“మీరు ఇక్కడకి మరి త్వరగా వచ్చేసారు. ఆదివారాల్లో సాయంత్రం 4 దాటితే గాని ఎవరూ రారు. నేను కూడా హార్మోనియం నేర్చుకోవడానికని వచ్చాను.” అన్నది బ్యూటీ.
‘ఇక్కడ’ అంటే చతుర్భుజ్ స్థాన్- బీహార్ లో ముజాఫర్ బ్లాక్ లో ముసాహ్రి బ్లాక్ లోని ఒక పాత బ్రోతల్. ‘ఈ టైం’ అంటే 10 గంటల తరవాత అని- అప్పుడే నేను, ఆమె కలిసాము. ‘వారు’ అంటే ఆమె కలవడానికి వచ్చే క్లయింట్లు. ‘బ్యూటీ’ అనేది వృత్తిరిత్యా ఆమె ఎంచుకున్న పేరు- 19 ఏళ్ళ ఈ సెక్సవర్కర్,అప్పటికే ఐదేళ్లుగా ఈ పని లో ఉంది. పైగా ఆమె ప్రస్తుతం మూడు నెలల గర్భం తో ఉంది.
అయినా ఆమె పని మానలేదు. ఆమె హార్మోనియం ఎందుకు నేర్చుకుంటుందంటే, “అమ్మి(ఆమె తల్లి) సంగీతం నా బిడ్డ పైన మంచి ప్రభావం చూపిస్తుంది, అని చెప్పింది.” అంది.
ఆమె మాట్లాడుతూ ఉండగానే హార్మోనియం పైన ఆమె వేళ్ళు కదులుతున్నాయి. “ఇది నా రెండో కాన్పు. నాకు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు.” అంది.
మేము మాట్లాడుకుంటున్న గది, ఆమె పని స్థలం కూడా. ఆ గదిలో సగంవరకు ఒక పరుపు పరిచి ఉంది. ఆ పరుపు వెనుక గోడకు అడ్డంగా ఆరు బై పది వైశాల్యం గల ఒక అద్దం అమర్చి ఉంది. ఆ గది బహుశా 15 బై 25 అడుగులు ఉండొచ్చు. ముజ్రాని చూస్తున్నవారు ఆరాముగా వెనక్కి చేరగిలపడి చూసేందుకు వీలుగా ఆ పరుపు చుట్టూ దిండ్లు, కుషన్లు అలంకరించబడి ఉన్నాయి. ముజ్రా ఒక నాట్య ప్రక్రియ, బ్రిటిష్ వారు రాక ముందు నుంచి ఉంది. చతుర్భుజ్ స్థాన్ మొఘలుల కాలం ముందు నుంచి ఉందని చెబుతారు. బ్రోతల్ లో ఉన్న ఆడపిల్లలు, మహిళలు ముజ్రాని కచ్చితంగా నేర్చుకుని, ప్రదర్శించగలిగి ఉండాలి. బ్యూటీకి కూడా ముజ్రా చేయడం వచ్చు, ప్రదర్శనలు కూడా ఇస్తుంది.












