జీవన్‌భాయ్ బరియాకు నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు గుండెపోటు వచ్చింది. 2018లో మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆయన భార్య గాభీబెన్ వెంటనే ఆయనను ఉరుకులపరుగుల మీద ఆసుపత్రికి తీసుకెళ్ళారు. 2022 ఏప్రిల్‌లో ఆయన అరేబియా సముద్రంలో చేపల ట్రాలర్‌ను నడుపుతుండగా, అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. ఆయన వెంట ఉన్న తోటి పనివాళ్లలో ఒకరు స్టీరింగ్ చక్రాన్ని తీసుకోగా, మరొకరు భయపడుతూనే ఆయన కింద పడుకోవడానికి సహాయం చేశారు. వారు ఒడ్డుకు చేరాలంటే ఐదు గంటల సమయం పడుతుంది. చనిపోయే ముందు జీవన్‌భాయ్ రెండు గంటలకు పైగా మృత్యువుతో పోరాడారు.
గాభీబెన్ భయపడినంతా జరిగింది.
మొదటిసారి గుండెపోటు వచ్చిన సంవత్సరం తర్వాత జీవన్‌భాయ్ తిరిగి చేపల వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె దాని గురించి పెద్దగా ఆసక్తి చూపలేదు. అది ప్రమాదకరమని ఆమెకు తెలుసు. అలాగే జీవన్‌భాయ్‌కు కూడా ఆ విషయం తెలుసు. గుజరాత్‌లోని అమరేలీ జిల్లాలోని చిన్న తీరప్రాంత పట్టణమైన జాఫరాబాద్‌లో గుడ్డి వెలుతురు ఉన్న తన గుడిసెలో కూర్చొని, "నేను ఆయనను వెళ్లొద్దని చెప్పాను," అని గాభీబెన్ చెప్పారు.
కానీ పట్టణంలోని చాలామంది ప్రజల్లాగే 60 ఏళ్ల జీవన్‌భాయ్‌కు చేపలు పట్టడం తప్ప మరో పని తెలీదు. దాని వల్ల ఆయన యేడాదికి దాదాపు రూ. 2 లక్షలు సంపాదిస్తారు. “ఆయన 40 ఏళ్లుగా అదే వృత్తిలో ఉన్నారు,” అని 55 ఏళ్ల గాభీబెన్ చెప్పారు. “గుండెపోటు వచ్చిన తర్వాత ఆయన ఒక సంవత్సరం పాటు విశ్రాంతి తీసుకున్నప్పుడు, నేను మా ఇల్లు గడవడానికి కూలీగా (ఇతర మత్స్యకారుల చేపలను ఎండబెట్టడం) పనిచేశాను. తాను కోలుకున్నానని భావించాక, ఆయన తిరిగి పనికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.”
జీవన్‌భాయ్ జాఫరాబాద్‌లోని పెద్ద మత్స్యకారులలో ఒకరికి చెందిన ట్రాలర్ మీద పనిచేశారు. వర్షాకాలం మినహా, సంవత్సరంలో ఎనిమిది నెలలు పనివాళ్లు ఈ ట్రాలర్‌లను 10-15 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి తీసుకువెళతారు. వాళ్లు తమతో పాటు రెండు వారాలకు సరిపడా నీళ్లు, ఆహారాన్ని తీసుకుపోతారు.
‘‘అత్యవసర సేవలు అందని చోట, సముద్రం మధ్య అన్ని రోజులు ఉండడం ఎంత మాత్రం సురక్షితం కాదు,’’ అన్నారు గాభీబెన్. ‘‘వాళ్ల దగ్గర ఉండేది కేవలం ప్రాథమిక చికిత్స కోసం ఉండే కిట్ మాత్రమే. ఇక గుండె సంబంధిత రోగులకైతే, అది మరింత ప్రమాదం.’’














