కరుప్పయ్య కొంబు వాయిస్తూనే చనిపోవాలనుకున్నాడు. కొంబుకు చారిత్రాత్మకమైన విశిష్టత ఉంది. శత్రువులతో యుద్ధాన్ని ప్రారంభించేముందు దీనిని ఊదేవారు. ఈ శబ్దం కోసం చెవి కోసుకోవచ్చు. కానీ ఇత్తడి లేదా కాంస్యంతో తయారు చేయబడిన, ఏనుగు తొండం ఆకారంలో ఉన్న, ఈ కొమ్మును వాయిస్తూ ప్రపంచం నుండి వెళ్లిపోవాలని కోరుకోవడానికి కరుప్పయ్య వేరే కారణం ఉంది.
నలభై తొమ్మిదేళ్ల కరుప్పయ్యకు ‘కొంబు’ అనేది ఒక గొప్ప కళారూపం. అతను నాలుగో తరం వాయిద్యకారుడు. తన ఇల్లు గడవడానికి బలవంతంగా నడిపే ఆటో కన్నా,అతనికి కొంబు తోనే చేరిక ఎక్కువ.
మూడు దశాబ్దాల క్రితం, “ఈ కళను చాలా గొప్పగా చూసేవారు,” అన్నాడు కరుప్పయ్య. అతను 1991 లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కోసం వాయించడం గుర్తు చేసుకున్నాడు. “ఆమె మమ్మల్ని మళ్లీ వాయించమని అడిగింది. ఆమెకు బాగా నచ్చింది.”
కానీ ఈ రోజుల్లో అతనికి, తిరుపరకుండ్రం బ్లాక్ లోని అతని ఊరు మేలకుయిల్కుడిలో ఉండే మిగిలిన కొంబు వాయిద్యకారులకు, పని ఎక్కువగా దొరకట్లేదు. లయబద్ధంగా సాగే ఈ కళారూపం పాప్ సంగీతం వలన నెమ్మదిగా క్షీణించిపోతోంది. పైగా ఈ మార్చ్ నుంచి మొదలైన కోవిడ్ లాక్డౌన్ వలన పరిస్థితి ఇంకా ఘోరమైంది. ఈ వాయిద్యకారులకు ప్రస్తుతం పని దొరకడం లేదు, కాబట్టి సంపాదన కూడా లేదు.
ఐతే కరుప్పయ్యకి పని దొరికినప్పుడు - గుళ్ళలో, జాతరలలో, చావులలో కొంబు వాయించినప్పుడు, అతనికి 700-1000 రూపాయిల దాకా డబ్బులు వస్తాయి. “పోయిన ఏడాది, లాక్డౌన్ కారణంగా మేము అళగర్ కోయిల్ తిరువళలో వాయించలేకపోయాము. మామూలుగా అయితే, ఎనిమిది రోజులు వరసగా వాయించేవాళ్ళము.” కొంబు కళాకారులు వార్షిక పండుగ(ఏప్రిల్- మే) సమయంలో లక్షలాది భక్తులు మధురై నగరంలో అళగర్ కొయిల్ గుడి వద్ద కూడినప్పుడు వాయిస్తారు.
“అందరూ కొంబు వాయించలేరు, దానికి ప్రత్యేక నైపుణ్యం కావాలి.” అన్నాడు కాళీశ్వరన్. ఇతను ఆల్ట్రనేటివ్ మీడియా సెంటర్(AMC) వ్యవస్థాపకుడు. చెన్నైలో ఉన్న AMC, జానపద కళాకారులకు, కళలకు ఆలంబన ఇచ్చే సంస్థ. ఈ వాయిద్యాన్ని వేడుక మొదలులో, మధ్యలో వాయిస్తారు. కాని వేడుక జరుగుతున్న సమయమంతా వాయించరు. కాబట్టి కళాకారులు ఒక 15 నిముషాలు వాయించి, ఐదు నిముషాలు విశ్రాంతి తీసుకుని మళ్లీ 15 నిముషాలు వాయిస్తారు. “సాధారణంగా వాయిద్యకారుడు చాలా దీర్ఘ నిశ్వాసం తీసుకుని కొంబుని ఊదుతారు. వారు ఊపిరి బిగపట్టడం పై పట్టు సాధిస్తారు”,అని కాళీశ్వరన్ చెప్పాడు. ఇందువల్లనే కొంబు కళాకారులలో చాలామంది 100 ఏళ్ళకు దగ్గరగా ఉన్నవారు ఇంకా బ్రతికే ఉన్నారు, అని చెప్పాడు.











