రమకు ఏప్రిల్ 1, 2022 శుక్రవారం నాటి ఉదయం అన్ని రోజులలాగే మొదలయింది. పొద్దుపొద్దున్నే 4.30కల్లా లేచి, ఇంటికి దగ్గరలోనే ఉన్న ఊరి బావి దగ్గర నుండి నీళ్ళు మోసుకొచ్చి, బట్టలుతికి, ఇల్లు శుభ్రం చేసింది. ఆ తర్వాత తన తల్లితో కలిసి కంజి (గంజి) తాగిన తర్వాత తన ఉద్యోగానికి బయల్దేరింది. తన గ్రామానికి 25 కి.మీ. దూరంలో, దిండుక్కల్‌ జిల్లా, వేడసందూర్ తాలూకా లో ఉండే నాచ్చి అప్పేరెల్‌లో ఆమె ఉద్యోగం చేస్తోంది. కానీ ఆరోజు మధ్యాహ్నం వేళకల్లా 27 ఏళ్ళ రమ, ఆమె తోటి మహిళా కార్మికులు చరిత్రను సృష్టించారు- తమ దుస్తుల తయారీ కర్మాగారంలో జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా పోరాడి!

నిజాయితీగా చెప్పాలంటే, మేం అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేశామనిపిస్తోంది నాకు," దిండుక్కల్ ఒప్పందం గురించి మాట్లాడుతూ అంది రమ. ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ గ్లోబల్ క్లోతింగ్ (నాచ్చి అప్పేరెల్‌కు మాతృసంస్థ, తిరుప్పూర్ కేంద్రగా పనిచేస్తుంది), తమిళనాడు టెక్స్‌టైల్ అండ్ కామన్ లేబర్ యూనియన్ (TTCU)లు ఈ ఒప్పందంపై ఆ రోజు సంతకాలు చేశాయి. తమిళనాడులోని దిండుక్కల్‌ జిల్లాలో ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న కర్మాగారాలలో అమలవుతున్న లింగ-ఆధారిత హింస, వేధింపులను అరికట్టడానికి ఈ ఒప్పందం జరిగింది.

ఈ మైలురాయి ఒప్పందంలో భాగంగా, టిటిసియు-ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్‌ల మధ్య జరిగిన ఈ ఒప్పందానికి మద్దతు ఇవ్వడానికీ, అమలు చేయడానికీ బహుళజాతి ఫ్యాషన్ బ్రాండ్ అయిన ఎచ్&ఎమ్ (H&M) 'అమలుచేయదగిన బ్రాండ్ ఒప్పందం', లేదా ఇబిఎ(EBA) పై సంతకం చేసింది. ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్‌వారి నాచ్చి అప్పేరెల్, స్వీడన్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ దుస్తుల కంపెనీకోసం దుస్తులను ఉత్పత్తిచేస్తుంది. ఎచ్&ఎమ్ సంతకం చేసిన ఈ ఒప్పందం, ఫ్యాషన్ పరిశ్రమలో లింగ-ఆధారిత హింసను పరిష్కరించే దిశలో జరిగిన రెండవ పారిశ్రామిక ఒప్పందం.

దళిత మహిళల నాయకత్వంలో నడుస్తోన్న టెక్స్‌టైల్ కార్మికుల కార్మిక సంఘమైన టిటిసియులో సభ్యురాలైన రమ, గత నాలుగేళ్ళుగా నాచ్చి అప్పేరెల్‌లో పనిచేస్తోంది. "ఒక యాజమాన్యం, ఒక బ్రాండ్ [H&M]లు ఒక దళిత మహిళల కార్మిక సంఘంతో ఒప్పందంపై సంతకం చేస్తాయని నేనెన్నడూ అనుకోలేదు. కొన్ని నిజంగా తప్పుడు పనులకు పాల్పడిన తర్వాత, వారిప్పుడు సరైన అడుగు వేశారు," అని రమ చెప్పింది. కార్మిక సంఘంతో ఎచ్&ఎమ్ సంతకం చేసిన ఒప్పందం, భారతదేశంలో సంతకం చేయబడిన మొట్టమొదటి ఇబిఎ. ఇది చట్టానికి కట్టుబడి ఉన్న ఒప్పందం. దీని ప్రకారం సరఫరాదారైన ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ టిటిసియుతో తాను చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తే, ఎచ్&మ్ దానిపై జరిమానాలు విధిస్తుంది.

కానీ, నాచ్చి అప్పేరల్‌లో పనిచేసే 20 ఏళ్ళ దళిత యువతి, జయశ్రీ కదిర్వేల్‌పై అత్యాచారం జరిపి, ఆపైన ఆమెను హత్యచేసిన ఒక ఏడాది దాటిన తర్వాత మాత్రమే, ఈస్ట్‌మన్ చర్చలకు రావడానికి సిద్ధపడింది. జనవరి 2021లో హత్యగావించబడటానికి ఆరు నెలల ముందునించీ కర్మాగారంలో పనిచేసే సూపర్‌వైజర్ జయశ్రీపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆధిపత్య కులానికి చెందిన ఈ సూపెర్‌వైజర్‌పై హత్యానేరం నమోదయింది.

జయశ్రీ హత్య, ఆమె పనిచేసే దుస్తుల తయారీ కర్మాగారంపైనా, దాని మాతృసంస్థ అయిన ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ పైనా ఆగ్రహజ్వాలలు రేకెత్తేలా చేసింది. ఎచ్&ఎమ్, గ్యాప్, పివిఎచ్ వంటి బహుళజాతి దుస్తుల కంపెనీలకు దుస్తుల సరఫరాదారైన ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్, భారతదేశంలోని అతి పెద్ద దుస్తుల తయారీదారులలో ఒకటి. జయశ్రీకి న్యాయంచేయాలి అనే ప్రచారంలో భాగంగా యూనియన్లు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాల ప్రపంచ కూటమి, "జయశ్రీ కదిర్వేల్ కుటుంబంపై ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్న బెదిరింపు చర్యలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని" డిమాండ్ చేసింది.

A protest by workers of Natchi Apparel in Dindigul, demanding justice for Jeyasre Kathiravel (file photo). More than 200 workers struggled for over a year to get the management to address gender- and caste-based harassment at the factory
PHOTO • Asia Floor Wage Alliance

జయశ్రీ కదిర్వేల్‌కు న్యాయం చేయాలి అని కోరుతూ దిండుక్కల్‌లోని నాచ్చి అప్పేరల్ కార్మికుల నిరసన ప్రదర్శన (పాత చిత్రం). కర్మాగారంలో జరుగుతున్న లింగ, కుల ఆధారిత వేధింపుల విషయంలో చర్యలు తీసుకునేలా యాజమాన్యం మెడలు వంచడానికి, 200 మందికి పైగా కార్మికులు ఏడాదికి పైగా పోరాటం చేశారు

జయశ్రీకి జరిగిన విషయం నిజానికి పెద్ద అరుదైన విషయమేమీ కాదు. ఆమె హత్య జరిగిన తరువాత, నాచ్చి అప్పేరల్‌లోని అనేకమంది మహిళా కార్మికులు తమపై జరిగిన వేధింపులను గురించి ఏకరువు పెడుతూ ముందుకువచ్చారు. వ్యక్తులుగా ముందుకురావడానికి సందేహించిన కొంతమంది PARIతో ఫోన్‌లో కూడా మాట్లాడారు.

"[పురుష] సూపర్‌వైజర్లు చాలా మామూలుగా మమ్మల్ని దుర్భాషలాడుతుంటారు. మేం పనికి ఆలస్యంగా వచ్చినా, ఉత్పత్తి లక్ష్యాలను పూర్తిచేయలేకపోయినా, వాళ్ళు మామీద పెద్దపెద్దగా అరుస్తారు; చాలా అసభ్యంగా, కించపడేలా అవమానిస్తారు." అని దుస్తుల తయారీ కార్మికురాలైన 31 ఏళ్ళ కోసలై చెప్పారు. 12వ తరగతి పాసైన కోసలై ఒక దళిత మహిళ. ఒక దశాబ్దకాలం పైగానే దుస్తుల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. "ఎక్కువగా దళిత మహిళా కార్మికులనే ఈ సూపర్‌వైజర్లు వేధిస్తూవుంటారు. మేం అప్పటికి పూర్తిచేయవలసిన పనిని పూర్తిచేయలేకపోతే, వాళ్ళు మమ్మల్ని తమ నోటికొచ్చినట్టు 'బర్రెలు', 'లంజలు', 'కోతులు' అంటూ దుర్భాషలాడతారు," అని చెప్పారామె. "మమ్మల్ని తాకడానికి ప్రయత్నించడమో, మా బట్టల గురించి, మహిళల శరీరాల గురించి అసభ్యకరమైన జోకులు వేయడమో చేసే సూపర్‌వైజర్లు కూడా ఉన్నారు."

పట్టభద్రురాలైన లత, పై చదువులు చదువుకునేందుకు డబ్బులు పనికొస్తాయనే ఆశతో ఈ కర్మాగారంలో పనిలో చేరింది. (ఆమెకూ, ఆమె తోటి కార్మికులకూ రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే, 310 రూపాయలు వస్తాయి) కానీ కర్మాగారంలో ఉన్న భయంకరమైన పని పరిస్థితులను చూసి, కలతపడి ఆ పనిని వదిలేసింది. "పురుష మేనేజర్లు, సూపర్‌వైజర్లు, మెకానిక్కులు మమ్మల్ని తాకడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. దీనిగురించి ఎవరికైనా ఫిర్యాదుచేయడానికి కూడా ఉండదు." కన్నీరు కారుస్తూ చెప్పింది లత.

"నీ కుట్టు మెషిన్‌ని బాగుచేయడానికి ఎవడైనా మెకానిక్ వస్తే, వాడు నిన్ను తాకడానికి చూస్తాడు, లేదా నీనుంచి లైంగిక ప్రయోజనాన్ని కోరతాడు. అందుకు నువ్వు ఒప్పుకోకపోతే, వాడు సమయానికి నీ మెషిన్‌ని బాగుచేయడు; దాంతో నువ్వు నీ లక్ష్యాన్ని అందుకోలేకపోతావు- అప్పుడు సూపర్‌వైజరో, మేనేజరో వచ్చి నిన్ను నానా దుర్భాషలాడతారు. కొన్నిసార్లు సూపర్‌వైజర్లలో ఎవడో ఒకడు ఒక పనిచేస్తున్న మహిళకు దగ్గరగా నిలబడి, తన శరీరంతో ఆమె శరీరాన్ని తాకుతాడు." ఈ పనికోసం తన ఊరు నుంచి రోజూ 30 కి.మీ. ప్రయాణంచేసి వచ్చే లత చెప్పింది.

దీనికి విరుగుడు కనిపెట్టడమెలాగో మహిళలకు తెలియదని లత అంటుంది. "ఎవరిదగ్గరకు వెళ్ళి ఆమె ఫిర్యాదు చేస్తుంది? పైకులానికి చెందిన మేనేజర్‌పై, దళిత కులానికి చెందిన మహిళ ఫిర్యాదు చేస్తే, ఆమె మాటలను నమ్మేదెవరు?" అని లత ప్రశ్నిస్తోంది.

"ఆమె ఎవరిదగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది?" ఇదే ప్రశ్నను దివ్య రాగిణి(42) కూడా లేవనెత్తారు. టిటిసియు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె, నాచ్చి అప్పేరల్స్‌లో లింగ ఆధారిత హింస లేకుండా చేసేందుకు సుదీర్ఘమైన ప్రచార కార్యక్రమానికి నాయకత్వం వహించారు. జయశ్రీ హత్య జరగడానికి చాలా ముందే, 2013లో, దళిత మహిళలు నాయకత్వం వహించిన ఒక స్వతంత్ర కార్మిక సంఘంగా టిటిసియు ఏర్పడింది. అప్పటినుంచీ ఈ సంఘం, తమిళనాడులో లింగ ఆధారిత హింసను అంతమొందించడానికి కార్మికులను సంఘటితం చేస్తూనేవుంది. కోయంబత్తూరు, దిండుక్కల్, ఈరోడ్, తిరుప్పూర్ వంటి దుస్తుల తయారీ కేంద్రాలతో సహా 12 జిల్లాల్లోని 80 శాతం మంది వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమకు చెందిన 11,000 మంది కార్మికులకు ఈ కార్మిక సంఘం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది దుస్తుల తయారీ కర్మాగారాలలో వేతనాల దొంగతనానికీ, కుల ఆధారిత హింసకూ వ్యతిరేకంగా కూడా పోరాడుతుంది.

Thivya Rakini, state president of the Dalit women-led Tamil Nadu Textile and Common Labour Union.
PHOTO • Asia Floor Wage Alliance
Thivya signing the Dindigul Agreement with Eastman Exports Global Clothing on behalf of TTCU
PHOTO • Asia Floor Wage Alliance

ఎడమ: దళిత మహిళల నేతృత్వంలోని తమిళనాడు టెక్స్‌టైల్ అండ్ కామన్ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు దివ్య రాగిణి. కుడి: టిటిసియు తరపున ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ గ్లోబల్ క్లాతింగ్‌తో దిండుక్కల్ ఒప్పందంపై సంతకం చేస్తున్న దివ్య

"ఒప్పందానికి ముందు, కర్మాగారంలో సరైన అంతర్గత ఫిర్యాదుల కమిటీ (internal complaints committee - ICC) ఉండేది కాదు," అన్నారు దివ్య. ఉనికిలో ఉన్న ఐసిసి కూడా మహిళల ప్రవర్తన మీద కాపలా కాస్తూ ఉండేదని 26 ఏళ్ళ దళిత కార్మికురాలు మిని చెప్పింది. ఈమె అక్కడికి 28 కి.మీ. దూరంలో ఉన్న ఒక గ్రామం నుంచి ఇక్కడకు పనిలోకి వస్తుంది. "మేం చేసే ఫిర్యాదులను పట్టించుకోవడం అటుంచి, మేమెలా బట్టలు ధరించాలీ, ఎలా కూర్చోవాలీ అంటూ మాకు చెప్తుంటారు," అన్నదామె. "మమ్మల్ని బాత్రూమ్‌కు వెళ్ళేందుకు విరామం తీసుకోకుండా నిరోధించారు, నిర్బంధంగా ఎక్కువ సమయం పని చేయించేవాళ్ళు, మాకు అర్హత ఉన్న సెలవులను కూడా మేం ఉపయోగించుకోకుండా నిరోధించారు."

జయశ్రీ హత్య తర్వాత టిటిసియు, లైంగిక హింసను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం గురించీ, ఇతర సమస్యలతో పాటు బాత్రూమ్‌కు వెళ్ళే విరామం లేకపోవడం గురించీ, బలవంతంగా ఓవర్‌టైమ్ చేయించడం గురించిన ఆందోళనలను కూడా తమ ప్రచార కార్యక్రమంలో లేవనెత్తింది.

"కంపెనీ కార్మిక సంఘాలను వ్యతిరేకిస్తుంది. అందుకని కార్మికులలో ఎక్కువమంది తమ సంఘ సభ్యత్వాన్ని రహస్యంగా ఉంచుతారు." అన్నారు దివ్య. కానీ జయశ్రీ మరణం ఒక కీలకమైన మలుపు. ఫ్యాక్టరీ నుండి బెదిరింపులను ఎదుర్కొన్నప్పటికీ, రమ, లత, మిని వంటి కార్మికులు పోరాటానికి దిగారు. దాదాపు 200 మంది మహిళలు ఏడాదికి పైగా నిరసన ర్యాలీలలో పాల్గొన్నారు. జయశ్రీకి న్యాయం జరగాలి అనే ప్రచార కార్యక్రమం ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేయడానికి, ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్న సంస్థలకు అనేకమంది తమ సాక్ష్యాలను అందించారు.

చివరకు, టిటిసియు, అంతర్జాతీయ ఫ్యాషన్ సప్లై చెయిన్‌లలో హింస, వేధింపులను అరికట్టే ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న రెండు సంస్థలు – ఆసియా ఫ్లోర్ వేజ్ అలయన్స్ (AFWA), గ్లోబల్ లేబర్ జస్టిస్-ఇంటర్నేషనల్ లేబర్ రైట్స్ ఫోరమ్ (GLJ-ILRF) – ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎచ్&మ్‌తో అమలుచేయగల బ్రాండ్‌ ఒప్పందంపై సంతకం చేశాయి.

మూడు సంస్థల సంయుక్త పత్రికా ప్రకటన ప్రకారం: దిండుక్కల్ ఒప్పందం భారతదేశంలో మొట్టమొదటి అమలు చేయదగిన బ్రాండ్ ఒప్పందం. ఇది "దుస్తుల కర్మాగారాలనూ, దుస్తుల తయారీలో ఉపయోగించే నూలు, వస్త్ర తయారీ కర్మాగారాలనూ- ఈ రెండింటినీ చేర్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఇబిఎ కూడా."

సంతకం చేసిన వారంతా సంయుక్తంగా “లింగం, కులం లేదా వలస స్థితిపై ఆధారపడి అమలయ్యే వివక్షను నిర్మూలించడానికి; పారదర్శకతను పెంచడానికి; దుస్తుల తయారీ కర్మాగారాలలో పరస్పర గౌరవ సంస్కృతిని పెంపొందించుకోవడానికి" కట్టుబడి ఉంటాయి.

The Dindigul Agreement pledges to end gender-based violence and harassment at the factories operated by Eastman Exports in Dindigul. ‘It is a testimony to what organised Dalit women workers can achieve,’ Thivya Rakini says
PHOTO • Antara Raman
The Dindigul Agreement pledges to end gender-based violence and harassment at the factories operated by Eastman Exports in Dindigul. ‘It is a testimony to what organised Dalit women workers can achieve,’ Thivya Rakini says
PHOTO • Antara Raman

దిండుక్కల్‌లో ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ నిర్వహిస్తున్న కర్మాగారాల్లో లింగ ఆధారిత హింసనూ, వేధింపులనూ అంతం చేయడానికి దిండుక్కల్ ఒప్పందం తన నిబద్ధతను తెలియజేస్తుంది. 'దళిత మహిళా కార్మికులు సంఘటితమైతే ఏం సాధించగలరనడానికి ఇదే నిదర్శనం' అని దివ్య రాగిణి అన్నారు

ఈ ఒప్పందం ప్రపంచ కార్మిక ప్రమాణాలను స్వీకరిస్తుంది; అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క హింస మరియు వేధింపుల సమావేశపు చట్టాన్ని ఆమోదించింది. ఇది దళిత మహిళా కార్మికుల హక్కులను, సంఘటితమయ్యే వారి స్వేచ్ఛను, సంఘాలను ఏర్పాటు చేసుకునే, సంఘాలలో చేరే హక్కును పరిరక్షిస్తుంది. ఇది ఫిర్యాదులను వినడానికి, వాటిని విచారించి పరిష్కారాలను సూచించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీకి అధికారాన్నిస్తుంది. నిర్దిష్టంగా ఆమోదించిన ప్రమాణాలను నిర్ధారించడానికి స్వతంత్ర మదింపుదారులు అవసరం, ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ ఈ ప్రమాణాలను పాటించని సందర్భంలో ఎచ్&ఎమ్ నుండి వాణిజ్యపరమైన పరిణామాలను ఎదుర్కొంటుంది.

దిండుక్కల్ ఒప్పందం నాచ్చి అప్పేరల్, (దిండుక్కల్‌లో ఉన్న) ఈస్ట్‌మన్ స్పిన్నింగ్ మిల్స్‌లోని మొత్తం 5,000 మంది కార్మికులకు వర్తిస్తుంది. వీరిలో దాదాపు అందరూ మహిళలు కాగా అత్యధికులు దళితులే. “ఈ ఒప్పందం దుస్తుల తయారీ రంగంలో మహిళల పని పరిస్థితులను గణనీయంగా మెరుగుపరుస్తుంది. సంఘటిత దళిత మహిళా కార్మికులు ఏమి సాధించగలరనడానికి ఇది ఒక నిదర్శనం” అని దివ్య చెప్పారు.

"నాకు, లేదా జయశ్రీ వంటి నా అక్కచెల్లెళ్ళకు జరిగిన దాని గురించి నేనింక బాధపడకూడదనుకుంటున్నాను," అని 31 ఏళ్ల మల్లి చెప్పారు. "నేను ముందుకే చూడాలనుకుంటున్నాను. ఈ ఒప్పందాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించి, జయశ్రీకి, ఇతరులకు జరిగినవి వేరెవరికీ జరగకుండా ఉండేలా చూసుకోవాలి."

ఒప్పందం ప్రభావం కనిపిస్తోంది. “ఈ ఒప్పందం జరిగిన తర్వాత పని పరిస్థితులు చాలా మారాయి. బాత్రూమ్‌కి వెళ్ళేందుకు విరామాలు, మధ్యాహ్న భోజన విరామాలు సరిగ్గా ఉంటున్నాయి. ప్రత్యేకించి అనారోగ్యంతో ఉన్నప్పుడు మాకు సెలవులను నిరాకరించడంలేదు. బలవంతపు ఓవర్ టైమ్‌లు ఉండటంలేదు. మహిళా కార్మికులను సూపర్‌వైజర్లు దుర్భాషలాడటంలేదు. పైగా, మహిళా దినోత్సవం, పొంగల్(సంక్రాంతి పండుగ)ల సందర్భంగా కార్మికులకు స్వీట్లు కూడా ఇస్తున్నారు!" అని లత చెప్పారు

రమకు సంతోషంగా ఉంది. "పరిస్థితి ఇప్పుడు మారిపోయింది, సూపర్‌వైజర్లు మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు," అని ఆమె చెప్పింది. కార్మికుల ఉద్యమ కాలమంతా ఆమె పూర్తి సమయం పనిచేసింది- గంటకు 90కి పైగా లోదుస్తులను కుడుతూ కూడా. ఈ పని చేస్తున్నప్పుడు వచ్చే తీవ్రమైన వెన్నునొప్పి విషయంలో మనమేమీ చేయలేమని ఆమె చెప్పింది. "ఈ పరిశ్రమలో పని చేయడంలో ఇదీ ఒక భాగమే."

సాయంత్రం ఇంటికి వెళ్ళడం కోసం కంపెనీ బస్సు కోసం ఎదురుచూస్తూ, "మేం కార్మికుల కోసం ఇంకా చాలా చేయవచ్చు" అని రమ చెప్పింది.

కథనం కోసం ఇంటర్వ్యూ చేసిన దుస్తుల తయారీ కార్మికుల పేర్లు , వారి గోప్యతను కాపాడటం కోసం మార్చబడ్డాయి .

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Gokul G.K.

गोकुळ जी. के. चेन्नईच्या एशियन कॉलेज ऑफ जर्नलिझमचा विद्यार्थी असून तो केरळमधील तिरुवनंतपुरमचा रहिवासी आहे.

यांचे इतर लिखाण Gokul G.K.
Illustrations : Antara Raman

Antara Raman is an illustrator and website designer with an interest in social processes and mythological imagery. A graduate of the Srishti Institute of Art, Design and Technology, Bengaluru, she believes that the world of storytelling and illustration are symbiotic.

यांचे इतर लिखाण Antara Raman
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

यांचे इतर लिखाण Sudhamayi Sattenapalli