ఆమెకి 19 ఏళ్ళు, కానీ శివాని కుమారికి సమయం మించిపోతుందనిపిస్తుంది.
ఇప్పటికే ఆమె తనకు పెళ్లి చేయాలని ప్రయత్నించే తన కుటుంబాన్ని నాలుగేళ్లు నిలవరించగలిగింది. ఇక పైన అది సాగదనిపిస్తుంది. “నేను ఎంత కాలం ఆపగలనో నాకు తెలీదు, ఏదో ఒక రోజు నేను ఒప్పుకోవాలిసిందే,” అన్నది.
బీహార్, సమస్తిపూర్ జిల్లాలోని గంగసారాలో అమ్మాయిలకు పదో తరగతి పూర్తి కాకుండానే, లేదా వారికి 17- 18 ఏళ్ల వయసు రాకమునుపే పెళ్లి చేసేస్తారు.
శివాని(పేరు మార్చబడింది) బీకామ్ వరకు ఎలాగోలా చదువుని లాగగలిగింది. కాలేజీకి వెళ్లాలని ఎంతో కోరిక ఉన్నప్పటికీ ఇది ఇంత ఒంటరి ప్రయాణమని తనకి తెలీదు. “ఈ ఊరిలో ఉన్న నా స్నేహితురాళ్లందరికి పెళ్లయిపోయింది. నాతో పాటు చదువుకున్న ఆడపిల్లలందరూ వేరే ఊర్లకు వెళ్లిపోయారు.’ అన్నది ఆమె, తన పక్కింట్లో నన్ను కలిసినప్పుడు. వాళ్ళింట్లో కలవడానికి అసలు అవకాశం లేదు.
ఆమె వర్గంలో అమ్మాయిలకు, కాలేజ్ వరకు వెళ్లే అవకాశం అరుదుగా ఉంటుంది. శివాని ఒక మహాదళిత్ వర్గంలో భాగమైన రవిదాస్ కులానికి (చమార్ కులంలో ఉపకులం) చెందినది. మహాదళిత్ - బీహార్ ప్రభుత్వం 2007లో 21 తీవ్రంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల వర్గాలకు ఇచ్చిన సామూహిక పదం.
ఆమె ఒంటరితనానికి తోడు ఆమెకి ఇంకా పెళ్లి కాలేదనే మాట ఆమె కుటుంబసభ్యులు, చుట్టుపక్కలవారు, బంధువుల నుండి చాలా ఒత్తిడిని తెస్తోంది. “నేను సరిపోయేంత చదువుకున్నానని మా నాన్న అంటారు. కానీ నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది. నాకు అన్ని ఆశలు ఉండకూడదని ఆయన అభిప్రాయం. నేను చదువుకుంటూ పొతే నన్నెవరు పెళ్ళి చేసుకుంటారు, అని అడుగుతాడు.” అని ఆమె చెప్పింది. “మా వాళ్లలో అబ్బాయిలకి కూడా త్వరగా పెళ్లి అయిపోతుంది. కొన్నిసార్లు నేను చదువుని ఆపేయాలేమో అని ఆలోచిస్తాను. కాని ఇంత దూరం వచ్చాక నా కలను సాధించుకోవాలనే ఉంది.”







