"అది వంటగదిలో మొదలైంది," ఉత్తరాఖండ్, చమోలీ జిల్లాలోని జోషిమఠ్ పట్టణంలో నివసించే అజిత్ రాఘవ్, 2023 జనవరి 3 ఉదయం జరిగిన వినాశకర సంఘటనలను గుర్తుచేసుకుంటూ అన్నారు.
37 ఏళ్ళ ఈ జీప్ టాక్సీ డ్రైవర్ మాట్లాడుతూ, మొదట వంటగదిలో పెద్ద పగుళ్లు కనిపించాయనీ, అవి వేగంగా ఇంట్లోని ఇతర భాగాలకు కూడా వ్యాపించాయనీ చెప్పారు. నిరాడంబరంగా ఉండే ఆ రెండంతస్తుల ఇంటిలో, అతి తక్కువ పగుళ్లు ఉన్న గది త్వరత్వరగా తాత్కాలిక వంటగదిగా మారింది. ఎనిమిది మంది సభ్యులున్న ఆ కుటుంబం అకస్మాత్తుగా నిరాశ్రయంగా మారింది
"నేను నా ఇద్దరు పెద్ద కుమార్తెలు, ఐశ్వర్య (12), సృష్టి (9)లను మా అక్క దగ్గరకు పంపించాను," అని రాఘవ్ చెప్పారు. మిగిలిన కుటుంబం - రాఘవ్, అతని భార్య గౌరీ దేవి, ఆరేళ్ల కూతురు అయేషా, ఇంకా వృద్ధులైన అతని ఇద్దరు పెద్దమ్మలు - ఇక్కడ భోజనం చేస్తారు. కానీ సాయంత్రానికల్లా వీరంతా నిద్రపోవడానికి ఈ హిమాలయ పట్టణంలో తాత్కాలిక ఆశ్రయంగా ఏర్పాటుచేసిన సమీపంలోని సంస్కృత మహావిద్యాలయ పాఠశాలకు బయలుదేరతారు. దాదాపు 25-30 నిర్వాసిత కుటుంబాలను ఇక్కడికి తరలించారు.
జనవరి 21, 2023న చమోలీ జిల్లా అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, జోషిమఠ్‌లోని తొమ్మిది వార్డులలోని 181 నిర్మాణాలను అసురక్షితమైనవిగా గుర్తించారు; 863 భవనాలకు స్పష్టంగా పగుళ్లు కనిపిస్తున్నాయి. రాఘవ్ తన పొరుగున ఉన్న ఇళ్ళకు ఏర్పడిన పగుళ్ళను PARIకి చూపించారు. ఈ పరిస్థితికి దారితీసిన హద్దులేని అభివృద్ధిని గురించి ప్రస్తావిస్తూ, "ఇక్కడ ఉన్న ప్రతి ఇంటి కథ జోషిమఠ్ కథే," అన్నారు రాఘవ్
జోషిమఠ్‌లోని భవనాల గోడలకూ, పైకప్పులకూ, నేల మీదా 2023, జనవరి 3 నుంచే పగుళ్లు ప్రారంభమయ్యాయని రాఘవ్ చెప్పారు. కొద్ది రోజుల్లోనే అది తీవ్ర సంక్షోభంగా మారింది. దాదాపు అదే సమయంలో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్‌సి) జోషిమఠ్‌లో ఎంత మేరకు భూమి కుంగిపోయివుందో చూపించే చిత్రాలను విడుదల చేసింది: 2022 డిసెంబర్ నెల ముగిసే నాటి నుండి 2023 జనవరి నెల ప్రారంభం వరకు-5.4 సెం.మీ. ఈ ఫోటోలు ఇప్పుడు ఎన్ఆర్ఎస్‌సి వెబ్‌సైట్‌లో కనిపించటంలేదు.
రాఘవ్ నివసించే సింగ్‌దర్ వార్డులో, 151 నిర్మాణాలపై స్పష్టంగా పగుళ్ళు కనిపిస్తున్నట్టు గుర్తించారు; 98 నిర్మాణాలు అసురక్షిత ప్రాంతంలో ఉన్నాయి. అవి నివాసానికి అనువుగా లేవనీ, ఆ చుట్టుపక్కల ఉండటం సురక్షితం కాదనీ సూచించడానికి జిల్లా అధికారులు వాటన్నిటికీ ఎర్ర శిలువతో గుర్తు పెట్టారు.
తన జీవితమంతా ఇక్కడే నివసించిన రాఘవ్, తన ఇంటిపై ఎర్ర శిలువ గుర్తు వేయకుండా ఆపడానికి తాను చేయగలిగినదంతా చేస్తున్నారు. "నా ఇంటి పైకప్పు మీద ఎండలో కూర్చుని పర్వతాలను చూడటానికి నేను మళ్ళీ ఇక్కడకు రావాలనుకుంటున్నాను" అని అతను చెప్పారు. అతను తన చిన్నతనంలో తల్లిదండ్రులతో, అన్నయ్యతో కలిసి ఇక్కడ నివసించారు. ఇప్పుడు వారంతా మరణించారు
“ఎర్ర శిలువ గుర్తు అంటే అధికారులు (చమోలీ జిల్లా అధికారులు) ఆ స్థలాన్ని మూసివేస్తారు. ప్రజలు తమ ఇళ్లకు తిరిగి రాలేరని కూడా దీని అర్థం,” అని ఆయన పేర్కొన్నారు.
రాత్రయింది, కుటుంబం తమ రాత్రి భోజనాన్ని ముగించారు. రాఘవ్ పెద్దమ్మ తమ తాత్కాలిక నివాసమైన పాఠశాలలో నిద్రపోవడానికి వెళ్ళేందుకు సిద్ధమై ఎదురుచూస్తూ ఉన్నారు.
అతని ఇల్లు అస్తవ్యస్తంగా ఉంది: తెరిచిన సూట్‌కేస్‌లో గుట్టగా పోగుపడిన బట్టలు; ఖాళీ చేసిన ఇనుప బీరువాలు; గోడ నుండి కనెక్షన్ తీసేసిన ఫ్రిజ్, కుటుంబ సభ్యులకు చెందిన వస్తువులు కుక్కివున్న చిన్న సంచులు; స్టీలు, ప్లాస్టిక్ పాత్రలు, పెట్టెలు- చుట్టూ చెల్లాచెదురుగా పడివున్నాయి, బండికి ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాయి.
"నా దగ్గర కేవలం రెండువేల రూపాయల నోటు ఒక్కటే ఉంది. దీనితో నా వస్తువులన్నింటికీ పట్టుకెళ్ళేందుకు ఒక ట్రక్కును ఏర్పాటు చేసుకోలేను," చుట్టూ కలయచూస్తూ అన్నారు రాఘవ్.
జిల్లా అధికారులు 'రెండు రోజుల్లో ఇళ్ళను ఖాళీ చేయాలని మైక్‌లో (మైక్రోఫోన్) ప్రకటిస్తున్నారు,' అని అతని భార్య గౌరి అతనికి గుర్తు చేశారు.
“నేను జోషిమఠ్‌ను విడిచిపెట్టేదిలేదు. నేను పారిపోను. ఇది నా నిరసన, నా పోరాటం,” అంటూ రాఘవ్ స్పందించారు.
ఇదంతా జనవరి రెండోవారంలో జరిగింది.
*****
ఒక వారం తర్వాత జనవరి 20, 2023న రాఘవ్ ఇద్దరు రోజువారీ కూలీలను తీసుకురావడానికి వెళ్లారు. ముందు రోజు రాత్రి, జోషిమఠ్‌లో భారీగా కురిసిన మంచు వలన పరిస్థితులు క్షీణించాయి. నిలకడలేని ఆశ్రయాలలో ఉన్నవారికి మరోసారి తాజాగా ఆందోళన మొదలయింది. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా రాఘవ్, అతనితో ఉన్న కూలీలు మంచాలు, ఫ్రిజ్ వంటి బరువైన గృహోపకరణాలను ఇరుకైన దారుల గుండా తరలించి వాటిని ట్రక్కులోకి ఎక్కిస్తున్నారు.
“మంచు కురవడం ఆగిపోయింది కానీ దారులన్నీ తడితడిగా, జారుడుగా మారాయి. మేం జారి కింద పడిపోతున్నాం," అని రాఘవ్ ఫోన్‌లో చెప్పారు. "మా వస్తువులను తరలించడం కష్టంగా ఉంది." అతను తన కుటుంబాన్ని 60 కిలోమీటర్ల దూరంలోని నందప్రయాగ్ పట్టణానికి తరలిస్తున్నారు. అక్కడతను తన సోదరి నివసించే ప్రదేశానికి దగ్గరగా ఒక ఇంటిని అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారు.
జోషిమఠ్ పట్టణంలోని అన్ని నివాసాలను ఒక మందపాటి మంచుపొర కప్పి ఉన్నప్పటికీ, బయట గోడలపై మందంగా చిత్రించివున్న ఎర్రటి శిలువలతో పాటు పగుళ్ళు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ అనేక ఇళ్ళ, దుకాణాల, సంస్థల పునాదులలో లోతైన పగుళ్లు కనిపించిన చోట అందులో నివాసం ఉండేవారిని ఖాళీ చేయించారు.
ఎర్ర శిలువ గుర్తు వేసివున్న సునీల్ వార్డ్‌లోని తన రెండంతస్తుల ఇంటి మంచుతో నిండిన ఆవరణలో నిల్చున్నారు రంజిత్ సింగ్ చౌహాన్(43). సింగ్‌తో పాటు అతని భార్య, ముగ్గురు పిల్లలకు సమీపంలోని హోటల్‌లో తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. వారి వస్తువులలో చాలా వరకు వారి ఇంట్లోనే ఉండిపోయాయి. మంచుగా ఉన్నప్పటికీ, దొంగతనం జరగకుండా నిఘా ఉంచడానికి సింగ్ ప్రతిరోజూ తన ఇంటికి వెళ్తుంటారు.
"నేను నా కుటుంబాన్ని డెహ్రాడూన్ లేదా శ్రీనగర్‌లలో ఎక్కడికైనా సురక్షితంగా తరలించే ప్రయత్నం చేస్తాను," అని అతను చెప్పారు. చౌహాన్ బద్రీనాథ్‌లో ఒక హోటల్‌ని నడుపుతున్నారు. ఇది వేసవి నెలల్లో వ్యాపారం కోసం తెరిచి ఉంటుంది. ఇప్పుడు తన భవిష్యత్తు ఏమిటో అతనికి ఖచ్చితంగా తెలియటంలేదు. కానీ ఆయన ఒక్క విషయంలో ఖచ్చితంగా ఉన్నారు - అది సురక్షితంగా ఉండవలసిన అవసరం. ఈ లోపు జనవరి 11, 2023న ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన 1.5 లక్షల మధ్యంతర ఉపశమనం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.
మునిగిపోతున్న ఈ హిమాలయ పట్టణంలో ప్రతిచోటా డబ్బు కొరత ఉంది. రాఘవ్ తన ఇంటిని నష్టపోవడాన్ని మాత్రమే కాకుండా అందులో పెట్టుబడి పెట్టిన డబ్బును గురించి కూడా దుఃఖపడుతున్నారు. “కొత్త ఇల్లు కట్టడానికి నేను 5 లక్షల రూపాయలు వెచ్చించాను. మరో 3 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాను. వాటినింకా తిరిగి చెల్లించనే లేదు," అని ఆయన వాపోయారు. ఇతర ప్రణాళికలు కూడా ఉన్నాయి - ఒక గ్యారేజీని తెరవడం, ఎడమ కన్ను సరిగా పనిచేయనందున చేస్తున్న డ్రైవర్ ఉద్యోగాన్ని వదిలివేయడం. "అవేవీ ఫలించలేదు."
*****
అనేక అభివృద్ధి పనుల కారణంగా, ప్రత్యేకించి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) ద్వారా తపోవన్ విష్ణుగఢ్ జలవిద్యుత్ ప్లాంట్‌కు ఇటీవల తవ్విన సొరంగాల కారణంగా ఈ నష్టం విస్తృతమయినట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో దాదాపు 42 జలవిద్యుత్ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి, మరెన్నో సిద్ధమవుతున్నాయి. జలవిద్యుత్‌తో ముడిపడి ఉన్న జోషిమఠ్ విపత్తు మొదటిదేమీ కాదు.
పట్టణంలోని ఇతరుల మాదిరిగానే రాఘవ్ కూడా స్థానిక తహసీల్ కార్యాలయంలో ఎన్‌టిపిసికి వ్యతిరేకంగా జరిగే ధర్నాలో రోజూ పాల్గొంటారు. "మా ఇళ్లు పాడైపోయాయి, కానీ మా పట్టణం నిర్జనంగా మారకూడదు," అని నిరసనల్లో పాల్గొన్న మొదటివారిలో ఒకరైన అనితా లాంబా అన్నారు. 30ల వయస్సులో ఉన్న ఈ అంగన్‌వాడీ టీచర్ ఇంటింటికి వెళ్ళి, "ఎన్‌టిపిసిని, వారి వినాశకరమైన ప్రాజెక్టులను తొలగించడానికి పోరాడండి" అని ప్రజలను కోరుతున్నారు.
వాటర్ అండ్ ఎనర్జీ ఇంటర్నేషనల్‌లో ప్రచురించిన ‘ భారతీయ హిమాలయాలలోని ఉత్తరాఖండ్ ప్రాంతంలో జలవిద్యుత్ అభివృద్ధి ’పై 2017లో వచ్చిన కథనంలో, రచయితలు సంచిత్ శరణ్ అగర్వాల్, ఎమ్. ఎల్. కన్సల్‌లు ఉత్తరాఖండ్‌లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల నుండి వచ్చిన అనేక పర్యావరణ సమస్యలను జాబితా చేశారు. అంతేకాకుండా, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఒ) నిర్మించిన చార్‌థామ్ ప్రాజెక్ట్, హెలాంగ్ బైపాస్ నిర్మాణం పరిస్థితిని మరింత దిగజార్చాయి.
జోషిమఠ్‌లో మరో బైఠాయింపు నిరసనను ప్రారంభించిన పర్యావరణ కార్యకర్త అతుల్ సతి. బద్రీనాథ్ తీర్థయాత్రను ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే తపనతో హోటళ్ల, వాణిజ్య భవనాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, అందువలన భూమిపై ఒత్తిడి పెరుగుతోందని ఆయన చెప్పారు. బద్రీనాథ్ ఆలయానికి వెళ్లే యాత్రికులకు ఈ పట్టణం స్థావరంగా ఉంది. బద్రీనాథ్ మతపరంగా ఒక ప్రధాన ప్రదేశం. 2021లో జరిగిన పర్వతారోహణ క్రీడలకు ఈ రెండు పట్టణాలలో కలిపి 3.5 లక్షల మంది పర్యాటకులు వచ్చారు. జోషిమఠ్ జనాభా కంటే ఇది పది రెట్లు ఎక్కువ (2011 జనగణన).
*****
రాఘవ్ కుర్చీలో మూడు వెలుగుతోన్న అగరుబత్తీలున్న అగరబత్తి స్టాండును ఉంచారు. వాటి పరిమళం ఆ చిన్న గదిని నింపేస్తోంది.
వారి వస్తువులన్నీ మూటలుకట్టే దశలో ఉన్నాయి. కానీ దేవుళ్ళ ఫోటోలను, బొమ్మలను ఇంకా తాకలేదు. విషాదం, వేదనలు ముసురుతున్నప్పటికీ, అతని కుటుంబం చున్యత్యార్‌ను - పంటల పండుగ - జరుపుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ పండుగ శీతాకాలం గడచిపోవడాన్ని సూచిస్తుంది. చునీ రోటీ అనేది ఒక రకమైన చదునుగా ఉండే రొట్టె. దీనిని ఈ పండుగ సమయంలోనే తయారుచేసి తింటారు.
సాయంత్రం వేళ మసకబారుతున్న వెలుగులో ఆయేషా తన తండ్రి నినాదాన్ని తానూ తిరిగి చెప్తోంది:
"చునీ రోటీ ఖాయేంగే, జోషిమఠ్ బచాయేంగే
[మేం చునీ రోటీని తింటాం; జోషిమఠ్‌ను కాపాడతాం]."
మనీశ్ ఉన్నియాల్ దిల్లీ నుండి పనిచేసే ఒక ఫోటోగ్రాఫర్ , వీడియోగ్రాఫర్ కూడా
అనువాదం: సుధామయి సత్తెనపల్లి