కరోనా వైరస్ గురించి ఇచ్చిన మొదటి ఉపన్యాసం ద్వారా మన ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేశారంటే, జనాలచేత ప్లేటులు, గరిటెలు తెగ మోగించేలా చేసి దెయ్యాలని, భూతాల్ని తరిమికొట్టారు. ఇక రెండో ఉపన్యాసం ద్వారా ఏకంగా మననే బెదరగొట్టారు.
సామాన్య ప్రజలకి, ముఖ్యంగా పేదవాళ్ళకి రాబోయే వారాల్లో ఆహారం, నిత్యావసరాలు ఎలా దొరుకుతాయనే విషయం మీద ఒక్కమాట కూడా చెప్పని ఆ ఉపన్యాసం భయాందోళనలకి తెర తీసింది. మధ్యతరగతి వాళ్ళు సూపర్ మార్కెట్లు, షాపుల మీద గుంపులుగా ఎగబడ్డారు. పేదవాళ్ళకి, నగరాన్ని వదిలి వెళ్తున్న వలసకూలీలకి ఇది వీలయ్యే పని కాదు. చిన్న దుకాణాదారులకి, ఇళ్ళల్లో పని చేసేవాళ్ళకి, వ్యవసాయకూలీలకి కూడా ఈ అవకాశం లేదు. రబీ పంట కోతలు పూర్తవకో, కోసిన పంటని అమ్ముకోలేకనో ఇబ్బంది పడే రైతులకీ ఇది వీలు కాదు. అట్టడుగున ఉన్న, వెనకబడ్డ వర్గాలకి చెందిన కోట్లమంది భారతీయులకి ఇలా నిత్యావసరాలకోశం కొట్ల మీద ఎగబడే సౌకర్యం లేదు.
నిన్న, అంటే మార్చి 26 న, ఆర్థికమంత్రి ప్రకటించిన సహాయనిధిలో కాస్త ఊరటనిచ్చే ఒకే ఒక్క విషయం ఏంటంటే- ఇప్పటికే ప్రజాపంపిణీ వ్యవస్థ కింద ఇచ్చిన 5 కిలోల ఉచిత బియ్యం లేక గోధుమలతో పాటు, ఒక మూడు నెలల పాటు మనిషికి ఐదుకిలోల చొప్పున ఉచిత ధాన్యాలు ఇస్తామని చెప్పడం. ఇప్పటికే ఇస్తున్న ఐదుకిలోలు ఇప్పుడు కూడా ఉచితమేనా లేక వాటికి డబ్బులు కట్టాలా అనే విషయం మీద ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ దానికి డబ్బులు కట్టాల్సివస్తే ఈ పథకం వల్ల ఉపయోగం లేనట్టే. ఈ పాకేజ్ లో ఇచ్చిన నిధులు చాలావరకు ఇదివరకే అమలులో ఉన్న పథకాలకి సంబంధించినవే. MGNREGA కింద పెంచాల్సిన 20 రూపాయల కూలీ ఎలాగూ ఇప్పటికే బకాయి ఉంది. అయితే అదనపు రోజుల కూలి గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. ఒకవేళ నిజంగానే వాళ్ళు పనికి వెళ్ళడం మొదలుపెడితే సామాజికదూరం పాటిస్తూ చేయగలిగే పనులు ఏముంటాయి? అందరికీ సరిపోయేంత పని కల్పించాలంటే ఎన్నిరోజులు పడుతుంది? వాళ్ళ ఆరోగ్యం పనికి సహకరిస్తుందా? ఈ గండం గడిచి గట్టెక్కేవరకూ ప్రతి కూలీకి, ప్రతి రైతుకి, పని ఉన్నా లేకున్నా MGNREGA ప్రకారం వేతనం ఇవ్వక తప్పదు.
PM-KISAN కింద ప్రకటించిన 2,000 రూపాయల సహాయం ఇప్పటికే అమలులో ఉంది. ఇక ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేముంది? ఆ డబ్బుని త్రైమాసికంలోని చివరి నెలలో ఇచ్చేబదులు ఇప్పుడు మొదటి నెలలో ఇస్తామనడం ఒక్కటే తేడా. ఈ ప్రపంచవ్యాధికి స్పందిస్తూ, లాక్డౌన్ లో సహాయం కోసం ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన 1.7 లక్షల కోట్ల పాకేజ్ లో దేనికెంత పంచారు అనేది ఎక్కడా చెప్పలేదు. ఈ పాకేజ్ లో కొత్తగా చేర్చిన అంశాలేవి అనేది కూడా మనకి తెలియదు. ఎంతవరకూ ఇప్పటికే ఉన్న పాత పథకాలను కొత్త పేర్లతో కలిపి ఈ అంకెలు చూపిస్తున్నారు? వీటిని అత్యాసవర చర్యలు అని ఎలా పిలవగలం? పైగా పెన్షనర్లకి, విధవలకి, వికలాంగులకీ రాబోయే మూడు నెలలకీ కలిపి 1,000 రూపాయాలిస్తారట, అదీ రెండు వాయిదాల్లో! ఇదే మూడు నెలలకీ 20 కోట్ల మంది ఆడవాళ్ళకి జన ధన యోజన కింద 500 రూపాయిలు వస్తాయి. ఇదంతా నామమాత్రపు, కంటి తుడుపు ఉద్ధరణ కార్యక్రమంలాగా అసహ్యంగా ఉంది.
స్వయం సహాయక సంఘాలకి ఎక్కువ అప్పులివ్వడం వల్ల పరిస్తితి ఏమీ మెరుగవ్వదు. ఇప్పటికే ఉన్న అప్పు వాళ్ళకి పీడకలలాగా తయారయింది. దూర ప్రదేశాలలో ఇరుక్కుపోయి సొంతఊళ్ళకి తిరిగి వెళ్లాలనుకునే అసంఖ్యాకమైన వలస కూలీలకి ఈ పాకేజ్ వల్ల ఇసుమంతైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందనడానికి ఏదైనా ఆధారం ఉందా? ఈ సమయంలో సరైన అత్యవసర చర్యలు తీసుకోకపోవడం ఎంత ఆందోళన కలిగిస్తుందో, అధికారుల ప్రవర్తన అంతకంటే ఎక్కువ భయం కలిగిస్తుంది. వాళ్లకసలు వాస్తవ పరిస్థితి అర్థం కానట్టు అనిపిస్తుంది.






