కుడిచేతిలో కత్తి, ఎడమచేతిలో గుర్రపు కళ్లాలు పట్టుకొనివున్న ప్రఖ్యాతిచెందిన రాణీ వేలు నాచ్చియార్, చెన్నైలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించబడిన చారిత్రక వ్యక్తులలో అత్యధికంగా ఫోటోలు తీయబడినవారిలో ఒకరు. వి.ఒ. చిదంబరం పిళ్ళై, సుబ్రమణియ భారతి, మరుదు సోదరులవంటి ప్రసిద్ధులైన తమిళ ప్రముఖుల చిత్రపటాల పక్కన ఈమె చిత్రం కూడా ఉంది.
'స్వాతంత్య్ర పోరాటంలో తమిళనాడు'కు ప్రాతినిధ్యం వహిస్తున్న అదే చిత్రాల పట్టికను కేంద్ర ప్రభుత్వ 'నిపుణుల' కమిటీ న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించేందుకు తిరస్కరించింది. ఈ విషయం గురించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రధానికి చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. చివరికది, చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సొంత రిపబ్లిక్ డే పరేడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన శకటంగా సాగింది.
కొన్ని ఇతర విషయాలతోపాటు, ఆ చిత్రాలలో ఉన్న కొందరు వ్యక్తులు "జాతీయ ప్రేక్షకులకు తెలియనివారు" అని కేంద్ర ప్రభుత్వ 'నిపుణుల' కమిటీ చెప్పింది. అక్షయ కృష్ణమూర్తి ఈ అభిప్రాయంతో తీవ్రంగా విభేదించవచ్చు. ఎందుకంటే ఆ చిత్రాలలో ఉన్నవారిలో ఒకరితో తనకు వ్యక్తిగత సంబంధం ఉందని ఆమె నమ్ముతుంది. ఆ వ్యక్తి, వేలు నాచ్చియార్, 1796లో తాను మరణించే వరకు బ్రిటీష్ వారితో పోరాడి, శివగంగైని (ప్రస్తుతం తమిళనాడులోని ఒక జిల్లా) పరిపాలించినవారు.
"11వ తరగతిలో ఉండగా స్కూల్‌లో జరిగిన ఒక నృత్యనాటికలో ప్రధాన పాత్ర అయిన వేలు నాచ్చియార్‌ను పోషించడం నా జీవితంలోని ఒక మలుపు" అని ఆమె అన్నది.
"కానీ అదేదో కేవలం నాట్యం చేయటం, నటించటం మాత్రమే కాదని మీకు తెలుసు," వివరిస్తారు అక్షయ. ఆ పాటలు, వాటి సాహిత్యం ద్వారా 'వీరమంగై' - రాణిని అలా పిలుస్తారు - బలాన్నీ, ధైర్యాన్నీ అక్షయ అర్థం చేసుకున్నది. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన అక్షయ, ఆ ఇంటర్-స్కూల్ పోటీ రోజున తాను అస్వస్థతకు గురయ్యాననీ, ప్రదర్శన ఇవ్వగలనో లేదో తనకే తెలియదనీ గుర్తు చేసుకుంది. అయితే ఆరోజు ఆమె తనకు సాధ్యమైనంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు.
ప్రదర్శన ముగిసి, స్టేజీ నుంచి కిందికి దిగేటప్పుడు ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆమెను హాస్పిటల్‌కు తీసుకువెళ్ళి సెలైన్ ఎక్కించారు. "నా చేతికి ఐ.వి. లైన్ వేలాడుతుండగా, నేను బహుమతిని - మాకు ద్వితీయ బహుమతి వచ్చింది - అందుకున్నాను." ఈ సంఘటన తన శక్తిసామర్థ్యాల పట్ల తనకు నమ్మకం కలిగేలా చేసింది. ఆమె మరింత "సాహసిగా మారి" బైక్‌నీ, కారునీ నడపడం నేర్చుకున్నది.












