ఆగష్టు 2020 లో తన రెండవ కాన్పు తరవాత, అంజనీ యాదవ్ ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అప్పటి నుంచి ఇంతదాకా మళ్లీ వెనక్కి వెళ్లలేకపోయింది. 31 ఏళ్ళ  అంజనీ, ఆమె ఇద్దరు పిల్లలు బీహార్ రాష్ట్రం, గయా జిల్లాలో, బోధ్ గయ బ్లాక్ లో, బాక్రూర్ గ్రామంలో ఉన్న ఆమె తల్లిదండ్రులతో ఉంటున్నారు. తన భర్త ఏ గ్రామానికి చెందినవాడో చెప్పలేదు గాని అది అరగంట దూరంలోనే ఉందని తెలిసింది.

“ప్రభుత్వ ఆసుపత్రిలో నా కాన్పు అయిన రెండు రోజుల తరవాత, నా భాభీ(భర్తకు వదిన) వంట చేసి ఇల్లు శుభ్రం చేయమని అడిగింది.  ఆమె కూడా తన కాన్పయ్యాక ఈ పనులన్నీ అదే ఇంట్లో చేశానని చెప్పింది. ఆమె నాకన్నా పదేళ్లు పెద్దది. నా ప్రసవం అప్పుడు నేను చాలా రక్తాన్ని కోల్పోయాను. బిడ్డ పుట్టకముందే మా నర్స్ నాకు అధిక రక్త హీనత ఉందని చెప్పి నన్ను కూరగాయలు, పండ్లు తినమని చెప్పింది. నేను నా అత్తగారింట్లో ఉండిపోయుంటే  నా పరిస్థితి అధ్వానంగా తయారయ్యేది.”

చాలా రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో, పిల్లలు, మహిళలలో రక్తహీనత, పోయిన అర్ధ దశాబ్దంలో ఘోరంగా మారింది అని ఇటీవలి నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే (NFHS - 5)  తెలుపుతోంది.

తన భర్త, 32 ఏళ్ళ సుఖీరామ్, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఒక బట్టల కంపెనీలో  పనిచేస్తాడని అంజని చెప్పింది. అతను తన ఇంటికి గత ఏడాదిన్నరగా రాలేదు. “అతను నా కాన్పు సమయానికి రావలసి ఉంది, కానీ అతని కంపెనీవారు రెండు రోజులకన్నా ఎక్కువ సెలవు తీసుకుంటే అతనిని పనిలోంచి తీసేస్తామని బెదిరించారు. ఈ  కరోనా రోగం తరవాత మా పరిస్థితి ఆర్ధికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా చాలా  పాడయింది. ఇవన్నీ ఒంటరిగా భరిస్తున్నాను.”

“అందుకే అతను లేని సమయంలో, ఇక చచ్చిపోయే  పరిస్థితి వస్తుందని అక్కడనుంచి తప్పించుకుని వచ్చేశాను. ప్రసవం తర్వాత తీసుకునే  జాగ్రత్తల గురించి మర్చిపోండి, ఎవరూ నాకు పనులు చేయడానికి సాయం వచ్చేవారు కాదు, ఇక బిడ్డని చూసుకోవడానికి ఎవరూ లేరు,”  అన్నదామె PARI తో. అంజని యాదవ్ ఇంకా రక్తహీనతతో బాధపడుతూనే ఉంది, రాష్ట్రంలో ఆమె ఉన్నటువంటి పరిస్థితిలో లక్షలాదిమహిళలున్నారు.

బీహార్లోని 64 శాతం మహిళలు రక్తహీనత తో బాధపడుతున్నారని NFHS - 5 రిపోర్ట్ చెబుతోంది.

“పునరుత్పత్తి వయసులో ఉన్న ఆడవారిలో రక్త హీనత తగ్గించే ప్రయత్నాలలో భారత దేశం ఏ మాత్రం మెరుగుపడలేదని, 15 నుండి 49 మధ్య  ఉన్న మహిళలలో 51.4 శాతం ప్రభావితమయ్యారని”, కోవిడ్ - 19  సందర్భం గురించి ప్రస్తావిస్తూ 2020 గ్లోబల్  న్యూట్రిషనల్ రిపోర్ట్ చెబుతోంది.

PHOTO • Jigyasa Mishra

అంజనీ యాదవ్ పోయిన ఏడాది తన రెండవ బిడ్డ పుట్టాక తల్లిదండ్రుల ఇంటికి  వచ్చి, ఇక  ఇక్కడే ఉంటోంది. ఆమెకి తన అత్తగారింట్లో ఎటువంటి సహాయం కానీ సంరక్షణ కాని అందలేదు. ఆమె భర్త దూరప్రాంతంలో పనిచేస్తున్నాడు

ఆరేళ్ళ క్రితం పెళ్ళైన అంజని,  పెళ్ళైన ఆడవారిలానే దగ్గరలో ఉన్న అత్తగారింటికి వెళ్ళింది . ఆమె భర్త కుటుంబంలో అతని తలిదండ్రులు, ఇద్దరు అన్నలు, వారి భార్యాపిల్లలు ఉన్నారు. అంజని ఎనిమిదవ తరగతి తరవాత చదువు మానేసింది. ఆమె భర్త 12వ తరగతి వరకు చదివాడు.

బీహార్‌లో 15-19 వయసులోని మహిళలకు, కౌమారదశ సంతానోత్పత్తి రేటు 77 శాతం అని NFHS-5 చెబుతోంది. రాష్ట్రంలోని మొత్తం మహిళల్లో 25 శాతానికి పైగా సాధారణంగా  ఉండవలసినదానికంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) కలిగి ఉన్నారు. ఇంతేగాక 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల గర్భిణీ స్త్రీలలో 63 శాతానికి పైగా రక్తహీనత తో ఉన్నట్లు సర్వే చెబుతోంది.

బాక్రూర్ లోని ఆమె తల్లిదండ్రుల ఇంటిలో, అంజని తన తల్లి, అన్న, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలతో ఉంటోంది. ఆమె అన్న 28 ఏళ్ళ అభిషేక్, గయా పట్టణం లో డెలివరీ మాన్ గా పనిచేస్తున్నాడు. అంజని తల్లి కూడా  ఇళ్లలో పని చేస్తుంది. “అందరి జీతాలు కలిపితే నెలకు 15,000 రూపాయిల వరకు వస్తాయి.  ఎవరూ నేను ఇక్కడ ఉండడంతో సమస్య ఉందని ఎవరూ అనక పోయినా, నేను వీరిపై భారంగా ఉన్నాననిపిస్తుంది.” అన్నది అంజని.

“నా భర్త సూరత్ లో, అతనితో  కలిసి పనిచేసే మరో ముగ్గురితో పాటుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతను ఇంకొంచెం డబ్బులు పొదుపు చేసి విడిగా ఒక ఇల్లు తీసుకుంటే, మేము అక్కడికి(సూరత్) వెళ్లి ఉండొచ్చు.” అన్నది అంజని.

*****

“రండి, నేను నా స్నేహితురాలి దగ్గరకు తీసుకు వెళ్తాను. ఆమె అత్తగారు, తన జీవితాన్ని నరకం చేసింది.” అంజని చెప్పింది. నేను ఆమెతో పాటు గుడియా ఇంటికి వెళ్లాను. నిజం చెప్పాలంటే అది గుడియా  ఇల్లు కాదు, ఆమె భర్తది. 29 ఏళ్ళ గుడియా, నలుగురు పిల్లల తల్లి. ఆ నలుగురిలో చిన్నవాడు అబ్బాయి. ఆమె అత్తగారు గుడియాని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోకుండా ఆపుతుంది, తన కోడలు ఇంకో మనవడిని కనాలని చెబుతుంది. గుడియా, దళిత వర్గానికి చెందిన మహిళ.

చాలా రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో, పిల్లలు, మహిళలలో రక్తహీనత, పోయిన అర్ధ దశాబ్దంలో ఘోరంగా మారింది అని ఇటీవలి నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే (NFHS - 5)  తెలుపుతోంది

“మా అత్తగారికి ఒక మగపిల్లాడు కావాలని చెప్పేది. ముగ్గురు ఆడపిల్లల తరవాత ఒక మగపిల్లవాడు కలిగాడు నాకు. ఇప్పుడు జీవితం కాస్త తేలిక పడింది అనుకుంటే, నీకు ముగ్గురు ఆడపిల్లలు కదా ఒకడు సరిపోడు కనీసం ఇద్దరు మగపిల్లలు ఉండాలి అని చెబుతుంది. ఆమె నన్ను ఆపరేషన్ చేయించుకోనివ్వడం లేదు.” అన్నది గుడియా PARI తో.

2011 జనాభా లెక్కల ప్రకారం, బీహార్‌లో బాల లింగ నిష్పత్తిలో గయ మూడో స్థానంలో ఉంది.  0-6 వయస్సులో ఉన్న రాష్ట్ర సగటు నిష్పత్తి 935 అయితే జిల్లా నిష్పత్తి 960.

గుడియా రేకుల కప్పు ఉన్నరెందు గదుల మట్టి ఇంట్లో ఉంది. ఆ ఇంటికి టాయ్ లెట్ సౌకర్యం లేదు. ఆమె భర్త 34 ఏళ్ళ, శివ సాగర్, అతని తల్లి, గుడియా పిల్లలు అందరూ ఈ చిన్న ఇంట్లోనే ఉంటారు. శివ సాగర్ ఒక స్థానిక ఢాబాలో సహాయకుడిగా పనిచేస్తున్నాడు.

పదిహేడేళ్లకే పెళ్ళైన గుడియా ఎన్నడూ బడికి వెళ్ళలేదు. “ఐదుగురు ఆడపిల్లలున్న ఇంట్లో మొదటి ఆడపిల్లని నేనే. మా ఇంట్లో వారికి నన్ను బడికి పంపేంత స్థోమత లేకపోయింది.” అన్నదామె. “కానీ నా ఇద్దరు చెల్లెల్లు, ఒక్కగానొక్క తమ్ముడు, వీడే అందరిలోనూ చిన్నవాడు- వీరు బడికి వెళ్లారు.”

గుడియా ఇంట్లో ముందుగది తలుపు తెరవగానే నాలుగు అడుగులున్న ఇరుకు సందుకు అవతల, వీరింటికి కలిసిపోయిననంత దగ్గరగా ఎదురిల్లు ఉంది. అదే గదిలో పుస్తకాలు నిండి  ఉన్న రెండు స్కూల్ బాగులు వేలాడుతున్నాయి. “ఇవి నా పెద్ద పాపలవి. ఏడాదిగా వీటిని అసలు ముట్టుకోలేదు.” అన్నది గుడియా. ఆ ఆడపిల్లలు - పదేళ్ళ  ఖుష్బూ, ఎనిమిదేళ్ల వర్ష చదువుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇక్కడ బడులు మొదటి కోవిద్ వేవ్ సమయంలో మూతబడి ఇప్పటిదాకా ఇంకా తెరుచుకోలేదు.

PHOTO • Jigyasa Mishra

ఇంకో మగపిల్లవాడు కలగాలని గుడియా అత్తగారు, గుడియాని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోనివ్వడం లేదు

“కనీసం నా పిల్లలో ఇద్దరు, బడిలో మధ్యాన భోజన పథకం వలన రోజులో ఒక పూట, కడుపు నిండా అన్నం తినేవాళ్లు. ఇప్పుడు ఏది దొరికితే అది తిని ఎలాగోలా బతుకీడుస్తున్నాము.” అన్నది గుడియా.

బడులు మూసేయడం మూలంగా వారి  ఆకలి ఇంకా పదునెక్కింది. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పెద్ద పిల్లలుండి, మధ్యాన భోజన పథకం లేక, ఏమి చెయ్యాలో అర్థం కానట్లుంది. అంజని కుటుంబం లాగ, గుడియా వాళ్ళకీ కూడా ఒక నికరమైన ఉద్యోగం కానీ, ఆహార భద్రత కానీ లేవు. ఏడుగురు ఉన్న ఆ కుటుంబం, ఆమె భర్త నిలకడ లేని ఉద్యోగంలో వచ్చే 9,000 రూపాయలతో బతుకుతుంది.

2020 గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ప్రకారం, "అనధికారిక ఆర్థిక వ్యవస్థ కార్మికులు ప్రమాదపు అంచున ఉంటారు, ఎందుకంటే వీరిలో ఎక్కువమందికి సామాజిక రక్షణ కానీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కానీ అందుబాటులో లేదు. లాక్‌డౌన్‌ సమయంలో వీరికి ఆదాయాన్నిచ్చే వనరులు లేక, ఆదాయాన్ని ఆర్జించే మార్గం లేక, చాలామంది తమను, తమ కుటుంబాలను పోషించుకోలేకపోయారు. చాలామందికి, ఆదాయం లేదు అంటే ఆహారం లేదు, లేదా, తక్కువ ఆహారం లేక తక్కువ పోషకమైన ఆహారంతో సరిపెట్టుకోవాలి అని అర్థం.”

గుడియా కుటుంబం, పైన చెప్పిన చిత్రానికి సరిగ్గా సరిపోతుంది. ఆకలితో యుద్ధమే కాక, దళితులై ఉండడం వలన సమాజం యొక్క చిన్నచూపును  కూడా తట్టుకోవలసి ఉంటుంది. ఆమె భర్త ఉద్యోగానికి భద్రత లేదు. ఆ ఇంటిలో ఎవరికీ ఏమాత్రమూ ఆరోగ్యసేవల సదుపాయం లేదు.

*****

సూర్యుడు అస్తమించగానే, బోధ్ గయా బ్లాక్ లోని ముసహర్ తోలా (బస్తి లేదా కాలనీ)లో జీవితం మళ్లీ మామూలుగా సాగిపోతుంది. పనులన్నీ ముగించుకున్నాక ఈ కాలనీ మహిళలు- మన దేశం లోని షెడ్యూల్డ్ కులాలలో అందరికన్నా అట్టడుగున ఉన్న వీరు, గుమికూడి సాయంత్రాలు కబుర్లతోనూ, ఒకరి తలలో మరొకరు పేలు చూసుకుంటూనో లేక పిల్లల తలలో చూస్తూనే గడిపేస్తారు.

వారి చిన్న ఇళ్ల బయట గుమ్మాలలో కూర్చుని ఉన్నారు అందరూ. అది ఒక ఇరుకు గల్లి, ఇరువైపులా మురుగు కాలవ పారుతోంది. “ఓహ్, ముసహర్ తోలా లు ఇలా ఉంటాయని మీకు చెప్పి ఉంటారు కదా. మాకు కుక్కలు, పందుల మధ్య బ్రతకడం అలవాటయిపోయింది,” అన్నది 32 ఏళ్ళ మాలా దేవి. ఈమెకు 15 ఏళ్లకు పెళ్ళయింది. అప్పటినుంచి ఇక్కడే నివసిస్తోంది.

ఆమె భర్త 40 ఏళ్ళ లల్లన్ అదిబాసి, గయా జిల్లా హెడ్ క్వార్టర్లోని  ఒక ప్రైవేట్ క్లినిక్ లో  సఫాయి పని  చేస్తున్నాడు. మాలా ఎప్పుడూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని అనుకోలేదు, కానీ ఇప్పుడు నలుగురి బదులు ఒక బిడ్డ మాత్రమే కానీ ఉంటే సరిపోయేది అని పశ్చాత్తాప పడుతోంది.

వారి పెద్ద కొడుకు, 16 ఏళ్ళ శింబు, ఒకడే బడిలో నమోదయి ఉన్నాడు- అది కూడా 9వ తరగతిలో. “నా కూతురిని మూడవ తరగతి దాటి చదివించే ధైర్యం చేయలేకపోయాను. లల్లన్ కి  5,500 రూపాయిలు వస్తాయి, ఇంట్లో మేమంతా కలిపి ఆరుగురం ఉన్నాం. మా  అవసరాలు ఎలా తీరుతాయి?”,  ఆమె అడిగింది. మాలా పెద్ద సంతానం,చిన్న సంతానం- ఇద్దరూ అబ్బాయిలే, మధ్యలో ఇద్దరూ అమ్మాయిలు.

PHOTO • Jigyasa Mishra

మాలాదేవికి కుటుంబ నియంత్రణ అన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు, కానీ ఇప్పుడు నలుగురి పిల్లల బదులు ఒక్కరే ఉంటే బావుండేది అని అనుకుంటుంది

ఇక్కడ కూడా, విద్యాసంస్థలు మూతబడినప్పుడు, ఇక్కడ తోల లో స్కూల్  కు వెళ్లే కొద్దిమంది పిల్లలు కూడా వెళ్లడం ఆపేశారు. అంటే మధ్యాహ్నం భోజనం అందడం లేదని, ఆకలి ఇంకా  పదునెక్కుతోందని అర్థం. అంతా బాగున్న సమయాలలో కూడా, అతి తక్కువ మంది పిల్లలు స్కూల్ కు వెళ్తారు. సాంఘిక చిన్నచూపు, వివక్ష, ఆర్ధిక ఒత్తిడి వీటివలన ముసాహారుల  పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు, వేరే వర్గపు పిల్లలకన్నా ఎక్కువగా,  స్కూల్ మానేస్తారు.

2011 సెన్సస్ లో బీహార్లో దగ్గరగా 2.72 మిలియన్ల ముసాహారులు ఉన్నారని లెక్క తేలింది. దుసాద్లు, చమార్ల తరవాత వీరు మూడవ పెద్ద షెడ్యూల్డ్ కుల వర్గం వారు. రాష్ట్రంలోని మొత్తం 16.57 మిలియన్ల దళితులలో వీరి జనాభా ఆరవ వంతు ఉంది. 2011 సెన్సస్ ప్రకారం, ఇది మొత్తం104 మిలియన్ల  బీహార్ జనాభాలో 2.6 శాతం వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఆక్స్ఫామ్ రిపోర్ట్ 2018 ప్రకారం, “96.3 శాతం పైన ముసాహార్లకు భూమిలేదు, 92.5 శాతం రైతు కూలీలుగా పనిచేస్తున్నారు. ఉన్నత కులాల హిందువులు ఇంకా అస్పృస్యులుగా భావించే ఈ వర్గంలో అక్షరాస్యత 9.8 శాతం మాత్రమే ఉంది. ఇది దేశంలోని దళితులందరికన్నా తక్కువ. ఇక మహిళలలో అక్షరాస్యత 1-2 శాతం వరకు ఉంది.”

ఇక్కడి అక్షరాస్యత రేటు చూసాక కలిగిన విషాదం -  గౌతముడికి కలిగిన జ్ఞానోదయంతో సమానం.

“మమ్మల్ని పిల్లలని కనేవారిగానే చూస్తున్నారు. కానీ ఇదంతా చేయడానికి కూడా  డబ్బులుండాలి కదా?”  అని తన చిన్నపిల్లాడికి  రాత్రి మిగిలిన అన్నం తినమని ఇచ్చిన  మాలా కోపంగా  అడుగుతుంది. “ఇదే ఉంది ఇప్పుడు. తిను లేదా చావు”, అన్నదామె  తన కొడుకుతో. ఆమె నిస్సహాయత కోపంగా మారింది.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ఆమె భర్త చనిపోయాక శిబాని ఆమె భర్త సోదరుడి మీద ఆధారపడుతోంది. కుడి: సాయంత్రాలు, బోధ్ గయా కాలనీ బయటి ఉన్న ఇరుకు సందులో, మహిళలంతా వారి ఇంటి బయట గుమ్మాల వద్ద కుర్చుని మాట్లాడుకుంటారు

ఈ బృందం లో ఉన్న వారిలో  29 ఏళ్ళ శిబాని అదిబాసి ఉంది. ఆమె భర్త ఊపిరితిత్తుల కాన్సర్ తో చనిపోయాక, శిబాని ఆమె ఇద్దరు పిల్లలతో ఆమె భర్త ఇంట్లో ఎనిమిదిమంది గల కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకంటూ ఏమి ఆదాయం లేదు, కాబట్టి ఆమె తన మరిది మీద ఆధారపడింది. “అతనిని ప్రత్యేకంగా నాకోసం, పిల్లల కోసం కూరగాయలు, పళ్ళు  తెమ్మని చెప్పలేను. అతను ఎప్పుడు ఏం ఇచ్చినా దానికి కృతజ్ఞులై ఉన్నాము. మేము గంజి అన్నం ఎక్కువగా తింటాం.” అన్నది శిబాని PARI తో.

ఆక్సఫమ్ నివేదిక ప్రకారం, “బీహార్లో ని ముసహర్ జనాభాలో 85 శాతం మంది, పౌష్టికాహార లోపం తో బాధపడుతున్నారు.”

గ్రామీణ బీహార్లోని దళిత మహిళల కథలన్నీ మాలా, శిబానీల కథల వంటివే.

బీహార్లో షెడ్యూల్ కులం జనాభాలో దాదాపుగా 93 శాతం గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. రాష్ట్రం లో ఉన్న అన్ని జిల్లాలో కన్నా గయా లో దళితుల జనాభా ఎక్కువగా, 30.39 శాతం ఉన్నది. ముసాహారులు  మహాదళిత్ వర్గంలోకి వస్తారు - వీరు షెడ్యూల్డ్ కులాలలో అందరికన్నా బలహీనులు, పేదవాళ్లు.

అంజని, గుడియా, మాలా, శిబాని - వీరంతా వివిధ సాంఘిక, ఆర్ధిక వర్గాల నుండి వచ్చారు. కానీ  ఎవరికీ వారి శరీరాల మీద హక్కు లేదు. ఇదే గాక వారు  రకరకాల స్థాయిలలో వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంజని ఆమె గత కాన్పు నుంచి రక్తహీనత తో ఇంకా పోరాడుతూనే ఉంది.గుడియా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందామకున్న ఆశని కోల్పోయింది. మాలా, శిబాని వారి జీవితం ఇదివరకు కన్నా ఇంకా మెరుగవుతుందన్న ఆలోచనే విరమించుకున్నారు, బ్రతికి ఉంటే చాలు అన్నట్టుంది వారి పరిస్థితి.

ఈ కథనంలో ప్రస్తావించిన వారి అసలు పేర్లు, వారి ఉనికిని కాపాడడం కోసం మార్చాము .

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే [email protected] కిఈ మెయిల్ చేసి [email protected] కి కాపీ పెట్టండి.

జిగ్యస మిశ్రా ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర స్వేచ్ఛపై నివేదికలు అందిస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.

అనువాదం: అపర్ణ తోట

Jigyasa Mishra

Jigyasa Mishra is an independent journalist based in Chitrakoot, Uttar Pradesh.

यांचे इतर लिखाण Jigyasa Mishra
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

यांचे इतर लिखाण Priyanka Borar
Editor : P. Sainath

पी. साईनाथ पीपल्स अर्काईव्ह ऑफ रुरल इंडिया - पारीचे संस्थापक संपादक आहेत. गेली अनेक दशकं त्यांनी ग्रामीण वार्ताहर म्हणून काम केलं आहे. 'एव्हरीबडी लव्ज अ गुड ड्राउट' (दुष्काळ आवडे सर्वांना) आणि 'द लास्ट हीरोजः फूट सोल्जर्स ऑफ इंडियन फ्रीडम' (अखेरचे शिलेदार: भारतीय स्वातंत्र्यलढ्याचं पायदळ) ही दोन लोकप्रिय पुस्तकं त्यांनी लिहिली आहेत.

यांचे इतर लिखाण साइनाथ पी.
Series Editor : Sharmila Joshi

शर्मिला जोशी पारीच्या प्रमुख संपादक आहेत, लेखिका आहेत आणि त्या अधून मधून शिक्षिकेची भूमिकाही निभावतात.

यांचे इतर लिखाण शर्मिला जोशी
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

यांचे इतर लिखाण Aparna Thota