"రాత్రుళ్లు త్వరగా గడచిపోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఈ గ్రామంలో దాదాపు ఎవరూ నివసించడం లేదు. అందుకే పాములు కూడా సంచరిస్తూ ఉంటాయి" అంటారు కవల శ్రీదేవి. 2016 సంవత్సరం మే నెలలో ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్లు తొలగించిన తరువాత శ్రీదేవి, ఆమె కుటుంబ సభ్యులు ఈ గ్రామంలో చీకటి రాత్రులను గడుపుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నది పక్కనే ఉండే పోలవరం మండలంలోని పైడిపాక గ్రామాన్ని ఖాళీ చేయకుండా అక్కడే వుండిపోయిన పది కుటుంబాలలో శ్రీదేవి కుటుంబం ఒకటి. 2016లో ఒక సాగునీటి ప్రాజెక్టు కోసం ప్రభుత్వం వీరి భూమిని సేకరించినపుడు దాదాపు 429 కుటుంబాలను యిక్కడినుండి బలవంతంగా తరలించారు. జలయజ్ఞం అనే బృహత్ కార్యక్రమంలో భాగంగా 2004లో నిర్మాణం మొదలయిన పోలవరం ప్రాజెక్టు, 2018 నాటికే పూర్తి కావలసి ఉంది. అయితే, యిప్పటి వరకు కేవలం అరవై శాతం (60%) మాత్రమే పూర్తయింది.
"విద్యుత్ సరఫరా నిలిపివేసిన నెల రోజుల తరువాత తాగునీటి సరఫరా కూడా నిలిపివేశారు" అంటారు శ్రీదేవి. ఆమె యిప్పుడు తన భర్త సూర్యచంద్రంతో కలిసి తమ ఆటోరిక్షాలో ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి పోలవరం పట్టణం చేరుకుని అక్కడ యిరవై రూపాయలు వెచ్చించి యిరవై లీటర్ల త్రాగునీటిని కొనుక్కుంటున్నారు.
యిక్కడినుండి తరలిపోయిన చాలా కుటుంబాలతో పాటు ఈ జంట కూడా తమ ముగ్గురు పిల్లలతో (పైన కవర్ ఫోటో చూడవచ్చు) కలిసి గోపాలపురం మండలంలోని హుకుంపేట పునరావాస కాలనీకి వెళ్ళి కొన్నాళ్ళపాటు అక్కడే ఉన్నారు. అయితే, నెలరోజుల తరువాత తిరిగి పైడిపాక గ్రామానికి చేరుకున్నారు. "మేం ప్రభుత్వాధికారులను నమ్మాం. అయితే, ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకుంటుందన్న నమ్మకం కోల్పోయాక తిరిగొచ్చేశాం" అంటారు శ్రీదేవి, ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.









