"చూడండి! నా మోటారు ఇంకా మట్టిలో పూడిపోయేవుంది," వరద నీటిలో మునిగి ఉన్న పంపును బయటకు తీయడానికి తవ్వుతూ అన్నారు దేవేంద్ర రావత్. దేవేంద్ర, మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా, సుంద్ గ్రామానికి చెందిన రైతు. "వరదలు భూమిని మొత్తంగా కోసేశాయి. నా మూడు మోటార్లు భూమిలో కూరుకుపొయ్యాయి. ఒక బావి కూడా కూలిపోయింది. నేనిప్పుడేం చెయ్యాలి?" 48 ఏళ్ల ఆ రైతు అడుగుతున్నారు.
నరవర్ తహశీల్లోని సుంద్ గ్రామం సింధ్ నదికి చెందిన రెండు ఉపనదుల మధ్య వుంది. ఆగస్టు 2021లో వచ్చిన వరద 635 మంది (2011 జనాభా లెక్కల ప్రకారం) వున్న ఆ గ్రామంలో తీవ్ర వినాశనాన్ని మిగిల్చింది. తానెప్పుడూ అలాంటి వరదని అంతకుముందు చూడలేదని దేవేంద్ర అన్నారు. "వరద నీళ్ళు దాదాపు ముప్పై బిఘాల్లోని (దాదాపు 18 ఎకరాలు) పంటను నాశనం చేశాయి. మా కుటుంబం ఆరు బిఘాల నేలను ఈ వరద మేట వేయటం వల్ల శాశ్వతంగా కోల్పోయింది." అని ఆయన అన్నారు.
కాళీపహాడీలోని గ్రామం నాలుగు వైపులా వరద నీటితో నిండిపోయి ఒక ద్వీపాన్ని తలపిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా వర్షాలు పడ్డప్పడు అవతలి వైపుకు వెళ్లాలంటే గ్రామస్థులు నీళ్ళల్లో నడవడమో, లేదంటే ఈత కొడుతూ వెళ్లడమో చెయ్యాల్సివస్తోంది.
"వరద వచ్చినప్పుడు మా గ్రామం మూడు రోజులు పూర్తిగా నీట మునిగే వుంది," అన్నారు దేవేంద్ర. ఇక్కడే ఉంటామన్న ఒక 10, 12 మందిని తప్పిస్తే అందరినీ ప్రభుత్వ పడవలు కాపాడాయి. గ్రామస్థులు దగ్గరలోని మార్కెట్లోని శిబిరాలలో తలదాచుకోవడమో, లేదా వారి బంధువుల ఇళ్ళకు వెళ్ళటమో చేశారు. అప్పుడు పోయిన కరెంటు రావడానికి ఒక నెల రోజులు పట్టిందని దేవేంద్ర గుర్తుచేసుకున్నారు.










