తూర్పు దిల్లీలోని దిల్లీ-నోయిడా డైరెక్ట్ ఫ్లైవే దగ్గర, యమునా నదికి దగ్గరగా, పచ్చని పొలాలలోకి విస్తరించి ఉన్న ఒక ఇసుక దారి. ఇది చిల్లా ఖాదర్ (జనాభాలెక్కలలో చిల్లా సరోదా ఖాదర్‌గా జాబితా చేసివుంది) అనే ప్రాంతానికి దారి తీస్తుంది.
చాలావరకు ఇక్కడి రోడ్లన్నీ దుమ్ముదుమ్ముగా, ఎగుడుదిగుడుగా ఉంటాయి; విద్యుత్ టవర్లు ఉన్నాయిగానీ విద్యుత్ సరఫరా మాత్రం లేదని అక్కడ నివాసముండేవారు చెప్తారు. దాదాపు యాబై ఏళ్ళుగా అక్కడ నివాసముంటోన్న డెబ్బయ్యేళ్ళ సుబేదార్ సింగ్ యాదవ్, కర్బూజా కాయలను పండించడానికి తన తండ్రి సోదరునితో కలిసి ఇక్కడకు వలసవచ్చారు. ఈయన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, గాజీపుర్ జిల్లా, కరండా తెహసిల్ లోని ధరమ్మర్‌పుర్ ఉపర్వార్ గ్రామానికి చెందినవారు. కర్బూజాలతో మొదలుపెట్టిన ఆయన కూరగాయలు, గోధుమ, వరి పంటలను కూడా పండిస్తున్నారు. వీటితో పాటు పశువులను కూడా పెంచుతున్నారు. కౌలు రైతు అయిన ఈయన తన కుటుంబంతో కలిసి ఇద్దరు వ్యవసాయ కూలీల సాయంతో 15 బిఘాల (దాదాపు 3 ఎకరాలు) భూమిని సాగుచేస్తారు.
యమునా జలాలు కలుషితం కావడంతో, ఇక్కడి రైతులు తమ పొలాలకు నీరందించేందుకు గొట్టపు బావులను నిర్మించుకున్నారు. చిల్లా ఖాదర్ వరదలకూ, అడవి జంతువుల దాడులకూ గురయ్యే అవకాశం ఉందని యాదవ్ అన్నారు. కానీ వరదల వలన కలిగే పంట నష్టాలకు ప్రభుత్వం నుండి పరిహారం అందేది మాత్రం భూ యజమానులకే తప్ప కౌలు రైతులకు కాదని అంటారాయన. మండీ వద్ద కూడా మధ్య దళారులే రైతుల పంటల ధరను నిర్ణయిస్తారు. దాంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
దశాబ్దాలుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని ఇక్కడి రైతులు చెబుతున్నప్పటికీ, అధికారులు మాత్రం తమను కబ్జాదారులుగా చూస్తున్నారని, అడపాదడపా తమ ఇళ్ళను కూల్చివేసి, పంటలను ధ్వంసం చేస్తున్నారని ఇక్కడి రైతులు చెప్తున్నారు. "మొన్న 10 రోజుల క్రితమే డిడిఎ (ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ) ఒకరి పొలాన్ని తన బుల్‌డోజర్‌తో నాశనంచేసింది," అని యాదవ్ చెప్పారు. "అది పొలంలో ఉన్న పంటను, మా ఝుగ్గీ లను (గుడిసెలను) నాశనం చేసింది. ప్రభుత్వానికి భూమి కావాలంటే మేం వారి దారికి అడ్డు రాబోమని చెప్పాం. కానీ వారు మా ఇళ్ళను నాశనం చేయడం తప్పు."
యాదవ్, చిల్లా ఖాదర్‌లోని ఇతర నివాసితులు తమ సమస్యలను గురించి ఈ వీడియోలో చెప్తున్నారు, వినండి.
చిల్లా ఖాదర్ లో అనధికార పాఠశాలలను నడుపుతూ , అక్కడ నివాసముండేవారిని ఇళ్ళ నుండి గెంటివేసినప్పుడు వారి హక్కుల కోసం వాదించిన బస్తీ సురక్షా మంచ్ కు చెందిన అబ్దుల్ షకీల్ బాషాకు రచయిత కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు
అనువాదం: సుధామయి సత్తెనపల్లి