అక్టోబర్ 2022లో ఒక మలిసంజ వేళ, బళ్లారిలోని వడ్డు గ్రామంలో ఉన్న సామాజిక కేంద్రం ప్లాట్‌ఫారమ్‌పై బలహీనంగా ఉన్న ఒక పెద్దవయసు మహిళ వీపును స్తంభానికి ఆనించి, కాళ్లు చాచి, విశ్రాంతి తీసుకుంటున్నారు. సండూర్ తాలూకాలోని కొండ దారుల గుండా 28 కిలోమీటర్లు నడవడం ఆమెకు అలసట కలిగించింది. మరుసటి రోజు ఆమె మరో 42 కి.మీ దూరం కవాతు చేయాల్సివుంది.
సండూర్‌లోని సుశీలానగర్ గ్రామానికి చెందిన గని కార్మికురాలైన హనుమక్క రంగన్న, బళ్ళారి జిల్లా గని కార్మికర సంఘ (బళ్ళారి డిస్త్రిక్ట్ మైన్ వర్కర్స్ ఆర్గనైజేషన్) నిర్వహిస్తోన్న రెండురోజుల పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ నిరసనకారులు ఉత్తర కర్ణాటకలోని బళ్ళారిలో ఉన్న డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో తమ డిమాండ్లను తెలియచేయడానికి 70 కి.మీ. దూరం నడిచి వస్తున్నారు. తగినంత నష్ట పరిహారం ఇవ్వాలని, జీవనోపాధికి సరియైన ప్రత్యామ్నాయాన్ని కల్పించాలని కోరుతూ గత పదేళ్ళుగా వీధులలో కవాతు చేస్తూవస్తున్న సాటి గని కార్మికులతో కలిసి ఆమె ఇలా రావటం ఇది పదహారోసారి.
1990 దశాబ్దపు చివరలో బళ్ళారిలో పనిలోంచి వెళ్ళగొట్టబడిన వందలాది మంది మహిళా గని కార్మికులలో ఈమె కూడా ఒకరు. "ఇప్పుడు నా వయసు 65 ఏళ్ళు అనుకుందాం. నన్ను పనిలోంచి తీసేసి పదిహేనేళ్ళకు పైనే అయింది" అంటారామె. "డబ్బు (నష్ట పరిహారం) కోసం ఎదురుచూస్తూ చాలామంది చనిపోయారు... నా భర్త కూడా చనిపోయాడు."
"బతికివున్న మేమంతా శాపగ్రస్తులం. ఈ శాపగ్రస్తులైనా నష్ట పరిహారాన్ని పొందుతారో లేదా పొందకుండానే చనిపోతారో మాకు తెలియదు. మేం మా నిరసనను తెలియచేయడానికి వచ్చాం. ఎక్కడ సభ జరిగినా నేను అందులో పాల్గొంటాను. మేం దీన్ని చివరిసారిగా ప్రయత్నించాలనుకుంటున్నాం." అన్నారామె.















