ఢాక్ ల శబ్దాలతో అగర్తలా అంతా కంపిస్తోంది. అక్టోబర్ 11న దుర్గ పూజ జరుగుతోంది. ప్రతీ ఏడాది, ఈ పండుగ సన్నాహాలు కొన్ని వారాల ముందు నుంచే మొదలవుతాయి. పండగకు పండాళ్లు నిర్మిస్తారు, విగ్రహాలను తయారుచేసేవారు తమ విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతారు, కుటుంబంలో అందరూ కొత్త బట్టలు కొనుకుంటారు.
ఢాక్ అనే డ్రమ్ వంటి ఆకారం ఉన్న వాయిద్యాన్ని మెడకు తగిలించుకుని, గట్టిగా చదునుగా ఉండే స్థలం పై పెట్టి, కర్రలతో దీనిని మోగిస్తారు. పండగల్లో ఇది ఒక ముఖ్యమైన భాగం.
కానీ కాలాన్ని బట్టే ఢాక్ ని వాయించడం జరుగుతుంది. పూజ సమయమైన ఆ ఐదు రోజులూ మోగించి, చివరి రోజైన లక్ష్మి పూజకు దరువు పెంచుతారు . ఈ ఏడాది ఈ పూజ అక్టోబర్ 20న వచ్చింది. కొంతమంది ఢాకీలకు అగర్తలాలోనేకాక త్రిపురలోని ఇంకా చాలా భాగాలలో విపరీతమైన డిమాండ్ ఉంది.
ఢాకీలను పండాల్ కమిటీలేగాక కుటుంబాలు కూడా పీలుస్తాయి. కొన్నిసార్లు వారికి పని ఇవ్వబోయే ముందు ఒకసారి వాయించి చూపమంటారు. ఇందులో దాదాపుగా అందరు ప్రవీణులే. వీరి ఇంట్లో పెద్దవారు వీరికి ఈ వాయిద్యాన్ని చిన్నప్పటి నుంచే వాయించడం నేర్పుతారు. “నేను నాకన్నా పెద్దవారైన మా తల్లిదండ్రుల తోబుట్టువుల పిల్లలతో కలిసి వాయించేవాణ్ణి.” అన్నాడు 45 ఏళ్ళ ఇంద్రజిత్ రిషిదాస్. “నేను కషి(ఒక లోహపు వాయిద్యం, చిన్న కర్రతో వాయిస్తారు) తో మొదలుపెట్టాను, ఆ తరవాత ఢోల్, ఇక ఆ తరవాత ఢాక్.” ఇతను, ఇతనితో పాటు ఇంకో రిషిదాస్, రోహిదాస్, రవిదాస్ కుటుంబాలు ముంచి వర్గానికి చెందినవారు. త్రిపురలో వీరిని షెడ్యూల్ కుల జాబితాలో చేర్చారు.)
తనవంటి ఎందరో అగర్తలా ఢాకీలలా, ఇంద్రజిత్ మిగిలిన సంవత్సరమంతా సైకిల్ రిక్షా నడుపుతాడు. కొన్నిసార్లు, మిగిలినవారిలా అతను బాండులలో వాయిస్తాడు. స్థానికంగా వీరిని ‘బ్యాండ్-పార్టీ’, అని పిలుస్తారు. ఇటువంటి సందర్భాలు లేనప్పుడు ఢాకీలు ఎలెక్ట్రిషియన్లుగా, ప్లంబర్లుగా రోజువారీ కూలీ పని చేస్తున్నారు. కొందరు కూరగాయలు అమ్మేవారు, కొందరు దగ్గరి గ్రామాలలో ఉన్న రైతులు ఏవైనా ప్రోగ్రాములు మాట్లాడుకున్నప్పుడు వస్తారు.




















