ఈ ఏడాది మే నెలలో ఒక తీవ్రమైన వేసవి మధ్యాహ్నం గొట్టం హనిమి రెడ్డి గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామం నుంచి 105 కిలోమీటర్లు ట్రక్కులో ప్రయాణించి గుంటూరుకి వచ్చారు. తన ఐదెకరాల పొలంలో తను పండించిన ఎనిమిది క్వింటాళ్ల మిరపకాయలు అమ్ముకునేందుకు ఆయన ఈ ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇది ఆ సీజన్ కి చివరి పంట. అంతకు ముందు ఏప్రిల్ లో మూడు సార్లు మార్కెట్ కి వచ్చి రెడ్డి, మిరపకాయలను క్వింటాల్ కు ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల మధ్య అమ్ముకున్నారు. మిరపకాయ రకం - మిర్చి LCA334 లేదా గుంటూరు సన్నం రకం బట్టి - ధర లభించింది.
ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు పట్టణంలో NTR వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుకు వచ్చిన హనిమి రెడ్డి, ధరలు పెరిగితే తన మిరప పంట అమ్మాలని మూడు రోజుల నుంచి నిరీక్షిస్తున్నారు. 2017-18 వ్యవసాయ సీజన్ కి మిర్చి అమ్మకాలు ముగుస్తున్న రోజు, మార్కెట్లో రైతుల మెస్ బయట కూర్చున్నారు హనిమి రెడ్డి. “ఈరోజు ధరలు ఇంకా పడిపోయాయి. కమీషన్ ఏజెంట్లు క్వింటాల్ కి 4200 రూపాయలే ఇస్తున్నారు. వాళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడతారు. ఇంక వాళ్ళ ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తారు," అన్నారు రెడ్డి.
దిక్కుతోచని పరిస్థితి వచ్చేసరికి రెడ్డి ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. వచ్చిన ధరకి తక్కువ ధరకి అమ్ముకోవడమా, లేదా ఇంటికి వెనక్కి తీసుకునివెళ్ళి శీతల గిడ్డంగిలో పెట్టుకోవడమా? . “ఏసీ ఖర్చు భరించడం నా వల్ల కాదు. పైగా ఒక క్వింటాల్ - అంటే 50 కిలోల సంచులు రెండు రవాణా చేయాలంటే ఒక వైపు వెయ్యి రూపాయలు చార్జీలు," తక్కువ ధరకి ఎందుకు అమ్ముకోవాల్సి వస్తోందో వివరిస్తున్నారు. ఒక్క క్షణం ఆగి, మెల్లిగా "బ్రోకర్లూ, కోల్డ్ స్టోరేజ్ వాళ్ళూ కుమ్మక్కయ్యారని అందరికీ తెలుసు. ఈ పరిస్థితిలో ఇద్దరికీ లాభమే," అని చెప్పారు.








