“ముందుకు వచ్చి నా స్వంత యుద్ధాలను నేనే చేయాలని ఉద్యమం నాకు నేర్పింది. ఇది మాకు గౌరవాన్ని ఇచ్చింది.” ఇక్కడ "మాకు" అంటే, సెప్టెంబర్ 2020లో ప్రవేశపెట్టబడిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న తాను, ఇంకా తన వంటి ఇతర మహిళలు అని రాజిందర్ కౌర్ ఉద్దేశ్యం. పంజాబ్‌లోని పాటియాలా జిల్లాకు చెందిన రాజిందర్ అనే ఈ 49 ఏళ్ళ రైతు, తరచూ 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, నిరసనలు జరుగుతున్న సింఘులో ప్రసంగాలు చేసేవారు.
రాజిందర్ స్వగ్రామం దౌణ్ కలాఁ లో, ఆమె పొరుగింటివారైన 50 ఏళ్ళ హర్జీత్ కౌర్, దిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘులో 205 రోజులు గడిపారు. "నేను ఆహారాన్ని పండించని సమయమంటూ నాకు గుర్తు లేదు. పండించిన ప్రతి పంటకూ, నాక్కొంచెం వయసు పెరిగింది." అని ఆమె చెప్పారు. 36 ఏళ్లుగా రైతుగా ఉన్న హర్జీత్, "ఇలాంటి ఉద్యమాన్ని చూడటం, అందులో పాల్గొనడం కూడా నాకు ఇదే మొదటిసారి" అని చెప్పారు. "పిల్లలు, వృద్ధులు, మహిళలు నిరసనలలోకి రావడాన్ని నేను చూశాను." అన్నారామె.
కేంద్ర ప్రభుత్వం చేసిన వివాదాస్పదమైన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది రైతులు దేశ రాజధాని శివార్లలో గుమిగూడారు. నవంబర్ 2020 నుండి మొదలుకొని, నవంబర్ 2021లో ఆ చట్టాలు రద్దు చేయబడేవరకు, ఒక సంవత్సరం పాటు, ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన రైతులు అక్కడ క్యాంప్ చేశారు. రైతుల నిరసన చరిత్రాత్మకమైనది; ఇది ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద ప్రజా ఉద్యమాలలో ఒకటి.
పంజాబ్ నుండి వచ్చిన మహిళలు ఉద్యమంలో ముందుపీఠిన ఉన్నారు. ఆ సమయంలో వారు చవిచూసిన సంఘీభావం కొనసాగుతుందనీ, అందులో భాగంగా వారిలో ధైర్యం, స్వతంత్య్రభావం మరింత బలపడ్డాయనీ వారు చెప్పారు. "నేను అక్కడ [నిరసనలు జరిగిన దగ్గర] ఉన్నప్పుడు నాకెప్పుడూ ఇంటిపై మనసుపోలేదు. ఇప్పుడు అక్కడినుంచి తిరిగి వచ్చాక, నాకు ఉద్యమం పై బెంగపుడుతోంది” అని మాన్సా జిల్లాకు చెందిన 58 ఏళ్ల కుల్దీప్ కౌర్ చెప్పారు.
అంతకుముందు, బుధ్‌లాడా తహసీల్ లోని రేలీ గ్రామంలోని తన ఇంట్లో ఉండే పనిభారం ఆమె మానసిక స్థితిని ప్రభావితం చేసేది. “ఇక్కడ నేను ఒకదాని తర్వాత ఒకటిగా పని చేసుకుంటూ పోవాలి, లేదా మనం గౌరవించాల్సిన అతిథులకు మర్యాదలు చేస్తూ వుండాలి. అక్కడైతే నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను” అని కుల్దీప్ చెప్పారు. నిరసనలు జరుగుతున్న ప్రదేశాల్లోని సామాజిక వంటశాలలలో ఆమె స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తన జీవితమంతా అక్కడే పని చేయగలనని ఆమె అన్నారు. "అక్కడ వున్న పెద్దలను చూసినపుడల్లా, నేను నా తల్లిదండ్రుల కోసమే వంట చేస్తున్నానని అనుకునేదాన్ని."
చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు ప్రారంభించిన మొదట్లో, కుల్దీప్ ఏ రైతు సంఘాల్లోనూ చేరలేదు. సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM)ని ఏర్పాటు చేసిన తర్వాత, ఆమె ఒక పోస్టర్‌ను తయారు చేశారు. దానిపై ఆమె ' కిసాన్ మోర్చా జిందాబాద్ ' ('రైతాంగ నిరసనలు వర్ధిల్లాలి ') అనే నినాదాన్ని రాసి, ఆ పోస్టర్‌ను సింఘు వద్దకు తీసుకెళ్ళారు. శిబిరాల్లో అనేక సమస్యలు ఉన్నందున, నిరసన వేదికల వద్ద ఉన్న మహిళలు ఆమెను రావద్దని చెప్పినప్పటికీ, కుల్దీప్ నిశ్చయించుకున్నారు: "నేను అక్కడికి రావాల్సిందేనని వారికి చెప్పాను."
ఆమె సింఘు వద్దకు చేరుకున్నప్పుడు, పెద్ద పెద్ద చూల్హాల (కట్టెల పొయ్యి) మీద రోటీలు తయారుచేస్తున్న స్త్రీలను చూశారు "వాళ్ళు నన్ను చాలా దూరం నుండే పిలిచి, “ అక్కా ! రోటీలు చేయడానికి మాకు సాయం చేయండి." అన్నారు. టిక్రీ వద్ద కూడా అదే జరిగింది. అక్కడ ఆమె మాన్సా నుండి వచ్చిన ఒక ట్రాక్టర్ ట్రాలీలో స్థిరపడ్డారు. ఒక చూల్హా దగ్గర అలసిపోయి కూర్చునివున్న మహిళ ఆమె సహాయం కోరారు. "నేను గంటకు పైగా రోటీలు చేశాను," అని కుల్దీప్ గుర్తుచేసుకున్నారు. టిక్రీ నుండి ఆమె హర్యానా-రాజస్థాన్ సరిహద్దులోని షాజహాన్‌పూర్‌లో ఉన్న శిబిరానికి వెళ్ళారు. "అక్కడ పనిచేస్తున్న పురుషులు నన్ను చూసి, వారికోసం కూడా రోటీలు చేయమని నన్ను అడిగారు" అని ఆమె చెప్పారు. “నేను ఎక్కడికి వెళ్లినా, ప్రజలు రోటీలు చేయడంలో సహాయం చేయమని మాత్రమే నన్ను అడుగుతారు. రోటీలు చేస్తానని నా నుదుటిపై రాసి ఉందా ఏమిటని నేను ఆశ్చర్యపోయేదాన్ని!" తిరిగి నవ్వుతూ అన్నారామె.
ఇంటి దగ్గర ఆమె స్నేహితులకూ, ఇరుగుపొరుగువారికీ రైతుల ఉద్యమం పట్ల కుల్దీప్‌కు ఉన్న నిబద్ధత స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తమను కూడా ఆమెతో తీసుకెళ్లమని ఆమెను అడిగేవారు. "నేను సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలను చూసి, మళ్ళీసారి తాము కూడా అక్కడకు వెళ్లాలనుకుంటున్నామని నాతో చెప్పేవారు." ఈ ఉద్యమంలో పాల్గొనకపోతే తన మనవలు ఏమనుకుంటారోనని తాను భయపడుతున్నట్లు ఆమె స్నేహితురాలు ఒకరు చెప్పారు!
ఇంతకు ముందెప్పుడూ టెలివిజన్ సీరియల్స్ గానీ, సినిమాలు గానీ చూసెరుగని కుల్దీప్, నిరసనలు జరుగుతున్న ప్రదేశాల నుండి ఇంటికి వెళ్లినపుడల్లా వార్తల కోసం టీవీ చూడటం ప్రారంభించారు. "నేనక్కడ భౌతికంగా ఉండటమో, లేని పక్షంలో ఆ నిరసనల గురించిన వార్తలు చూడటమో చేస్తున్నాను," అని ఆమె చెప్పారు. పరిస్థితుల అనిశ్చితి ఆమెను చాలా బాధించేది. ఆ ఆందోళనను తగ్గించడానికి ఆమె మందులు వాడారు. "నా తల తిరుగుతున్నట్టుండేది," అని ఆమె చెప్పారు. "వార్తలు చూడటం మానాలని డాక్టర్ నాతో చెప్పారు."
రైతుల ఉద్యమంలో చేరడంతోనే, కులదీప్‌కి తనకు తెలియకుండానే తనలో దాగివున్న ధైర్యం తెలిసివచ్చింది. కారుల్లో, ట్రాక్టర్ ట్రాలీల్లో ప్రయాణించటం పట్ల తనకున్న భయాన్ని అధిగమించి, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న దిల్లీకి అనేకసార్లు ప్రయాణించారు. "ప్రమాదాల్లో చాలామంది రైతులు చనిపోతున్నారు. అలాంటి ప్రమాదంలో నేనూ చనిపోతే, మా విజయాన్ని చూడలేను కదా అని ఆందోళన చెందేదాన్ని,” అని ఆమె చెప్పారు.
ఇంటికి వెళ్ళినప్పుడల్లా కుల్దీప్ తన సొంత పట్టణంలో జరిగే నిరసనలలో పాల్గొనేవారు. అటువంటి ఒక నిరసన ప్రదర్శనను ఆమె గుర్తుచేసుకున్నారు: క్రమం తప్పకుండా ఈ నిరసనలలో పాల్గొంటుండే టీనేజ్ కుర్రాడు ఒకరు తన పక్కన నిలబడి ఉండగా, వేగంగా వస్తున్న వాహనం అతడిని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆ పిల్లాడితోపాటు, పక్కన నిలబడి ఉన్న వ్యక్తి కూడా మరణించారు, మరో వ్యక్తి జీవితపర్యంతం వికలాంగుడయ్యారు. “నేనూ నా భర్తా చాలా కొంచంలో మరణాన్ని తప్పించుకున్నాం. ఆ సంఘటన తర్వాత, ఏదైనా ప్రమాదంలో చనిపోతానేమోననే భయం నాకెప్పుడూ కలగలేదు. ఈ చట్టాలు రద్దుచేయబడిన రోజున, ఆ పిల్లాడు నా పక్కనే నిలబడి ఉన్న సంగతిని గుర్తుచేసుకుని ఏడ్చాను,” అని కుల్దీప్ చెప్పారు. ఉద్యమం కోసం తమ ప్రాణాలను అర్పించిన 700 మందికి పైగా నిరసనకారుల మరణానికి కూడా ఆమె దుఃఖపడుతూనే ఉంటారు.
రైతుల ఉద్యమంలో తమ బలమైన ప్రమేయం, విమర్శనాత్మక మద్దతు ఉన్నప్పటికీ - ఇది వివాదాస్పద చట్టాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని బలవంతపెట్టింది - రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో తమను ప్రక్కకు తప్పించినట్లుగా పంజాబ్ మహిళలు భావిస్తున్నారు. ఫిబ్రవరి 20, 2022న జరిగిన శాసనసభ ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అతి తక్కువ సంఖ్యలో మహిళలను నిలబెట్టడమే ఇందుకు నిదర్శనమని వారు అంటున్నారు.
పంజాబ్‌లోని 2.14 కోట్ల మంది ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలే. అయినప్పటికీ, 117 నియోజకవర్గాల్లో ఎన్నికలలో పోటీ చేసిన 1,304 మంది అభ్యర్థులలో 93 మంది - అంటే 7.13 శాతం మంది - మాత్రమే మహిళలున్నారు.
దేశంలోని రెండవ పురాతన రాజకీయ పార్టీ అయిన శిరోమణి అకాలీదళ్ కేవలం 5 మంది మహిళలను మాత్రమే రంగంలోకి దించింది. భారత జాతీయ కాంగ్రెస్ 11 మందికి టిక్కెట్లు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో దాని ఎన్నికల నినాదం, ‘ లడ్కీ హూఁ , లడ్ సక్తీ హూఁ ' ('నేను అమ్మాయిని; నేను పోరాడగలను'), పంజాబ్‌లో సుదూర స్వప్నంగా కనిపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ లెక్కను మరొక్క అంకెతో ఓడించింది; దాని జాబితాలో 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్), కొత్తగా ఏర్పడిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ - నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో వీరు భాగస్వాములు - అంతా కలిసి, 9 మంది మహిళలను నామినేట్ చేశారు (బిజెపి నిలబెట్టిన 6 మందితో సహా).
*****
చలిగా తడితడిగా ఉన్న ఒక శీతాకాలపు రోజున నేను రాజిందర్ కౌర్‌ని కలిశాను. ఆమె కుర్చీపై కూర్చొనివున్నారు; వెనుక గోడపై ఉన్న బల్బ్ బలహీనమైన కాంతిని వెదజల్లుతోంది కానీ ఆమె పట్టుదల (స్ఫూర్తి) బలంగా ఉంది. నేను నా డైరీని తెరిస్తే, ఆమె తన హృదయాన్ని తెరిచారు. మహిళలు నాయకత్వం వహించే ఒక విప్లవం గురించి ఆశావహంగా మాట్లాడుతున్న ఆమె గొంతులో ఆమె కళ్లలోని అగ్ని ప్రతిఫలిస్తోంది. ఆమెకున్న మోకాళ్లనొప్పి వల్ల ఆమె తరచుగా విశ్రాంతి తీసుకోవాలి; అయితే రైతుల ఉద్యమం తనలో శక్తినీ ఉత్సాహాన్నీ రగిలించిందని రాజిందర్ చెప్పారు - ఆమె ఇప్పుడు బహిరంగంగా మాట్లాడతారు, తన సొంత గొంతును ఏర్పరచుకున్నారు.
"ఇప్పుడు [ఎవరికి ఓటు వేయాలో] నేనే నిర్ణయించుకుంటాను," అని రాజిందర్ చెప్పారు. “ఇంతకుముందు, మా మామగారు, నా భర్త నన్ను ఈ పార్టీకో లేదా ఆ పార్టీకో ఓటు వేయమని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఎవరూ నాకు చెప్పే ధైర్యం కూడా చేయడం లేదు." రాజిందర్ తండ్రి శిరోమణి అకాలీదళ్‌కు మద్దతు ఇచ్చేవారు. అయితే ఆమె వివాహం చేసుకుని దౌణ్ కలాఁ గ్రామానికి వచ్చిన తర్వాత, ఆమె మామగారు ఆమెను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పారు. "నేను చేతికి [పార్టీ గుర్తుకు] ఓటు వేశాను, కానీ ఎవరో నన్ను గుండెలో కాల్చినట్లనిపించింది" అని ఆమె చెప్పారు. ఎవరికి ఓటు వేయాలో చెప్పడానికి ఆమె భర్త ప్రయత్నించినప్పుడు, రాజిందర్ ఆయన్ని అడ్డుకున్నారు. "నేనిప్పుడు ఆయన్ని మాట్లాడనివ్వడంలేదు."
సింఘులో జరిగిన ఒక వినోదభరితమైన సంఘటన ఒకటి ఆమెకు గుర్తుకు వచ్చింది. ఆమె వేదికపై అప్పుడే తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత ఇది జరిగింది. "నేను నా మోకాళ్లకు విశ్రాంతినివ్వడానికి సమీపంలోని ఒక గుడారానికి వెళ్ళాను. అక్కడ వంట చేస్తున్న వ్యక్తి నన్ను, 'కాసేపటి క్రితం ఒక మహిళ చేసిన ప్రసంగం విన్నారా?' అని అడిగాడు. ఇంతలో డేరాలోకి ప్రవేశించిన మరొక వ్యక్తి నన్ను గుర్తించి, 'ఓహ్, ఈమెనే కొద్దిసేపటి క్రితం ఒక ప్రసంగం చేసింది!' అన్నాడు. వారు ప్రస్తావిస్తున్నది నా గురించే!” మెరుపుతగ్గని గర్వం, ఆనందాలతో ఆమె చెప్పారు.
"మూడు చట్టాలు మమ్మల్ని ఏకం చేశాయి," అని పొరుగింట్లోనే ఉండే హర్జీత్ చెప్పారు. అయితే, పోరాట ఫలితం పట్ల ఆమె విమర్శనాత్మకంగా ఉన్నారు. "నిరసనల ఫలితంగా చట్టాలను రద్దు చేసినప్పటికీ, మా సమస్యలింకా పరిష్కారం కావాల్సే ఉంది" అని ఆమె చెప్పారు. “కనీస మద్దతు ధర [MSP] కోసం చేసిన డిమాండ్ నెరవేరిందని నిర్ధారించకుండానే ఉద్యమాన్న, [SKM] ఉపసంహరించుకుంది. అలాగే, లఖింపూర్ ఖీరీలో చనిపోయిన రైతులకు తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూడాలి."
"ఉద్యమం జరుగుతున్న సమయంలో రైతుల సంఘాలు ఐక్యంగానే ఉన్నాయి కానీ, ఇప్పుడవి విడిపోయివున్నాయి," అని కుల్దీప్ నిరాశగా చెప్పారు.
2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పంజాబ్‌లో ఈ రిపోర్టర్ మాట్లాడిన చాలామంది ప్రజలు - సంయుక్త కిసాన్ మోర్చాలో భాగంగా ఉన్న కొన్ని రైతు సంఘాలు 2021 డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన సంయుక్త్ సమాజ్ మోర్చా (SSM)తో సహా - ఏ పార్టీ వైపుకూ మొగ్గు చూపలేదు. ( స్వతంత్రులుగా పోటీ చేసిన ఈ పార్టీ అభ్యర్థుల జాబితాలో నలుగురు మహిళలున్నారు.) ఎన్నికల వేడి ఊపందుకోవడంతో, అన్ని పార్టీల నాయకత్వం, వారి అనుచరగణం, కొద్ది నెలల క్రితమే ముగిసిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల గురించి నోరు మెదపలేదు.
"ఎస్ఎస్ఎమ్, చివరకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గ్రామాలపై ఎటువంటి ఆసక్తినీ, శ్రద్ధనూ చూపలేదు" అని సంగ్రూర్ జిల్లాలోని బెన్రా గ్రామానికి చెందిన జీవన్ జ్యోత్ అనే యువతి అన్నారు. "[రాజకీయ] పార్టీల జనాలకు ఎవరు బతికే ఉన్నారో, ఎవరు చనిపోయారో కూడా తెలియదు," అని నిరుత్సాహంగా అన్నారామె.
ప్రస్తుతం తన ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్స్ చెప్తున్న ఈ 23 ఏళ్ల స్కూల్ టీచర్ జీవన్ జ్యోత్‌కు, తన పొరుగింటిలో ఉండే పూజ ప్రసవ సమయంలో మరణించడంతో, రాజకీయ పార్టీలపై కోపం మరింత తీవ్రమైంది. "నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే, ఏ పార్టీకి చెందిన నాయకుడు గానీ, గ్రామ సర్పంచ్ గానీ కనీసం మర్యాద కోసమైనా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు." కొత్తగా పుట్టిన శిశువు, ఆమె మూడేళ్ల సోదరి గుర్‌ప్యార్‌లు, 32 ఏళ్ల రోజుకూలీ అయిన తండ్రి సత్పాల్ సింగ్ సంరక్షణలో ఉండటంతో, ఆ కుటుంబానికి సహాయం చేయడానికి జీవన్ జ్యోత్ ముందుకొచ్చారు.
నేను బెన్రాలో జీవన్ జ్యోత్‌ని కలిసినప్పుడు, గుర్‌ప్యార్ ఆమె దగ్గర కూర్చుని ఉంది. "ఇప్పుడు నేనే ఈమెకు తల్లినని నాకనిపిస్తోంది" అని జీవన్ అన్నారు. "నేను ఆమెను పెంచుకోవాలనుకుంటున్నాను. స్వయంగా పిల్లలను కనలేను కాబట్టి, నేనిలా చేస్తున్నాను అనే పుకార్లకు నేనేమీ భయపడను."
రైతుల ఉద్యమంలో మహిళల భాగస్వామ్యం జీవన్ జ్యోత్ వంటి యువతులకు ఆశను కలిగించింది. పితృస్వామ్య ప్రపంచం మహిళలను వివిధ యుద్ధాల్లోకి దింపుతుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం "వారి పోరాట స్ఫూర్తి"కి కొనసాగింపు అని ఆమె అన్నారు.
ఉద్యమం కోసం కలిసి వచ్చిన పంజాబ్ మహిళల బలమైన గొంతులు ఇప్పుడు తమను పక్కన పెట్టడాన్ని అంగీకరించటంలేదు. "యుగాలుగా స్త్రీలు ఇళ్ళకే పరిమితమయ్యారు" అని హర్జీత్ అన్నారు. ప్రజా భాగస్వామ్యానికి దూరంగా తిరిగి వెనక్కి నెట్టివేయబడుతున్నామని ఆదుర్దాపడుతూ, తాము సంపాదించుకున్న గౌరవం చరిత్రపుటల్లో ఒక పాదసూచికగా పరిమితం అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
ఈ కథనాన్ని నివేదించడంలో సహాయం చేసినందుకు ముషారఫ్ , పర్గత్ లకు రచయిత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు .
అనువాదం: సుధామయి సత్తెనపల్లి