రాత్రివేళ మంచి నిద్ర పోవడమనేది షీలా వాఘ్మారేకి ఒక సుదూర జ్ఞాపకం.
"కొన్ని సంవత్సరాలుగా నేను రాత్రుళ్ళు నిద్రపోలేకపోతున్నాను..." నేలపై పరచివున్న మెత్తని గోధడీ(బొంత)పై కాళ్ళు కత్తెరవేసుకుని కూర్చునివున్న 33 ఏళ్ల షీలా చెబుతున్నారు. ఎరుపెక్కిన కనుకొలుకులతో ఉన్న ఆమె కళ్ళు తీవ్రమైన నొప్పితో మండుతున్నాయి. ఆమె తన దీర్ఘంగా సాగే రాత్రుల గురించి వివరిస్తున్నప్పుడు, దుఃఖాన్ని అణచుకొనే ప్రయత్నంలో, ఆమె శరీరం వెక్కిళ్ళతో కదలిపోతోంది. “రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. నాకు ఊపిరాడకుండా ఉంది."
షీలా మహారాష్ట్రలోని బీడ్ జిల్లా, రాజురి ఘోడ్కా అనే గ్రామ శివార్లలో నివసిస్తున్నారు. ఈ గ్రామం బీడ్ పట్టణానికి 10 కి.మీ. దూరంలో ఉంది. భర్త మాణిక్, ముగ్గురు పిల్లలు కార్తీక్, బాబు, రుతుజలతో ఆమె తన రెండు గదుల ఇటుక ఇంటిలో నివసిస్తున్నారు. రాత్రివేళ వారితో కలిసి నిద్రపోయేటపుడు అణిచిపెట్టిన తన ఏడుపు శబ్దం వారికి నిద్రాభంగం కలిగిస్తుంటుందని ఆమె చెప్పారు. "నా ఏడుపు వారి నిద్రను చెడగొడుతుంది. అప్పుడు నా కళ్ళను గట్టిగా మూసుకొని నిద్రపోయే ప్రయత్నం చేస్తాను."
అయితే నిద్ర రాదు. కన్నీళ్ళూ ఆగవు.
"నేనెప్పుడూ విచారంగా, ఆందోళనపడుతూ ఉంటాను," అంటారు షీలా."ఇదంతా నా పిశ్వీ (గర్భసంచి) తొలగించిన తర్వాత ప్రారంభమయింది. దాంతో నా జీవితం ఎప్పటికీ మారిపోయింది." 2008లో ఆమెకు శస్త్రచికిత్స చేసి గర్భసంచిని తొలగించినప్పటికి ఆమె వయసు కేవలం 20 సంవత్సరాలే. అప్పటి నుంచీ ఆమె తీవ్రమైన కుంగుబాటు, నిద్రలేని రాత్రులు, చెప్పనలవికాని చికాకులు, శారీరక నొప్పులను ఇంతకాలంగా అనుభవిస్తూనే ఉన్నారు.















