యాభై ఏడేళ్ళ బాలాభాయ్ చావ్డాకు గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. అది సారవంతమైనది. దానికి నీటి సదుపాయం కూడా ఉంది. దానికి పాతిక సంవత్సరాలుగా అతనే యజమాని. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది.అతన్ని తన సొంత వ్యవసాయ భూమి దగ్గరకు ఎవరూ రానివ్వరు.

“నేనే యజమానినన్న ఋజువు నా దగ్గరుంది,” పెళుసుగా, పసుపు రంగులోకి మారిన భూమి దస్తావేజులను చూపిస్తూ అతనన్నారు. “కానీ (భూమి) ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తుల ఆధీనంలో ఉంది.”

గుజరాత్‌లో, షెడ్యూల్డ్ కులమైన చమర్ సముదాయానికి చెందిన బాలాభాయ్ ఒక కార్మికుడు. భూమి విషయంలో ప్రతి ఒక్కరినీ సహాయం చేయమని అడిగారు – ఆ ఊరిలో అతను తట్టని తలుపు లేదు. “నేను ప్రతిరోజూ భూమి దగ్గరికి వెళ్తాను. దాన్ని దూరం నుండే చూస్తూ, అదే నా అధీనంలో ఉండివుంటే నా జీవితం ఎలా ఉండేదోనని ఊహించుకుంటుంటాను..."

1997లో, గుజరాత్ భూపంపిణీ విధానం కింద, ధ్రాంగధరా తాలూకా భరడ్ గ్రామంలోని వ్యవసాయ భూమిని బాలాభాయ్‌కి కేటాయించారు. 1960 నాటి గుజరాత్ వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం సాగు భూములపై పరిమితులు విధించింది. దాని కింద సేకరించిన 'మిగులు భూమి'ని ‘సమూహ ప్రయోజనాల' కోసం కేటాయించడం జరిగింది..

సంథాని జమీన్ అని పిలిచే ఈ సేకరించిన స్థలాలతో పాటు ప్రభుత్వ ఆధీనంలో ఉండే బంజరు భూమిని 'వ్యవసాయం చేయడానికి భూమి అవసరం ఉన్న ' వ్యక్తులకు కేటాయిస్తారు. వీరిలో రైతు సహకార సంఘాలు, భూమిలేని వ్యక్తులు, వ్యవసాయ కూలీలు కూడా ఉంటారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన సంఘాల సభ్యులకు ఈ భూపంపిణీలో ప్రాధాన్యం ఇస్తారు.

కానీ ఈ పథకం కాగితాలపైనే బాగా పనిచేస్తుంది, ఆచరణలోకి అంతగా రాదు.

భూమి పట్టా చేతికి వచ్చాక, అందులో పత్తి, జొన్నలు, సజ్జలు సాగు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు బాలాభాయ్. ఆ వ్యవసాయ భూమిలో ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకోవాలనుకున్నారు. ఆ విధంగా తాను పనిచేసే చోటనే నివసించవచ్చునని అతని ఆలోచన. అప్పుడతనికి 32 ఏళ్ళు. తన కుటుంబంతో కలిసి మంచిగా బతకొచ్చని భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. “నాకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. నేను కూలీగా పని చేస్తున్నాను. వేరొకరి కోసం శ్రమించే రోజులు ఇక పోయాయనుకున్నాను. నా సొంత భూమితో, నా కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వగలనని అనుకున్నాను,” అన్నారాయన.

PHOTO • Parth M.N.

భరడ్ గ్రామంలో, పాతికేళ్ళుగా తన ఐదెకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకోవడం కోసం సంబంధిత పత్రాలతో ఎదురుచూస్తున్న బాలాభాయ్ చావ్డా

అయితే బాలాభాయ్‌కి గట్టి దెబ్బ తగిలింది. ఆయన భూమిని స్వాధీనం చేసుకోకముందే తన గ్రామంలోని రెండు కుటుంబాలు దాన్ని కబ్జాచేశాయి. ఈ ప్రాంతంలోని ఆధిపత్య కులాలైన రాజ్‌పుత్ సముదాయానికి చెందిన ఒక కుటుంబం, మరొక పటేల్ సముదాయానికి చెందిన కుటుంబం ఆక్రమణలోనే ఇప్పటికీ ఆ భూములున్నాయి. దాంతో బాలాభాయ్ మళ్ళీ కూలిపని చేయవలసి వచ్చింది. అతని కొడుకులు – రాజేంద్ర (35), అమృత్ (32)లు చాలా చిన్న వయసు నుండే పొలంపనికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వారానికి మూడు రోజుల పని; పని వున్న రోజున రోజుకు రూ.250 వరకు వారికి కూలిగా వస్తుంది.

“నా భూమిపై హక్కును సాధించుకోవడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ ఆ భూమి చుట్టూ ఆధిపత్య కులాలకు చెందిన వ్యక్తుల ఆస్తులు ఉన్నాయి. వారు నన్ను ఆ ప్రాంతంలోకి రానివ్వలేదు. మొదట్లో నేను నా హక్కు (భూమిని సాగు చేసుకునేందుకు) గురించి మాట్లాడాను, పోరాడాను. కానీ వారు పలుకుబడి ఉన్నవాళ్లు, శక్తివంతులు,” అన్నారు బాలాభాయ్.

90వ దశకం చివరిలో జరిగిన ఒక దాడిలో బాలాభాయ్‌ ఆసుపత్రి పాలయ్యారు. గడ్డపారతో దాడి చేయడంతో అతని చేయి విరిగిపోయింది. “నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. (జిల్లా) అధికారులను కూడా సంప్రదించాను. కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. భూమి లేనివారికి భూ పంపిణీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవానికి కాగితాలు మాత్రమే పంచింది. ఆ భూమి ఇంతకు ముందు ఎవరి అధీనంలో ఉందో ఇప్పుడూ అలాగే ఉంది.” అన్నారు బాలాభాయ్.

2011 జనాభా లెక్కల సమయంలో, భారతదేశంలో 144 మిలియన్లకు పైగా భూమిలేని వ్యవసాయ కూలీలు ఉండేవారు. ఈ సంఖ్య, 2001 జనాభా లెక్కల్లో నమోదైన 107 మిలియన్ల నుండి 35 శాతానికి పెరిగింది. ఒక్క గుజరాత్‌లోనే, అదే కాలంలో, 1.7 మిలియన్ల మంది ప్రజలు భూమిలేని కూలీలుగా మారారు - అంటే 32.5 శాతం (5.16 మిలియన్ల నుండి 6.84 మిలియన్లకు) పెరుగుదల.

పేదరికానికి సూచిక అయిన భూమి లేకపోవడం అనేది కులంతో బలంగా ముడిపడి ఉంది. గుజరాత్ మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 6.74 శాతం (2011 జనాభా లెక్కల ప్రకారం) ఉన్నప్పటికీ, రాష్ట్రంలో సాగులో ఉన్న భూ విస్తీర్ణంలో కేవలం 2.89 శాతం భూమికి మాత్రమే వారు యజమానులుగా ఉన్నారు లేదా వేరే విధంగా పనిచేస్తున్నారు. అదే విధంగా, రాష్ట్ర జనాభాలో 14.8 శాతం ఉన్న షెడ్యూల్డ్ తెగలు 9.6 శాతం భూమిలో పని చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం భూ సంస్కరణ విధానాలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ, 2012లో దళిత హక్కుల కార్యకర్త జిగ్నేశ్ మేవాణీ గుజరాత్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (public interest litigation (PIL) - పిల్) దాఖలు చేశారు. సీలింగ్ చట్టం కింద సేకరించిన సంథాని భూములను అవి చెందవలసిన – భూమి లేని, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల - వారికి కేటాయించటంలేదు.

Balabhai on the terrace of his house. ‘I look at my land from a distance and imagine what my life would have been...’
PHOTO • Parth M.N.

తన ఇంటి డాబా మీద కూర్చొనివున్న బాలాభాయ్. 'దూరం నుండి నా భూమిని చూస్తూ నా జీవితం ఎలా ఉండివుండేదోనని ఊహించుకుంటుంటాను...'

కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో, ల్యాండ్ సీలింగ్ చట్టాల అమలుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 'త్రైమాసిక ప్రగతి (సంచిత) నివేదిక'ను సమర్పించారు. సెప్టెంబర్ 2011 వరకు గుజరాత్‌లో 37,353 మంది లబ్ధిదారులకు 163,676 ఎకరాల భూమిని పంపిణీ చేశారనీ, మరో 15,519 ఎకరాలు మాత్రమే పంపిణీ చేయవలసి ఉందనీ ఆ నివేదిక పేర్కొంది.

అయితే, మేవాణీ దాఖలు చేసిన పిల్ గుజరాత్ హైకోర్టులో ఇప్పటికీ విచారణలో ఉంది. లబ్ధిదారులకు కేటాయించిన భూమిని ఆక్రమణ నుంచి విడుదల చేయాలని ఆ పిల్‌లో పేర్కొన్నారు. అనేక కేసుల్లో – సమాచార హక్కు చట్టం కింద అడిగిన వాటికి ప్రతిస్పందనలు, ప్రభుత్వ రికార్డుల ఆధారంగా – లబ్ధిదారులకు కేటాయించిన మిగులు, బంజరు భూములను ఇంకా వారికి స్వాధీనం చేయలేదని అతను తెలిపారు.

తన భూమిపై అధికారం కోసం రెండు దశాబ్దాలకు పైగా బాలాభాయ్ ఎదురుచూస్తున్నారు. “మొదట్లో నేను నా భూమిని స్వాధీనం చేసుకోడానికి పోరాడాను. అప్పుడు నాకు దగ్గర దగ్గరగా 30 ఏళ్ళు. చాలా చురుగ్గా, బలంగా ఉండేవాడిని. నా పిల్లలు ఎదుగుతున్న కొద్దీ నేను తీరికలేకుండా అయిపోయాను. వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ భద్రత గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళ ప్రాణాలను ప్రమాదంలో పడేసే పని ఏదీ చేయదలచుకోలేదు నేను,” అన్నారాయన.

మేవాణీ దాఖలు చేసిన 1,700 పేజీల సుదీర్ఘ పిటిషన్, బాలాభాయ్ కేసు అసాధారణమైనదేమీ కాదని సూచిస్తూ గుజరాత్ అంతటా అటువంటి అనేక ఉదాహరణలను పేర్కొంది.

“కొన్ని సందర్భాల్లో, కార్యకర్తల నిరంతర జోక్యం తర్వాత మాత్రమే లబ్ధిదారులు భూమిని తమ ఆధీనంలోకి తెచ్చుకోగలిగారు,” అని గుజరాత్ శాసనసభలో వడగామ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మేవాణీ తెలిపారు. తన పిటిషన్‌కు ప్రతిస్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పరిపాలనాధికారులు తమ వైఫల్యాలను అంగీకరించారని ఆయన అన్నారు.

ఉదాహరణకు, జూలై 18, 2011 నాటి ఒక లేఖలో, రెవెన్యూ అధికారులు పనిచేయకపోవడం వల్ల అహ్మదాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలలో భూమి కొలత పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని అహ్మదాబాద్ జిల్లా ఇన్‌స్పెక్టర్ ల్యాండ్ రికార్డ్స్ (డీఐఎల్ఆర్) పేర్కొన్నారు. అలాగే, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 2015 నవంబర్ 11న, 1971 నుండి 2011 వరకు 50 గ్రామాలలో కేటాయించిన భూములకు హద్దులు నిర్ణయించలేదని భావనగర్ జిల్లాకు చెందిన డీఐఎల్ఆర్ అంగీకరించారు.

Chhaganbhai Pitambar standing on the land allotted to him in the middle of Chandrabhaga river in Surendranagar district
PHOTO • Parth M.N.

సురేంద్రనగర్ జిల్లాలోని చంద్రభాగా నది మధ్యలో తనకు కేటాయించిన భూమిలో ఛగన్‌భాయ్ పీతాంబర్

డిసెంబర్ 17, 2015న గుజరాత్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రం (అఫిడెవిట్‌)లో, పంపిణీ చేయకుండా మిగిలిపోయిన 15,519 ఎకరాల భూమి వివాదంలో ఉందనీ, దానిపై 210 కేసులు పెండింగ్‌లో ఉన్నాయనీ, రాష్ట్ర రెవెన్యూ శాఖ అండర్ సెక్రటరీ హరీశ్ ప్రజాపతి తెలిపారు.

వ్యవసాయ భూముల సీలింగ్ చట్టాన్ని అమలు చేయడానికి నలుగురు అధికారులు, ఒక రాష్ట్ర జోనల్ విభాగంతో సహా ఒక యంత్రాంగాన్ని నియమించాలని ప్రతిపాదించినట్లు ప్రజాపతి పేర్కొన్నారు. “ఇందులో భాగంగా, ప్రతి సాగు భూమి వద్దకు వెళ్ళి, అధీన పత్రాల తనిఖీ చేపట్టాల్సి ఉంటుంది. ఇది కొన్ని వేల ఎకరాల భూమిని సందర్శించి, రికార్డులను తనిఖీ చేయాల్సిన ఒక బృహత్కార్యం," అని ప్రమాణపత్రంలో చెప్పారు. అయితే బంజరు భూముల కేటాయింపు మాత్రం కలెక్టర్‌ పరిధిలోనే ఉంటుందని ఈ ప్రమాణపత్రం పేర్కొంది..

అయితే, ఏడేళ్ళు గడిచినా పెద్దగా మార్పేమీ లేదని గుజరాత్ హైకోర్టులో మేవాణీ తరఫున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది ఆనంద్ యాగ్నిక్ చెప్పారు. “ఆధిపత్య కులాల నుండి భూమిని స్వాధీనం చేసుకోకుండానే ప్రభుత్వం, పంపిణీ న్యాయం కింద కాగితాలపై భూమిని పంచిపెడుతోంది,” అని ఆయన చెప్పారు. “షెడ్యూల్డ్ కులాలకి చెందిన లబ్ధిదారులు భూమిని స్వాధీనం చేయమని పట్టుబట్టినప్పుడల్లా వారిపై దాడులు జరిగాయి. స్థానిక పరిపాలనా వ్యవస్థ వారికి ఎన్నడూ సహాయం చేయలేదు. ఈ విధంగా నాగరికత తాలూకు తప్పులు స్వతంత్ర భారతంలో ఇంకా కొనగసాగుతూనే ఉండగా, పంపిణీ న్యాయం కేవలం కాగితాలకే పరిమితమైపోయింది.”

గుజరాత్‌లో ప్రస్తుత భూ పంపిణీ స్థితిని వివరించమని రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కమల్ దయానీ, భూ సంస్కరణల కమిషనర్ స్వరూప్ పి. లకు ఈ విలేఖరి లేఖలు రాశారు. వారు స్పందించిన పక్షంలో ఆ తాజా మార్పులు ఈ కథనానికి జతపడతాయి.

ఛగన్‌భాయ్ పీతాంబర్ (43) విషయానికి వస్తే, అతని భూమిని వేరొకరు కబ్జా చేయకుండా నివారించడంలో పరిపాలనా వ్యవస్థ విఫలమైంది. 1999లో భరడ్‌లోని చంద్రభాగా నది మధ్యలో ఆయనకు ఐదెకరాల భూమిని కేటాయించారు. “ఆ భూమి చాలావరకు నీటిలో మునిపోయి ఉంటుంది కాబట్టి నేను చేయగలిగిందేమీ లేదు,” అంటూ అతను మమ్మల్నక్కడికి తీసుకువెళ్లారు..

అతని భూమిలో ఎక్కువ భాగాన్ని బురద కుంటలు ఆక్రమించగా, మిగిలినదంతా జారుడుగా ఉండే బురద నేల. “భూమి బదలాయింపు కోసం నేను 1999లో డిప్యూటీ కలెక్టర్‌కి లేఖ రాశాను. 2010లో, మామలాత్‌దార్ ( తాలూకా ప్రముఖ్) నా అభ్యర్థనను తిరస్కరించారు. 'ఈ భూమిని కేటాయించి పదేళ్ళు దాటింది. ఇప్పుడేమీ చేయలేం. పదేళ్ళుగా పరిపాలనా యంత్రాంగం ఏమీ చేయకపోవడం నా తప్పు కాదుకదా?' అని ఆ అధికారి అన్నారు."

Walking through the puddles Chhaganbhai explains that the land is under water almost all the time
PHOTO • Parth M.N.

నీటి కుంటల మీదుగా నడుస్తూ, ఈ భూమి దాదాపు అన్ని సమయాలలోనూ నీళ్ళల్లో మునిగిపోయే ఉంటుందని వివరిస్తున్న ఛగన్‌భాయ్

ఈ నిర్లక్ష్యం ఛగన్‌భాయ్, అతని కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపింది. కుటుంబమంతా కూలిపని పైనే ఆధారపడి ఉన్నప్పుడు, ఎదుగుదలకూ భద్రతకూ అవకాశం ఉండదని అతని భార్య కంచన్‌బెన్ అన్నారు. “పగలంతా కష్టపడి సంపాదించినదానితో రాత్రికి భోజనం ఏర్పాటు చేసుకుంటాం. అదే భూమి ఉంటే అందులో ఆహారం పండించుకోవచ్చు, కూలీ పని చేస్తే వచ్చే డబ్బుని ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు,” అని అంటారామె.

పిల్లల చదువుల కోసం వాళ్ళు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది. “సుమారు పదేళ్ళ క్రితం, నెలకు 3 శాతం వడ్డీ చొప్పున రూ.50,000 అప్పు తీసుకున్నాం. మాకు నలుగురు పిల్లలు. ఆ రోజుల్లో రోజుకు రూ.100-150 మాత్రమే సంపాదించేవాళ్ళం. వేరే దారి లేకపోయింది. అప్పుడు తీసుకున్న అప్పుకు ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాం,” అని 40 ఏళ్ళ కంచన్‌బెన్ తెలిపారు.

భూమిపై హక్కులు కోల్పోతే అనేక పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. దాని కోసం దరఖాస్తు చేయడానికి చాలా సమయాన్ని, శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. వీటికి తోడు, అది కోల్పోవడం వల్ల కలిగే ఒత్తిడి, అందుకోసం సంవత్సరాలుగా పెట్టిన ఖర్చులు/అప్పులను తరచూ తక్కువ అంచనా వేస్తుంటారు.

ఒక ఎకరం భూమి ఉన్న రైతు, రెండు పంటల కాలానికి, తక్కువలో తక్కువ రూ.25,000 సంపాదించవచ్చని అనుకున్నా, 5-7 సంవత్సరాలలో ఈ నష్టం ఎకరానికి రూ.1,75,000 ఉంటుందని మేవాణీ దాఖలు చేసిన పిల్‌లో పేర్కొన్నారు.

బాలాభాయ్‌కు ఐదెకరాల భూమి ఉన్నా, పాతికేళ్ళుగా ఆయనను ఆ భూమిని సాగు చేసుకోనివ్వలేదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత, కోల్పోయిన ఆదాయాల ఖర్చు లక్షల రూపాయలు ఉంటుంది. అటువంటి బాలాభాయ్ లాంటి రైతులు వేల సంఖ్యలో ఉన్నారు.

“ఈ రోజు మార్కెట్‌లో ఆ భూమి ఒక్కటే రూ.25 లక్షల ధర పలుకుతుంది. నేను రాజులా జీవించివుండేవాడిని. సొంతానికి ఒక మోటార్ సైకిల్ కొనుక్కోగలిగేవాడిని,” అని అతను నిట్టూర్చారు.

సొంత భూమి ఉంటే అది ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించడమే కాకుండా ఊరిలో గౌరవాన్నీ పలుకుబడినీ తెచ్చిపెడుతుంది. “అగ్రవర్ణాలకు చెందిన వ్యవసాయ భూములలో పనిచేసే కూలీలను ఆ భూస్వాములు హీనంగా చూస్తారు. వాళ్ళ దయాదాక్షిణ్యంతో బతుకుతాం కాబట్టి ఘోరంగా అవమానిస్తారు. ఉపాధి కోసం వాళ్ళపై ఆధారపడతాం కాబట్టి మేం ఏమీ చేయలేం,” అని సురేంద్రనగర్ జిల్లా ధ్రాంగధరా తాలూకా లోని రామ్‌దేవ్‌పూర్ గ్రామానికి చెందిన 75 ఏళ్ళ త్రిభువన్ వాఘేలా వివరించారు.

Tribhuvan Vaghela says it took 26 years of struggle for him to get possession of his land.
PHOTO • Parth M.N.
Vaghela's daugher-in-law Nanuben and son Dinesh at their home in Ramdevpur village
PHOTO • Parth M.N.

ఎడమ: తన భూమిని స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి 26 ఏళ్ళు పోరాడాల్సి వచ్చిందన్నారు త్రిభువన్ వాఘేలా. కుడి: రామ్‌దేవ్‌పూర్ గ్రామంలోని తమ ఇంటి వద్ద వాఘేలా కోడలు నానూబేన్, కుమారుడు దినేశ్

షెడ్యూల్డ్ కులమైన బున్‌కర్ సముదాయానికి చెందిన వాఘేలాకు 1984లో, రామ్‌దేవ్‌పూర్‌లో పదెకరాల భూమిని కేటాయించారు. కానీ 2010లో మాత్రమే ఆ భూమి ఆయన అధీనంలోకి వచ్చింది. “ఇది ఇంత సమయం పట్టడానికి కారణం కుల వివక్షను పట్టించుకోని సమాజం. నేను నవసర్జన్ ట్రస్ట్‌ని సంప్రదించాను. వారి కార్యకర్తలు (చర్య తీసుకోవాలని) నిరసనలు చేసి, అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మేం చేసిన పనికి ధైర్యం కావాలి. ఆ రోజుల్లో ఠాకూర్ (రాజ్‌పుత్) కులాన్ని నిలవరించడం అంత సులభమైన విషయం కాదు,” అని వాఘేలా గుర్తుచేసుకున్నారు..

సౌరాష్ట్రలో – సురేంద్రనగర్ జిల్లా ఉన్న ప్రాంతం – ప్రధానంగా పటేల్ (పాటీదార్) కులానికి చెందిన కౌలు రైతులకు భూసంస్కరణలు ఎలా ప్రయోజనం చేకూర్చాయో గుజరాత్‌లోని ప్రఖ్యాత దళిత హక్కుల కార్యకర్త, నవసర్జన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడైన మార్టిన్ మెక్‌వాన్ వివరించారు. “1960లో, గుజరాత్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడానికి ముందు (మునుపటి సౌరాష్ట్ర రాష్ట్రం గుజరాత్‌లో విలీనం కాకముందు), సౌరాష్ట్ర (రాష్ట్ర) మొదటి ముఖ్యమంత్రి ఉచ్ఛంగరాయ్ ఢేబర్ మూడు చట్టాలను తీసుకువచ్చి 30 లక్షల (3 మిలియన్) ఎకరాల భూమిని పటేల్‌లకు బదలాయించారు. పటేల్‌ సమాజం వారి భూమిని రక్షించుకుంది. తద్వారా కొన్నేళ్ళకి గుజరాత్‌లో అత్యంత ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంది.”

అదే సమయంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే, తన భూమి కోసం పోరాటాన్ని సాగించారు వాఘేలా. “అది తగిన పోరాటం. నేను పోరాటం చేశాను కనుకే నా కొడుక్కూ, అతని పిల్లలకూ కూడా నాలాగా సమస్యలు ఎదుర్కోవలసిన అవసరం పడలేదు. ఇప్పుడు ఆ భూమి మార్కెట్‌ విలువ రూ. 50 లక్షలు. నావాళ్ళు తల పైకెత్తుకొని మా ఊళ్ళో నడవగలరు,” అన్నారు వాఘేలా.

ఇప్పుడు తమ కుటుంబం మరింత ఆత్మవిశ్వాసంతో బతుకుతోందని వాఘేలా కోడలు నానూబెన్ (31) అన్నారు. “మేం మా వ్యవసాయ భూమిలో కష్టపడి, సంవత్సరానికి సుమారు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నాం. ఇదేమంత ఎక్కువ కాదని నాకు తెలుసు. కానీ ఇప్పుడు మాకు మేమే యజమానులం. పని కోసమో లేదా డబ్బు కోసమో మేం అడుక్కోవలసిన అవసరం లేదు. నా పిల్లల పెళ్ళిళ్ళకింక ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎవరూ తమ పిల్లలను భూమి లేని వాళ్ళకిచ్చి పెళ్ళి చేయాలనుకోరు,” అన్నారామె.

గత పదేళ్ళ నుండి వాఘేలా కుటుంబం అనుభవిస్తున్న స్వేచ్ఛను బాలాభాయ్ కూడా అనుభవించాలనుకుంటున్నారు. పెళుసుగా మారిన కాగితాలను చక్కగా మడతపెడుతూ, “నా భూమి కోసం నా జీవితమంతా ఎదురుచూస్తూనే ఉన్నాను. అరవై ఏళ్ళ వయసు వచ్చాక కూడా నా కొడుకులు కూలీలుగా పనిచేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు గౌరవంగా హోదాతో బతకాలని కోరుకుంటున్నాను,” అని తన మనసులో మాట చెప్పారు.

ఎప్పుడో ఒకప్పుడు ఆ భూమిని స్వాధీనం చేసుకుంటానని బాలాభాయ్ ఇప్పటికీ ఆశపడుతున్నారు. దానిలో పత్తి, జొన్నలు, సజ్జలు సాగుచేయాలనుకుంటున్నారు. తన స్థలంలో ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. భూయజమానిగా బతకడం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు. పాతికేళ్ళుగా దస్తావేజుల్ని జాగ్రత్తగా దాచుకొని, ఏదో ఒక రోజు అవి తమ తలరాతను మారుస్తాయనుకుంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా, బాలాభాయ్ తన ఆశను కోల్పోలేదు. “నన్ను సజీవంగా ఉంచుతున్న ఏకైక విషయం ఇదే!” అంటారాయన.

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

Parth M.N.

पार्थ एम एन हे पारीचे २०१७ चे फेलो आहेत. ते अनेक ऑनलाइन वृत्तवाहिन्या व वेबसाइट्ससाठी वार्तांकन करणारे मुक्त पत्रकार आहेत. क्रिकेट आणि प्रवास या दोन्हींची त्यांना आवड आहे.

यांचे इतर लिखाण Parth M.N.
Editor : Vinutha Mallya

विनुता मल्ल्या पीपल्स अर्काइव्ह ऑफ रुरल इंडिया (पारी) मध्ये संपादन सल्लागार आहेत. त्यांनी दोन दशकांहून अधिक काळ पत्रकारिता आणि संपादन केलं असून अनेक वृत्तांकने, फीचर तसेच पुस्तकांचं लेखन व संपादन केलं असून जानेवारी ते डिसेंबर २०२२ या काळात त्या पारीमध्ये संपादन प्रमुख होत्या.

यांचे इतर लिखाण Vinutha Mallya
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

यांचे इतर लिखाण Y. Krishna Jyothi