నవంబర్ 8న, ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు ప్రకటన చేయటానికి వారం రోజుల ముందు, తెలంగాణ, సిద్దిపేట జిల్లాలోని ధర్మారం గ్రామానికి చెందిన 42 ఏళ్ల వర్ద బాలయ్య అనే రైతు, తన పొలంలో ఒక ఎకరాన్ని అమ్మడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు. సిద్దిపేట-రామాయంపేటలను కలిపే హైవేను ఆనుకొని ఉంది ఆయన పొలం.
అక్టోబర్‌లో కురిసిన అకాల వర్షాల వల్ల అతను వేసిన మొక్కజొన్న పంట నాశనమైంది. ఇంతలో వడ్డీ వ్యాపారుల నుంచి, ఆంధ్రాబ్యాంకు నుంచి ఆయన తీసుకున్న రూ. 8-10 లక్షల అప్పుపై వడ్డీలు పెరిగిపోయాయి. అప్పు తీర్చలేని పరిస్థితిలో, తన ఋణదాతలను ఎలా ఎదుర్కోవాలో తెలీక, తన నాలుగు ఎకరాల పొలంలో అత్యంత లాభదాయకమైన ఒక ఎకరం భాగాన్ని అమ్ముదామని నిశ్చయించుకొని, కొనుగోలుదారుల కోసం అతను వెతకడం ప్రారంభించారు.
భూమి కొనేందుకు ఎవరో ముందుకు వచ్చారని తన పెద్ద కూతురు శిరీషతో, నోట్ల రద్దుకు ముందు, అతను చెప్పారు.
శిరీష పెళ్ళి కోసం 2012లో తీసుకున్న రూ. 4 లక్షల అప్పుతో బాలయ్య ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. రూ. 2 లక్షలు ఖర్చుచేసి నాలుగు బోరు బావులు తవ్విస్తే, మూడింటిలో నీళ్ళు పడలేదు. ఇవన్నీ అతని పెరిగిపోతున్న అప్పుల భారాన్ని మరింత పెంచాయి.
కొన్ని నెలల క్రితం, బాలయ్య చిన్న కుమార్తె అఖిల (17) ఇంటర్మీడియట్ స్థాయి, లేదా 12వ తరగతికి చేరుకుంది; తన పెద్ద కూతురికి అదే ఈడులో వివాహం జరిపించిన బాలయ్య, అఖిల పెళ్ళి గురించి ఆందోళన పడసాగారు. చేసిన అప్పులన్నీ ఎలాగైనా తీర్చాలనుకున్నారు.




