులలో మహాదళిత్‌గా జాబితా చేయబడ్డారు. అంటే దళితుల్లో ఆర్థికంగా, సామాజికంగా అత్యంత వెనుకబడినవారు. కేవలం 29 శాతం అక్షరాస్యతతో, ఎటువంటి నైపుణ్య అభివృద్ధి లేని వీరి జనాభా 27 లక్షల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. మహువా దారూ వీరి సంప్రదాయ పానీయం అయినప్పటికీ, ఇప్పుడది ఎక్కువగా జీవనోపాధి కోసమే ఉత్పత్తి అవుతోంది.
మునేశ్వర్ తనకు 15 ఏళ్ల వయసప్పటి నుంచి మహువా దారూ తయారు చేస్తున్నారు. “మా నాన్న చాలా పేదవాడు. ఠేలా (సామాన్లు రవాణా చేయడానికి చేతితో లాగే చెక్క బండి) లాగేవాడు. దాంతో వచ్చే సంపాదన సరిపోయేది కాదు. కొన్నిసార్లు ఖాళీ కడుపుతో బడికి వెళ్లాల్సి వచ్చేది. దాంతో కొన్ని నెలల తర్వాత నేను బడికి వెళ్లడం మానేశాను. చుట్టుపక్కల కొన్ని కుటుంబాలు మద్యాన్ని తయారు చేస్తుండటంతో నేను కూడా మొదలుపెట్టాను. నేను గత 25 సంవత్సరాలుగా దీన్ని తయారుచేస్తున్నాను." అని అతను చెప్పారు.
మద్యం తయారుచేయడమనేది చాలా సమయం తీసుకునే ప్రక్రియ. మొదట మహువా పువ్వులను గుర్ (బెల్లం), నీటితో కలిపి, అవి పులవడానికి ఎనిమిది రోజులు నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని చుల్హా పై అమర్చిన ఒక లోహపు హండీ (కుండ)లోకి తీసుకొని ఉడకబెట్టాలి. అడుగుభాగం తెరచి ఉన్న మరొక చిన్న మట్టి హండీ ని ఆ లోహపు హండీ పై ఉంచుతారు. ఈ మట్టి హండీ కి ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుండి ఒక పైపు అమర్చివుంటుంది. ఈ మట్టి హండీ పైన నీరు ఉన్న మరొక లోహపు హండీ ని ఉంచుతారు. ఆవిరి బయటకు పోకుండా నిలిచివుండేందుకు ఈ మూడు హండీ ల మధ్య ఉండే ఖాళీలను మట్టితోనూ, గుడ్డముక్కలతోనూ పూడుస్తారు.
ఉడుకుతున్న మహువా మిశ్రమం నుంచి వచ్చే ఆవిరి మట్టి హండీ లోకి జమవుతుంది. ఇది పైపు ద్వారా దిగువన ఉన్న లోహపు పాత్రలోకి చుక్కలుగా జారిపోతుంది. దాదాపు ఎనిమిది లీటర్ల మద్యాన్ని తయారు చేయడానికి మూడు నుండి నాలుగు గంటల పాటు మంట మీద స్థిరంగా ఉడకబెట్టాల్సివుంటుంది. "మంటలు మండుతూ ఉండటానికి మేము అక్కడే (పొయ్యి దగ్గర) నిలబడాల్సి ఉంటుంది" అని మునేశ్వర్ చెప్పారు. “చాలా వేడిగా ఉంటుంది. మన శరీరాలు కాలతాయి. అయినా సరే, జీవనం కోసం మేమిది చేయాల్సిందే.” అతను ఈ తయారీ ప్రక్రియను ' మహువా చువానా ' అని పిలుస్తారు.
మునేశ్వర్ ఒక నెలలో 40 లీటర్ల మహువా దారూ తీస్తారు. దీనికి అతనికి 7 కిలోల పువ్వులు, 30 కిలోల బెల్లం, 10 లీటర్ల నీరు అవసరమవుతాయి. పూలను రూ.700కు, బెల్లం రూ. 1,200కు కొంటారు. పొయ్యిలో కాల్చేందుకు 10 కిలోల కట్టెలకు 80 రూపాయలు ఖర్చుచేస్తారు. ముడిసరుకుపై అతని నెలవారీ మొత్తం ఖర్చు రూ. 2,000.
“మేం మద్యాన్ని అమ్మడం ద్వారా నెలకు రూ. 4,500 సంపాదిస్తాం" అని మునేశ్వర్ చెప్పారు. "ఆహారానికి అయ్యే ఖర్చు తీసేస్తే, కష్టమ్మీద 400-500 రూపాయలు ఆదా చేయగలుగుతాం. ఈ డబ్బును బిస్కెట్లు, టాఫీల కావాలంటూ తరచుగా అడిగే పిల్లల కోసం ఖర్చు చేస్తాం." అతని భార్య 36 ఏళ్ల చమేలీ దేవి. వీరికి 5 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి చిన్న కుమారునికి 4 సంవత్సరాల వయస్సు. చమేలి కూడా వ్యవసాయ కూలీగా పనిచేస్తూ భర్తతో కలిసి మద్యం తయారు చేస్తుంటారు.
వారి దగ్గర మద్యం కొనేవాళ్ళు ప్రధానంగా సమీప గ్రామాల నుండి వచ్చే కూలీలు. “మేం 250 మిల్లీలీటర్ల మద్యానికి రూ.35 వసూలు చేస్తాం," అని మునేశ్వర్ చెప్పారు. “తాగేందుకు వచ్చేవారు మాకు నగదు రూపంలో చెల్లించాలి. ఉధార్ (అప్పు)గా తాగాలనుకునేవారికి మేం మద్యం ఇవ్వడానికి ఒప్పుకోం.
మద్యం కోసం డిమాండ్ భారీగా ఉంటుంది. కేవలం మూడు రోజుల్లో ఎనిమిది లీటర్ల వరకూ అమ్ముడవుతుంది. కానీ ఎక్కువ పరిమాణంలో మద్యం తయారు చేయడం ప్రమాదకరం. "పోలీసులు దాడులు చేసినప్పుడు, వారు మొత్తం మద్యాన్ని ధ్వంసం చేస్తారు, మేం నష్టపోతాం," మునేశ్వర్ జతచేశారు. ఈ 'నేరం' శిక్షార్హమైనది. ఇందుకు కఠిన జైలు శిక్ష ఉంటుంది. అది యావజ్జీవ జైలు శిక్షగా కూడా పొడిగించబడవచ్చు. ఇదే కాకుండా లక్ష నుంచి పది లక్షల రూపాయల వరకు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
మునేశ్వర్ విషయంలో మద్యం ఒక లాభాలనిచ్చే సంస్థ కాదు; అది తన మనుగడకు ఒక సాధనం. "నా ఇంటిని చూడండి, దీనికి మరమ్మత్తులు చేయించడానికి కూడా మా దగ్గర డబ్బు లేదు," తన ఒక గది ఇంటిని చూపిస్తూ చెప్పారతను. దాన్ని సరిచేయడానికి అతనికి కనీసం రూ.40,000-50,000 అవసరమవుతాయి. గదిలోపలి గోడలు మట్టివి, కింద ఉన్నది మట్టి నేల. గాలి వచ్చేందుకు కిటికీ కూడా లేదు. గదికి ఒక చివర చుల్హా ఉంది, అక్కడే బియ్యం కోసం ఒక లోహపు కుండ, పంది మాంసం కోసం కడాయి (పాన్) కూడా ఉంచుతారు. “మేం పంది మాంసం ఎక్కువగా తింటాం. ఇది మాకు ఆరోగ్యకరం," అని మునేశ్వర్ చెప్పారు. టోలాలో మాంసం కోసం పందులను పెంచుతారు. 3-4 దుకాణాలలో విక్రయించే ఈ పంది మాంసం ధర కిలో రూ. 150-200 ఉంటుందని మునేశ్వర్ చెప్పారు. కూరగాయల మార్కెట్ ఆ ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. "మేం కొన్నిసార్లు మహువా దారూ ను కూడా తీసుకుంటాం," అని అతను చెప్పారు.
2020లో వచ్చిన కోవిడ్-19 లాక్డౌన్లు మద్యం అమ్మకాలపై అంతగా ప్రభావాన్ని చూపలేదు. మునేశ్వర్ ఆ కాలంలో నెలకు రూ. 3,500-4,000 వరకూ సంపాదించారు. "మేం మహువా , గుర్ (బెల్లం) ఏర్పాటు చేసుకొని, మద్యాన్ని తయారుచేశాం," అని అతను చెప్పారు. “మారుమూల ప్రాంతాల్లో అంతగాకోవిడ్ నిబంధనలు అమలులో లేవు కాబట్టి ఇది మాకు సహాయపడింది. మాకు వినియోగదారులు కూడా దొరికారు. మద్యం సేవించడం చాలా సాధారణం, ప్రజలు దానిని ఎంత ధర చెల్లించైనా తీసుకుంటారు."
అయితే, అతని తండ్రి మార్చి 2021లో మరణించడంతో అతను అప్పులపాలయ్యారు. ఆచారం ప్రకారం అంత్యక్రియలు చేయడానికి, తమ వర్గానికి భోజనం ఏర్పాటు చేయడానికి, మునేశ్వర్ రాజ్‌పుత్ కులానికి చెందిన ప్రైవేట్ వడ్డీ వ్యాపారి నుండి ఐదు శాతం వడ్డీపై రూ. 20,000 అప్పుచేశారు. "మద్యంపై నిషేధం లేనట్లయితే, నేను తగినంత డబ్బును (మరింత మద్యాన్ని తయారుచేసి) ఆదా చేసి, రుణాన్ని తిరిగి చెల్లించేవాడిని," అని అతను చెప్పారు. “ఎవరైనా అనారోగ్యం పాలైతే నేను అప్పు చేయాల్సివస్తోంది. ఈ విధంగా అయితే మేం బతికేదెలా?”
గతంలో మునేశ్వర్ మంచి ఉద్యోగావకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి నిరాశతో తిరిగివచ్చారు. అతను మొదట 2016లో భవన నిర్మాణ పనుల కోసం మహారాష్ట్రలోని పూణెకి పని చేయడానికి వెళ్ళారు, కాని మూడు నెలల్లోనే ఇంటికి తిరిగి వచ్చారు. “నన్ను అక్కడికి తీసుకెళ్లిన కాంట్రాక్టర్ నాకు పని ఇవ్వలేదు. దాంతో విసుగొచ్చి తిరిగి వచ్చేశాను,” అని అతను చెప్పారు. 2018లో ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి, ఈసారి ఒక నెలలోనే తిరిగి వచ్చారు. “రోడ్లను త్రవ్వడానికి నెలకు కేవలం రూ. 6,000 మాత్రమే వచ్చేవి. అందుకని తిరిగి వచ్చేశాను,” అని అతను చెప్పారు. "అప్పటి నుండి నేను ఎక్కడికీ వెళ్ళలేదు."
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ విధానాలు ముసహరీ టోలా లోకి ప్రవేశించలేదు. ఉపాధిని కల్పించే ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కానీ టోలా పరిపాలనను కూడా నిర్వహించే గ్రామ పంచాయతీ ముఖియా (పెద్ద) మాత్రం మద్యం తయారీని నిలిపివేయాలని స్థానిక వాసులను కోరుతున్నారు. " సర్కార్ [ప్రభుత్వం] మమ్మల్ని విడిచిపెట్టేసింది" అని మునేశ్వర్ చెప్పారు. “మేం నిస్సహాయులం. దయచేసి సర్కార్ వద్దకు వెళ్లి, మీకు టోలా లో ఒక్క మరుగుదొడ్డి కూడా కనిపించలేదని చెప్పండి. ప్రభుత్వం మాకు సహాయం చేయడం లేదు కాబట్టి మద్యం తయారుచేయాలి. ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడమో, లేదా చిన్న దుకాణం ప్రారంభించడానికో, మాంసం- మచ్లి (చేపలు) అమ్ముకోవడానికో డబ్బు ఇస్తే, అప్పుడు మేం మద్యం వ్యాపారాన్నింక కొనసాగించం."
ముసహరి టోలా నివాసి అయిన 21 ఏళ్ల మోతీలాల్ కుమార్‌కి మహువా దారూ ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరు. సక్రమంగా వ్యవసాయ పనులు జరగకపోవడం, తక్కువ వేతనాల కారణంగా అతను 2016లో నిషేధం విధించడానికి 2-3 నెలల ముందు నుంచి మద్యం తయారుచేయడం ప్రారంభించాడు. "మాకు రోజువారీ కూలీగా కేవలం ఐదు కిలోల బియ్యం మాత్రమే ఇచ్చేవారు." 2020లో తనకు కేవలం రెండు నెలల వ్యవసాయ పనులు మాత్రమే దొరికాయని అతను చెప్పాడు.
మోతీలాల్, అతని తల్లి కోయిలీ దేవి (51), అతని భార్య బులాకీ దేవి(20), అందరూ మహువా దారూ తయారీలోనే ఉన్నారు. వారు ప్రతి నెలా సుమారు 24 లీటర్ల మద్యాన్ని తయారుచేస్తారు. "మద్యాన్ని తయారు చేయడం ద్వారా నేను సంపాదించే డబ్బంతా ఆహారం, బట్టలు, మందుల కోసం ఖర్చు అవుతుంది" అని ఆయన చెప్పాడు. “మేం చాలా పేదవాళ్లం. మద్యం తయారుచేస్తున్నా డబ్బు మాత్రం ఆదా చేసుకోలేకపోతున్నాం. నా కూతురు అనూని ఎలాగోలా చూసుకుంటున్నాను. నేను ఎక్కువ (మద్యం) తయారుచేస్తే, నా ఆదాయం పెరుగుతుంది. అందుకోసం నాకు డబ్బు (పెట్టుబడి) కావాలి. కానీ అదే నా దగ్గర లేదు.”
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ) కార్యక్రమం ఇక్కడి ముసహర్లకు పెద్దగా ఉపయోగపడలేదు. మునేశ్వర్కు ఏడేళ్ల క్రితం ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ కార్డు వచ్చినప్పటికీ, అతనికి ఎలాంటి పని కల్పించలేదు. మోతీలాల్‌కు ఎమ్‌జిఎన్ఆర్ఇజిఎ గానీ, ఆధార్ కార్డ్ గానీ లేదు. టోలా లోని చాలా మంది నివాసితులు ఆధార్ కార్డ్‌ని పొందడం అంటే, డబ్బు వసూలు చేయడానికి ప్రభుత్వం పన్నే ఎత్తుగడగా భావిస్తున్నారు. “మేం (మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న) బ్లాక్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు, వారు ముఖియా సంతకం ఉన్న లేఖను అడుగుతారు. మేం ముఖియా లేఖను వారికి ఇచ్చినప్పుడు, వారు బడి నుండి ఒక లేఖను తెమ్మంటారు. నేను బడి నుంచి లేఖను తీసుకొచ్చి ఇచ్చినపుడు, వాళ్ళు డబ్బు అడుగుతారు,” అని మోతీలాల్ చెప్పాడు. “బ్లాక్ అధికారులు 2,000 నుండి 3,000 రూపాయలు లంచం తీసుకున్న తర్వాతనే ఆధార్ కార్డులను ఇస్తారని నాకు తెలుసు. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.”
ముసహరి టోలా లో సరైన జీవన పరిస్థితులు లేవు. మరుగుదొడ్లు లేవు, కనీసం కమ్యూనిటీ మరుగుదొడ్డి కూడా లేదు. ఏ ఇంట్లోనూ ఎల్పిజి కనెక్షన్ లేదు. ప్రజలు ఇప్పటికీ వంటకూ, మద్యాన్ని తయారుచేయడానికీ కూడా కట్టెలనే ఉపయోగిస్తున్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ, ఇది డజనుకు పైగా పంచాయతీలకు సేవలు అందించాలి. "చికిత్స సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి, దాంతో ప్రజలు ప్రైవేట్ క్లినిక్‌లపై ఆధారపడతారు" అని ముఖియా చెప్పారు. నివాసితులు చెప్పిన ప్రకారం, కోవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో టోలా లో ఒక్క కోవిడ్ -19 టీకా శిబిరాన్ని కూడా నిర్వహించలేదు. అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణా అధికారులెవరూ ఈ ప్రాంతాన్ని సందర్శించలేదు.
కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో మద్యం అమ్మకాలపైనే టోలా లోని కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. "మాకు ఎక్కడా ఉద్యోగాలు లభించవు, కాబట్టి మేము మజ్ బూరీ (తప్పనిసరి) వలన మద్యం తయారు చేస్తున్నాం" అని మోతీలాల్ చెప్పారు. "మేం మద్యం తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మేం దానిని తయారు చేయడం మానేస్తే, చనిపోతాం.”
భద్రతా కారణాల దృష్ట్యా, కథనంలోని వ్యక్తుల పేర్లూ, స్థలాల పేర్లూ మార్చబడ్డాయి.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి