లక్ష్మీబాయి కాలే ప్రతి సంవత్సరం తన పంటలో కొంత భాగాన్ని కోల్పోతోంది. అయితే ఆమెకు వచ్చే నష్టం అధిక వర్షపాతం లేదా కరువు లేదా నాసిరకం వ్యవసాయ పద్ధతుల వల్ల కాదు. “పంచాయతీ,  జంతువులను మా  భూమిపై మేపడానికి అనుమతిస్తుంది. ఇందువలన మేము లెక్కలేనన్ని నష్టాలను అనుభవించాము.” అన్నది 60 ఏళ్ల లక్ష్మీబాయి.

లక్ష్మీబాయి, ఆమె భర్త వామన్ మూడు దశాబ్దాలుగా నాసిక్ జిల్లాలోని మొహదీ గ్రామంలో ఐదు ఎకరాల స్థలాన్నిసాగుచేస్తున్నారు. అయితే గైరాన్ - ప్రభుత్వ నియంత్రణలో ఉన్న గ్రామ కామన్స్‌లో వీరి భూమి- పచ్చిక భూమిగా ఉపయోగించబడుతుంది. ఆ దంపతులేమో అక్కడ కంది, సజ్జలు, జొన్న,వరిని పెంచుతారు. "తమ పశువులను మా భూమిలో మేపడానికి అనుమతించకపోతే గ్రామస్తులు మాపై కేసు పెడతారని పంచాయతీ సభ్యులు అంటున్నారు" అని ఆమె చెప్పారు.

లక్ష్మీబాయితో పాటు దిండోరి తాలూకాలోని ఆమె గ్రామానికి చెందిన ఇతర రైతులు 1992 నుండి తమ భూ హక్కుల కోసం పోరాడుతున్నారు. “మూడు తరాలుగా ఈ భూమిని మా కుటుంబం సాగు చేస్తోంది. కాని మేము ఈ భూమిని మా  స్వంతం అని చెప్పుకోలేకున్నాము,” అని ఆమె అన్నారు. "2002 లో, మేము మా భూమి హక్కుల కోసం సత్యాగ్రహాన్ని, ‘జైల్ భరో ఆందోళన్’ ని చేసాము." ఆ సమయంలో, దాదాపు 1,500 మంది రైతులు, వారిలో ఎక్కువ మంది మహిళలు నాసిక్ సెంట్రల్ జైలులో 17 రోజులు గడిపినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.

మహారాష్ట్రలో ఇతర వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చబడిన లోహర్ కులానికి చెందిన, భూమి పట్టా లేని లక్ష్మీబాయికి - పంటనష్టాన్ని భరించడానికి ఎటువంటి సహాయం లేదు." భూమి మా పేరున లేనందున, మాకు [పంట] రుణాలు లేదా భీమా లభించవు" అని ఆమె చెప్పారు. అందుకని ఆమె  వ్యవసాయ కూలీగా  రోజుకు రెండుసార్లు ఎనిమిది గంటల షిఫ్టులు పనిచేసి పంట నష్టాలను తట్టుకుంటుంది.

భిల్ జాతికి చెందిన ఆదివాసీ రైతు, వితంతువు అయిన విజబాయి గంగూర్డే (55) ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఆమె మొహదీలోని తన భూమికి దూరంగా జీవించలేదు. "నా రెండు ఎకరాల భూమిలో ఎనిమిది గంటలు పనిచేసిన తరువాత, నేను మరో ఎనిమిది గంటలు [వేరొకరి భూమిలో] వ్యవసాయ కూలీగా పని చేస్తాను" అని విజబాయి చెప్పారు, ఈమె  తన రోజును ఉదయం 7 గంటలకు మొదలుపెట్టి, రెండు షిఫ్టులుగా తన పొలంలోనూ వేరొకరి పొలంలోను పనిచేస్తుంది.

"కానీ నేను ఎప్పుడూ షావుకార్ల నుండి అప్పులు తీసుకోలేదు" అని ఆమె తెలిపింది. "షావుకార్లు వారు రుణం తీసుకున్న ప్రతి 100 రూపాయలకు 10 రూపాయల వడ్డీని వసూలు చేస్తారు, అది నెలాఖరులోగా తిరిగి చెల్లించాలి." లక్ష్మీబాయి కూడా ప్రైవేట్ రుణదాతల నుండి దూరంగా ఉంటారు. "షావుకార్లు సమీప గ్రామాలలో వితంతువులను వేధించారు," అని ఆమె చెప్పారు.

Women farmers from Nashik protesting
PHOTO • Sanket Jain
Women farmer protesting against farm bill 2020
PHOTO • Sanket Jain

ఎడమ: నాసిక్ జిల్లాకు చెందిన లక్ష్మీబాయి కాలే (ఎడమ) మరియు విజయబాయి గంగూర్డే (కుడి) 1992 నుండి తమ భూ హక్కుల కోసం పోరాడుతున్నారు. కుడి: సువర్ణ గంగూర్డే (ఆకుపచ్చ చీరలో), “మా భూమిపై ఇది మూడవ తరం వ్యవసాయం”

మొహదీ గ్రామంలోని మహిళలకు డబ్బులకు  ఎప్పుడూ కటకట ఉంటుంది. వారికి పురుషుల కన్నా తక్కువ వేతనాలు ఇస్తారు. ఎనిమిది గంటల పనికి వారికి రూ. 150 పని ఇస్తే, పురుషులకు రూ. అదే పనికి 250 రూపాయలు ఇస్తారు. “ఈ రోజుకు  కూడా, పురుషుల కన్నా ఎక్కువ పని చేసినా సరే, స్త్రీలకు తక్కువ వేతనాన్ని ఇస్తారు. ఈ [కొత్త వ్యవసాయ] చట్టాలు మహిళా రైతులను ఎక్కువగా ప్రభావితం చేయవని ప్రభుత్వం ఎందుకు భావిస్తుంది? ” అని అడుగుతుంది లక్ష్మీబాయి.

కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా, లక్ష్మీబాయి మరియు విజబాయి ఇద్దరూ దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానానికి జనవరి 24-26 తేదీలలో సమ్యూక్తా శెట్కారి కమ్గర్ మోర్చా నిర్వహించిన సమావేశం కోసం వచ్చారు.

నాసిక్ మరియు సమీప జిల్లాల గ్రామాల నుండి 15 వేల మంది రైతులు జనవరి 23 న టెంపోలు, జీపులు, పిక్ అప్ ట్రక్కులలో బయలుదేరి మరుసటి రోజు ముంబైకి  చేరుకున్నారు. మైదానంలో, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ  సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు వారు సంఘీభావం తెలిపారు.  అంతేగాక వారి భూ హక్కులను కూడా డిమాండ్ చేశారు. “మేము ప్రభుత్వానికి భయపడము. మేము నాసిక్ నుండి ముంబైకి [2018 లో]సాగిన కవాతులో పాల్గొన్నాము, మేము ఢిల్లీ కి  వెళ్ళాము. నాసిక్, ముంబైలలో లెక్కలేనన్ని సార్లు నిరసనలో పాల్గోన్నాము, ”అని లక్ష్మిబాయి నిరసన వ్యక్తపరుస్తూ తన పిడికిలి పైకెత్తి అన్నారు.

రైతులు నిరసన తెలిపే కొత్త చట్టాలు ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020 ; ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 పై రైతు (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం ; మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020 . ఇవి మొదట జూన్ 5, 2020 న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌లుగా ఆమోదించబడ్డాయి, తరువాత సెప్టెంబర్ 14 న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టబడ్డాయి, అదే నెల 20 న ప్రభుత్వం వీటిని చట్టాలుగా ప్రవేశపెట్టింది.

రైతులు ఈ చట్టాలను వారి జీవనోపాధికి జరగబోయే పెద్ద హానిగా చూస్తారు.  ఎందుకంటే వీటి ద్వారా పెద్ద కార్పొరేట్‌లు రైతుల పైన, వారి వ్యవసాయం పైన చాలా నియంత్రణను సంపాదించుకుంటారు. ఇదేగాక  కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి), వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఎపిఎంసి), రాష్ట్ర సేకరణ వంటి సాగుదారునికి మద్దతును ఇచ్చే మరిన్ని ప్రధాన రూపాలను కూడా ఈ చట్టాలు బలహీనపరుస్తాయి. ఆర్తికల్ 32 ను బలహీనం చేస్తూ, పౌరులందరికీ వాజ్యం వేయగల చట్టబద్దమైన హక్కును నిలిపివేస్తున్నందున ఇవి ప్రతి భారతీయుడిని ప్రభావితం చేస్తాయని విమర్శించబడ్డాయి.

ప్రైవేటు కొనుగోలుదారులు ఎంఎస్‌పి కంటే తక్కువ ధరకు ఉత్పత్తులను సేకరించినప్పుడు, ఆ నష్టం రైతులను, వ్యవసాయ కూలీలను ప్రభావితం చేస్తుందని లక్ష్మీబాయి అన్నారు. "ఒక రైతుకు మంచి ధర లభిస్తేనే కదా వారు కూలీలకు చెల్లించగలిగేది. ఈ చట్టాలతో, మరిన్ని ప్రైవేట్ కంపెనీలు మార్కెట్లో పెరుగుతాయి. ఆమ్హి భావ్ కరు షాక్నర్ నహి [అప్పుడు ధరను నిర్ణయించడంలో మా పాత్ర ఉండదు].”

Women farmers protesting against New farm bill
PHOTO • Sanket Jain
The farmer protest against the new farm bill
PHOTO • Sanket Jain

ఎడమ: ఆజాద్ మైదానంలో నిరసనకారులు ఎండ నుండి తమను తాము రక్షించుకుంటున్నారు. కుడి: మధురాబాయి బార్డే వద్ద రైతుల డిమాండ్ల చార్టర్‌ ఉంది.

ఆజాద్ మైదాన్ నిరసనలో, దిండోరి తాలూకాలోని కొర్హతే గ్రామానికి చెందిన సువర్ణ గంగూర్డే (38) ఈ చట్టాల వల్ల మహిళలు ఎక్కువగా నష్టపోతారని అంగీకరించారు. "70-80 శాతం వ్యవసాయం మహిళలే చేస్తారు" అని కోలి మహాదేవ్ ఆదివాసీ వర్గానికి చెందిన సువర్ణ అన్నారు. “కానీ పిఎం-కిసాన్ యోజన చూడండి. ఆ డబ్బు మా గ్రామంలోని ఏ మహిళ బ్యాంకు ఖాతాలోనూ జమ చేయబడదు.” అన్నది.  ఈ యోజన ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ పథకం ద్వారా సన్నకారు రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6,000 ఇవ్వబడతాయి.

సువర్ణ చెప్తున్నవిషయాన్నిచూస్తే, అటవీ హక్కుల చట్టం, 2006 ప్రకారం, కొర్హతే గ్రామంలోని 64 ఆదివాసీ కుటుంబాలలో, కేవలం 55 మందికి 2012 లో ‘7/12’ (భూ హక్కుల రికార్డు) ఇవ్వబడింది. కానీ రికార్డులలో షెరా (వ్యాఖ్య) - పోట్ఖారాబా జమీన్ (సాగు చేయలేని భూమి) అని ఉన్నాయి. "ఈ భూమి మీద వ్యవసాయం చేసినవారిలో నాది మూడవ తరం, మరి దాన్ని వారు పోట్ఖరాబా జమీన్ అని ఎలా చెప్పగలరు?" ఆమె అడుగుతుంది.

సువర్ణ సాగుచేసే ఐదు ఎకరాల భూమిలో టమోటాలు, భూముగ్ (వేరుశనగ), కొత్తిమీర, మెంతులు, బచ్చలికూర మరియు ఇతర ఆకు కూరలను పండిస్తుంది. కానీ ఆమెకు రెండు ఎకరాలు మాత్రమే ఉన్నాయి. "ఫసావ్నుక్ కెలేలి ఆహే [మేము మోసపోయాము]," ఆమె చెప్పింది.

వారి పేరు మీద భూమి పట్టాలు కోరినప్పటికీ, కొర్హటే యొక్క ఆదివాసీ రైతులకు ఉమ్మడి 7/12 ఇవ్వబడింది. "షెరా కారణంగా, మేము పంట రుణాలు పొందలేము. మా పొలాలలో బావి లేదా బోర్‌వెల్ తవ్వలేము. దీని వలన వర్షపునీటిని నిల్వ చేయలేము. మేము కనీసం ఒక వ్యవసాయ చెరువును కూడా తవ్వలేము, ”అని సువర్ణ అన్నారు.

కొర్హతే నుండి ముంబైకి వచ్చి నిరసనల్లో పాల్గొన్న 50 మంది రైతులు, వ్యవసాయ కూలీలలో 35 మంది మహిళలు ఉన్నారు.

నిరసన వ్యక్తం చేసిన రైతులు జనవరి 25 న దక్షిణ ముంబైలోని మహారాష్ట్ర గవర్నర్ నివాసమైన రాజ్ భవన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వారు తమ డిమాండ్ల చార్టర్‌- పంటల సేకరణ కు MSP; వారి పేరు మీద భూమి పట్టాలు; మరియు 2020 లో ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌ల ఉపసంహరణను సమర్పించాలని అనుకున్నారు.

PHOTO • Sanket Jain
The farmers protesting against the farm bill 2020
PHOTO • Sanket Jain

తమ భూ హక్కులను కోరుతూ, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి జనవరి 24-26 తేదీల్లో సిట్ నిరసన కోసం వేలాది మంది రైతులు ముంబైకి వచ్చారు

రాజ్ భవన్‌కు కవాతు చేసే ముందు, అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన 45 ఏళ్ల భిల్ ఆదివాసీ రైతు మధురాబాయి బర్డే పసుపు రంగు ఫారాలను  చూడడంలో బిజీగా ఉన్నారు. మైదానంలో నిరసనను తీసుకువచ్చిన అఖిల భారత కిసాన్ సభ రూపొందించిన ఈ ఫారాలలో రైతులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల జాబితా ఉంది. ‘నేను పండించిన భూమి యొక్క 7/12 నాకు ఇవ్వలేదు’; ‘సాగు భూమిలో కొంత భాగం మాత్రమే నాకు ఇవ్వబడింది’; ‘ భూ పట్టాను నాకు ఇవ్వడానికి బదులు నన్నే ఖాళీ చెయ్యమన్నారు,’ వంటి సమస్యలు ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రతి రైతు వారు ఎదుర్కొన్న సమస్యలను రాసిన ఫారాలను డిమాండ్ల చార్టర్‌తో గవర్నర్‌కు అందజేయాలి. సంగమ్నేర్ తాలూకాలోని తన గ్రామమైన షిందోదికి చెందిన మహిళా రైతులందరూ తమ ఫారాలను సరిగ్గా నింపేలా మధురాబాయి చూసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ వివరాలను సరిగ్గా వ్రాశారని నిర్ధారించుకోవడానికి ఆమె తన చేతిరాత తో రాసిన రైతుల జాబితాను తనకు అందిన ఫారాలతో సరిచూసుకుంటూనే ఉంది.

మధురాబాయి తన గ్రామంలో 7.5 ఎకరాల భూమిని సాగు చేస్తుంది. ప్రైవేటు వ్యాపారులతో ఆమెకు ఇటీవల ఎదురైన అనుభవం కొత్త చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఆమెను మరింత నిశ్చయురాలిని చేసింది. వ్యాపారులు ఆమెకు క్వింటాల్ గోధుమలకు రూ. 900 ఇచ్చారు. కానీ ఇదే క్వింటాల్ గోధుమ 2020-2021 సంవత్సరంలో ఎంఎస్‌పి ప్రకారం రూ. 1925 కి అమ్ముడుపోయింది. "వారు అదే గోధుమలను మార్కెట్లో మావద్ద కొన్న ధరకు మూడు రెట్లు పెంచి అమ్ముతారు. మేము కాదా సాగుబడి చేసి దిగుబడి తెచ్చేది. అయినా సరే వారు మమ్మల్ని ఇంకా ఎక్కువగా చెల్లించమని అడుగుతారు,”అని మధురాబాయి అన్నారు.

ముంబై పోలీసులు అనుమతిని నిరాకరించడంతో జనవరి 25 న రాజ్ భవన్‌కు రైతుల మార్చ్ రద్దు చేయబడింది. వారు గవర్నర్‌ను కలవలేరని కోపంతో మధురాబాయి, “మేము పోరాటాన్ని ఆపము. గవర్నర్, ప్రధానితో సహా అందరి కోసమూ పంటలు పండించేది మేమే.” అన్నది.

అనువాదం: అపర్ణ తోట

Sanket Jain

संकेत जैन हे कोल्हापूर स्थित ग्रामीण पत्रकार आणि ‘पारी’चे स्वयंसेवक आहेत.

यांचे इतर लिखाण Sanket Jain
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

यांचे इतर लिखाण Aparna Thota