“వాళ్ళు బిడ్డ కడుపులోనే చనిపోయిందని చెప్పారు. మేము చచ్చేంత భయపడ్డాము. ఆ తరవాత మమ్మల్ని మరెక్కడికైనా వెళ్లమన్నారు. అందుకే నేను నా కోడలిని పట్టణంలో ఉన్న ప్రైవేట్ డాక్టర్ దగ్గరకి తీసుకెళదామనుకున్నాను.” అన్నది సుఖియా దేవి, ఆమె కోడలు కుసుమ్ తో వైశాలి జిల్లా హెడ్ క్వార్టర్ల లో PHC కివెళ్ళినప్పుడు అక్కడి సిబ్బంది ప్రవర్తన ఎలా ఉందొ గుర్తుచేసుకుంటూ.
అరవై రెండేళ్ల ఈ వ్యవసాయ కూలి ఇప్పుడు ఉదయం 10 గంటలకు PHC వద్ద, ఒకరోజు వయసున్న తన మనవరాలిని ఎత్తుకుని, ఆ పిల్లకి టీకా వేయించడానికి ఎదురుచూస్తూ నుంచుంది.
తన 28 ఏళ్ళ కోడలికి పురిటి నొప్పులు మొదలవగానే , సుఖియా ఆమెని వైశాలి PHC కి తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న అటెండెంట్, కడుపులో బిడ్డ చనిపోయింది అని చెప్పింది. నిర్ఘాంతపోయిన సుఖియా తన కోడలు కుసుమ్ ను తీసుకుని ఆటోలో 15 కిలోమీటర్ల దూరం లో ఉన్న తమ ఊరుకు(పేరు చెప్పొద్దని అభ్యర్ధించారు) వెళ్ళింది. “మేము మా ఇంటికి వెళ్ళిపోయాము.” అన్నది సుఖియా. “ఒక బొలెరో కి కిరాయికి మాట్లాడుకుని మహిళా డాక్టర్(గైనకాలజిస్ట్) వద్దకు వెళదాం అనుకున్నాను. ఆ కంగారులో బొలెరో ఖర్చు ఎంత అవుతుందో తెలుసుకోవాలని కూడా నాకు తోచలేదు. కాన్పు గురించి మాత్రమే కంగారు పడ్డాను. మా చుట్టుపక్కల వారి సహాయం తో నా కోడలిని బండి ఎక్కించి క్లినిక్ కి బయలుదేరాను.“
డాక్టర్ దగ్గరికి బయలుదేరాక గాని కడుపులో ‘బిడ్డ చనిపోయింద’న్న ఆలోచన గుర్తుకు రాలేదు వాళ్ళకి.
పాప బండిలోనే పుట్టింది అని చెప్పింది సుఖియా. చాలా తేలిగ్గా ప్రసవం అయిందని చెప్పింది. వాళ్ళ దగ్గర ఉన్న చీరని దుప్పటిలా వాడారు. వారితోనే ఉన్న ఆ ఊరి మెడికల్ షాప్ ఓనర్ నీళ్లు తెచ్చిపెట్టారు. “కానీ అదంతా చాలా టైం పట్టింది.”అన్నది సుఖియా.
పైగా డబ్బులు కూడా బాగా ఖర్చయ్యాయి. ప్రయాణించింది ఎక్కువ దూరం కాకపోయినా ఆ కార్ ఓనర్ మూడువేలు తీసుకున్నాడు. ఆ బండి శుభ్రం చేయించడానికి ఇంకో వేయి రూపాయిలు అదనంగా తీసుకున్నారు.






