ఎనభైరెండేళ్లకి అరిఫా అంతా చూసేసింది. ఆమె ఆధార్ కార్డులో ఆమె జన్మదినం జనవరి 1, 1938 అని ఉంది. అది ఖచ్చిమైన తేదీనో కాదో ఆమెకు తెలియదు, కాని ఆమెకు 16 యేళ్లున్నప్పుడు, ఇరవయ్యేళ్లు పైబడ్డ రిజ్వాన్ ఖాన్ కు రెండవ భార్యగా హర్యాణా నూహ్ జిల్లాలో బివాన్ గ్రామానికి వచ్చింది. “మా అక్క, (రిజవాన్ మొదటి భార్య), ఆమె ఆరుగురు పిల్లలు దేశం విడిపోయేటప్పుడు జరిగిన తొక్కిసలాటలో చనిపోయాక, మా అమ్మ నన్ను రిజ్వాన్ కి ఇచ్చి పెళ్లిచేసింది,” అంటూ గుర్తుకు తెచ్చుకుంది అరీఫా.
ఆమెకు మహాత్మా గాంధీ మేవత్ లోని ఒక గ్రామానికి వచ్చి ముస్లిం వర్గాలను దేశం నుండి వెళ్లిపోవద్దని చెప్పటం లీలగా జ్ఞాపకముంది. ప్రతి డిసెంబర్ 19న, హర్యాణాలోని మియో ముస్లింలు నూహ్ జిల్లాలో ఘసేర గ్రామంలో గాంధీ తమ గ్రామానికి వచ్చిన రోజును మేవత్ దివస్ గా జరుపుకుంటుంటారు. (నూహ్ ని మేవత్ అని 2006 వరకు పిలిచేవారు)
అరఫాకి, తన తల్లి తనను కూర్చుండబెట్టుకుని రిజ్వాన్ ని ఎందుకు పెళ్లిచేసుకోవాలో వివరించడం ఇంకా స్పష్టంగా గుర్తుంది. “అతనికి మరేమి మిగలలేదు, అని మా అమ్మ చెప్పింది. మేరీ మా ముఝే ఉసే దియా ఫిర్(మా అమ్మ నన్ను అతనికి ఇచ్చింది)”, అన్నది అరఫా, బివాన్ తన గ్రామంగా ఎలా మారిందో చెబుతూ. ఈ గ్రామం ఆమె పెరిగిన రేతోరా గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు గ్రామాలు ఒకే జిల్లాలో ఉన్నాయి. మన దేశంలో అతితక్కువ అభివృద్ధి సూచికలు ఉన్న జిల్లాలలో ఇది ఒకటి.
దేశ రాజధాని నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీవాన్, ఫెరోజేపుర్ ఝిర్ఖ బ్లాక్ లో ఆరావళి కొండల మొదలులో, హర్యాణా, రాజస్థాన్ సరిహద్దులలో ఉంది. ఢిల్లీ నుండి నుహ్‌కు వెళ్లే రహదారి ,దక్షిణ హర్యాణాలోని గురుగ్రామ్ నుండి వెళుతుంది, ఇది భారతదేశంలో మూడవ అత్యధిక తలసరి ఆదాయం కలిగిన ఆర్థిక, పారిశ్రామిక కేంద్రం. కాని దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల జాబితాలో ఇది 44వ స్థానంలో ఉంది. అరిఫాలాగా, ఇక్కడ ఉండే వారి జీవితాలలో పచ్చని పొలాలు, ఎండిపోయిన కొండలు, పేలవమైన మౌలిక సదుపాయాలు, నీటి కొరత ఉంటాయి.
మియో ముస్లిం సమాజం, ఎక్కువ భాగం హర్యాణాలో, అలానే పొరుగున ఉన్న రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో నివసిస్తున్నారు. నూహ్ జిల్లా జనాభాలో 79.2 శాతం మంది ముస్లింలు ఉన్నారు (సెన్సస్ 2011).
1970వ దశకంలో, ఆరిఫా భర్త రిజ్వాన్, బివాన్ నుండి నడక దూరంలో ఉన్న ఇసుక, రాయి, సిలికా గనులలో పని చేయడం ప్రారంభించాడు. ఆరిఫా ప్రపంచం అంతా కొండల చుట్టూనే ఉండేది. ఆమెకున్నప్రధానమైన పనులలో మొదటిది, నీటిని తీసుకురావడం. 22 సంవత్సరాల క్రితం, రిజ్వాన్ చనిపోయాక, అరిఫా తనను, తన ఎనిమిది మంది పిల్లలను పోషించుకోవడానికి పొలాల్లో పనిచేసేది. అప్పట్లో రోజుకు 10 నుండి 20 రూపాయిలు వచ్చేవి. "మావాళ్లు, వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనగలిగితే, అల్లానే వారిని చూసుకుంటాడు అంటారు," అని ఆమె చెప్పింది.










