క్రోమోజోమ్‌లు మానవులలో లింగాన్ని ఎలా నిర్ణయిస్తాయో జీవశాస్త్ర ఉపాధ్యాయులు వివరిస్తుండటంతో తరగతిగదిలోని విద్యార్థులు నిశ్శబ్దంగానూ శ్రద్ధగానూ వింటున్నారు. “ఆడవారికి రెండు X క్రోమోజోమ్‌లు ఉంటే, మగవారికి ఒక X, ఒక Y క్రోమోజోమ్ ఉంటుంది. XX క్రోమోజోమ్‌లు Yతో జత కలిస్తే, అక్కడ కూర్చున్న వ్యక్తిలాంటివారు పుడతారు,” అని ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి వైపు చూపిస్తూ చెప్పారు. ఆ విద్యార్థి ఇబ్బందిపడుతూ లేచి నిలబడడంతో తరగతి గదిలో నవ్వులు విరిశాయి.
ట్రాన్స్ సముదాయంపై నాటకం సండకారంగా (పోరాడాలనే నిశ్చయం)లో ఇది ప్రారంభ సన్నివేశం. తనకు నిర్దేశించిన లింగానికి సరిపోయే విధంగా ప్రవర్తించని కారణంగా తరగతి గదిలో ఒక పిల్లవాడు ఎదుర్కొనే అవమానం, అపహాస్యాల గురించి నాటకం మొదటి భాగం మాట్లాడుతుండగా, రెండవ సగం హింసకు గురైన ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషుల జీవితాలకు రూపుకడుతోంది.
ది ట్రాన్స్ రైట్స్ నౌ కలెక్టివ్ (టీఅర్ఎన్‌సి) భారతదేశంలోని ట్రాన్స్ సముదాయంలోని దళిత, బహుజన, ఆదివాసీ స్వరాలపై దృష్టి సారిస్తోంది. వారు నవంబర్ 23, 2022న తమిళనాడులోని చెన్నైలో సండకారంగా మొదటి ప్రదర్శనను ఇచ్చారు. గంటసేపు సాగే ఈ నాటకానికి తొమ్మిది మంది ట్రాన్స్ వ్యక్తుల బృందం దర్శకత్వం వహించి, నిర్మించి, ప్రదర్శించింది.
“నవంబర్ 20ని మరణించిన ట్రాన్స్ వ్యక్తుల జ్ఞాపకార్థం అంతర్జాతీయ ట్రాన్స్ డే ఆఫ్ రిమెంబరెన్స్‌గా పాటిస్తారు. వారి కుటుంబాలు వారిని నిర్లక్ష్యం చేయటం, సమాజం వారిని బహిష్కరించటం, అనేకమంది హత్యలకు గురవటమో లేదా ఆత్మహత్యలతో చనిపోవడమో వంటివాటివలన వారి జీవితాలేమంత సరళంగా సాగినవి కావు." అని టిఆర్ఎన్‌సి వ్యవస్థాపకురాలు గ్రేస్ బాను చెప్పారు.




























