దేవూ భోరే గత 30 ఏళ్ళుగా తాళ్ళను తయారుచేస్తున్నారు. బలహీనంగా ఉండే దూది పోగులను మరింత సాగే గుణం కలిగిన దారాల నుండి వేరు చేయడం. ఒక్కొక్కటి 1.5-2 కిలోల బరువున్న నూలు కట్టలను తయారుచేయడానికి, తన ఇంట్లో నేల మీద నుంచి దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న పైకప్పుకు బిగించి ఉన్న కొక్కేనికి ఆ దారాలను సాగదీసి కట్టడం. ఏడు గంటల్లో అలాంటి 10 కట్టలను, ఇలా వారానికి మూడుసార్లు తయారుచేయడం.
పత్తి అయితే కుటుంబ వ్యాపారంలోకి ఆలస్యంగా ప్రవేశించింది. అయితే కొన్ని తరాలపాటు అతని కుటుంబం కిత్తనార మొక్క నుండి తాళ్ళు తయారుచేసింది. అదింక కుదరకపోవడం వలన వాళ్ళు పత్తికి మారారు. నైలాన్ తాళ్ళ విస్తరణతో ఇప్పుడు అది కూడా ఒక సతాయించే వృత్తి అయిపోయింది.
దేవూ చిన్నతనంలో, మరాఠీలో ఘాయ్‌పాత్ అనీ, స్థానికంగా ఫడ్ అని కూడా పిలిచే కిత్తనార మొక్కలను సేకరించడానికి అతని తండ్రి మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు గ్రామాల సమీపంలోని అడవులకు, 10 కిలోమీటర్ల దూరం నడిచివెళ్ళేవారు. అతను తిరిగి వచ్చేటపుడు సుమారు 15 కిలోల బరువుతో వచ్చేవారు. ఆకులకున్న ముళ్ళ అంచులను తీసేసి వారం రోజుల పాటు నీళ్ళలో ఊరబెట్టి, ఆ పైన రెండు రోజులు ఆరబెట్టేవారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తాడు తయారీకి రెండు కిలోల పీచు లభిస్తుంది. దేవూ తల్లి మైనాబాయి కూడా ఈ పని చేసేవారు. అప్పటికి పదేళ్ళ వయసున్న దేవూ ఈ పనిలో పాలుపంచుకునేవాడు.
1990ల ప్రారంభంలో భోరేలు, ఇంకా ఇతర కుటుంబాలు కిత్తనార పీచుకు బదులుగా పత్తి నూలును ఉపయోగించడం ప్రారంభించారు - పత్తి ఎక్కువ కాలం మన్నుతుంది. అంతేకాకుండా, “జనం అడవులను నరికివేశారు. ఫడ్ కంటే నూలును ఉపయోగించడం సులభం (కిత్తలి మొక్కను ఎక్కువసేపు నీటిలో నానబెట్టడం, ఎండబెట్టడం వల్ల)." అంటారు దేవూ.
1990ల చివరి వరకు, అతని గ్రామంలో దాదాపు 100 కుటుంబాలు తాళ్ళను తయారుచేసేవని దేవూ అంచనా వేస్తున్నారు. దేవూ బెళగావ్ జిల్లా చికోడి తాలూకా బోరగావ్ గ్రామంలో నివసిస్తున్నారు. చౌకైన నైలాన్ తాళ్ళు రావడంతో రాబడి తగ్గడం మొదలయింది. దీంతో చాలామంది సమీప గ్రామాలలో వ్యవసాయ పనుల వైపు మొగ్గు చూపారు, లేదా సమీపంలోని ఇచల్‌కరంజి, కాగల్ పట్టణాల్లోని మరమగ్గాలపై పనిచేయడానికి, లేదా ఆటో విడిభాగాల వర్క్‌షాప్‌లలోనూ, ఇతర కర్మాగారాలలోనూ పనులు చేసేందుకు వెళ్ళారు.















