ఈ దీపావళి కోసం తాను 10,000-12,000 వరకూ దియా ల(ప్రమిదలు)ను తయారుచేశానని శ్రీకాకుళం పరదేశం చెప్పారు. ఈ వారంలో జరుపుకోబోతున్న పండుగ కోసం తొంభైరెండేళ్ళ ఈ కుమ్మరి, ఒక నెల ముందునుంచే ప్రమిదలను తయారుచేయడం మొదలుపెట్టారు. ప్రతిరోజూ ఉదయం ఏడు గంటలకు ఒక కప్పు టీ తాగిన తర్వాత పని ప్రారంభించే ఆయన, సాయంత్రం చీకటిపడేవరకూ - మధ్యలో కేవలం రెండుసార్లు మాత్రమే విరామం తీసుకుంటూ - పనిచేస్తారు.
కొన్ని వారాల క్రితం, అక్టోబర్ నెల ప్రారంభంలో, ఒక చిన్న దీపస్థంభంతో కలిపి దియాలను తయారుచేయటం మొదలుపెట్టారు పరదేశం. "వీటిని తయారు చేయటం కొద్దిగా కష్టం. దీపస్థంభం సరైన మందంతో ఉండేలా చూసుకోవాలి," అంటారాయన. చిన్న గిన్నె ఆకారంలో ఉండే ప్రమిదలో నింపిన నూనె ఒలికిపోకుండా, అందులో వెలిగే వత్తి మలిగిపోకుండా ఈ దీపస్థంభం (స్టాండ్) కాపాడుతుంది. మామూలు ప్రమిదను చేసేందుకు రెండు నిమిషాలు పడితే, ఈ ప్రమిదను చేయడానికి ఆయనకు ఐదు నిముషాలు పడుతుంది. అయితే తన దగ్గర ప్రమిదలు కొనేవారిని పోగొట్టుకోవడం ఇష్టంలేని ఆయన, మమూలు ప్రమిదకు తీసుకునే మూడు రూపాయలకంటే ఈ దియాకు ఒక్క రూపాయి మాత్రమే ఎక్కువగా తీసుకుంటున్నారు.
తన వృత్తిపై పరదేశంకు ఉన్న ఉత్సాహం, మమకారాల వల్ల విశాఖపట్నం, కుమ్మరివీధిలో ఉన్న ఆయన ఇంటిలో గత 8 దశాబ్దాలకు పైగా కుమ్మరి సారె నిర్విరామంగా తిరుగుతూ ఉంది. ఈ మొత్తం కాలంలో ఆయన లక్షలాది దియాలు లేదా దీపాలను తయారుచేసి దీపావళి పండుగ సమయంలో ఇళ్ళను దీపకాంతులతో వెలిగించారు. "కేవలం మా చేతులనూ, శక్తినీ, సారెనూ ఉపయోగించి ఏ ఆకారమూ లేని ఒక మట్టిముద్దను ఒక వస్తువుగా మలుస్తాం. అది ఒక కళ !" అంటారు తొంభైల వయసులో ఉన్న పరదేశం. వినికిడి శక్తి కొద్దిగా తగ్గినందువల్ల అంతగా బయటకు తిరగటం మానేసిన పరదేశం తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు.
కుమ్మరి వీధి విశాఖపట్నం నగరంలో అత్యంత రద్దీగా ఉండే అక్కయ్యపాలెం మార్కెట్ ప్రాంతానికి దగ్గరగా ఉండే ఒక ఇరుకైన వీధి. ఈ వీధిలో నివాసముండేవాళ్ళలో ఎక్కువమంది కుమ్మర సామాజికవర్గానికి చెందినవారు. సంప్రదాయకంగా ఈ కుమ్మరులు మట్టిని ఉపయోగించి దేవతా విగ్రహాలతో సహా అనేక వస్తువులను తయారుచేస్తుంటారు. పరదేశం తాతగారు విశాఖపట్నం జిల్లా, పద్మనాభం మండలం పొట్నూరు నుంచి జీవనోపాధిని వెతుక్కుంటూ నగరానికి వలసవచ్చారు. తన చిన్నతనంలో ఈ వీధిలో ఉండే 30 కుమ్మరి కుటుంబాలు దేవతా విగ్రహాలతో పాటు దియాలు, మొక్కలు పెంచే కుండీలు, 'పిగ్గీ బ్యాంకులు’ (పిల్లలు డబ్బులు దాచుకునే ముంతలు), మట్టి జాడీలు, కుండలు, గిన్నెలువంటి వాటిని తయారుచేసేవారని ఆయన గుర్తుచేసుకుంటారు.
ఈనాడు, విశాఖపట్నంలో దియాలు తయారుచేసే చివరి హస్తకళాకారుడుగా పరదేశం నిలిచివున్నారు. ఇక్కడ ఉండే ఇతర కుమ్మరి కుటుంబాలు కేవలం విగ్రహాలు, ఇతర మట్టి వస్తువులను తయారుచేయడానికి మారిపోవటమో, లేదా పూర్తిగా ఈ వృత్తిని విడిచిపెట్టడమో చేశాయి. ఒక దశాబ్దం క్రితం వరకు, ఆయన కూడా పండుగల సమయాలలో విగ్రహాలను తయారు చేశారు కానీ నెమ్మదిగా ఆ పనిని ఆపేశారు. విగ్రహాల తయారీ శారీరకంగా చాలా కష్టమైన పని. గంటల తరబడి నేలపై కూర్చొని పనిచేయడం చాలా కష్టమని ఆయన చెప్పారు.
పరదేశం ప్రస్తుతం వినాయక (గణేశ్) చతుర్థి ముగియటం కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఆ పండుగ అయ్యాక ఆయన దీపావళి దియాల ను తయారుచేస్తారు. " దియాల ను తయారుచేయటంలో నాకెందుకు ఆనందం ఉంటుందో నిజంగానే నాకు తెలియదు. కానీ నేను చేస్తాను. ఆ మట్టివాసనని నేను చాలా ఇష్టపడతాననుకుంటా," తన ఇంటికి దగ్గరగా తాత్కాలికంగా నిర్మించిన ఒక గదిలో పనిచేస్తూ అన్నారు పరదేశం. ఆ గది మొత్తం మట్టి ముద్దలు, విరిగిన కుండలు, విగ్రహాలు నీళ్ళు నిలవ చేసే డ్రమ్ములతో నిండివుంది.
దీపావళి పండుగ సమయంలో ఇళ్ళను వెలిగించుకోవడం కోసం ఉపయోగించే సాధారణ మట్టి దియా లను తయారుచేయటమెలాగో పరదేశం తన చిన్నతనంలో తండ్రి దగ్గర నేర్చుకున్నారు. అలా ఆయన మామూలువీ, అలంకారంగా ఉండే దియాల తో పాటు మొక్కలకోసం మట్టికుండీలు. డబ్బు దాచుకునే ముంతలు, వినాయక చతుర్థి కోసం గణేశ విగ్రహాలు, 'చిచ్చుబుడ్లు' - బాణాసంచా తయారీ పరిశ్రమలో ఉపయోగించే చిన్న చిన్న మట్టిపాత్రలు - తయారుచేస్తూ వచ్చారు. ఈ ఏడాది ఆయనకు ఒక్కో చిచ్చుబుడ్డి మూడు రూపాయల చొప్పున 1000 చిచ్చుబుడ్ల తయారీ కోసం ఆర్డర్ వచ్చింది.
దీపావళికి ముందు వచ్చే నెలలలో నిపుణుడైన పరదేశం ఒక్క రోజులో 500 దియాల ను, లేదా చిచ్చుబుడ్లను తయారుచేస్తుంటారు. ఆయన అచ్చుపోసే వస్తువులలో మూడింట ఒకటి కట్టెల ఆవంలో కాలబెట్టినప్పుడో, లేదా వాటిని శుభ్రం చేసేటపుడో విరిగిపోవడమో బీటలువిచ్చిపోవడమో జరుగుతుంటుంది. ఇలా కావటానికి తమకు దొరికే నాసిరకపు మట్టే కారణమని ఈ కుమ్మరులు ఆరోపిస్తుంటారు.
గిరాకీ ఎక్కువగా ఉండే కాలంలో పరదేశంకు ఆయన కొడుకు శ్రీనివాసరావు, కోడలు సత్యవతి ఈ పనిలో సహాయపడుతుంటారు. మొత్తంగా ఆ కుటుంబం, పండుగల కాలమైన జూలై - అక్టోబర్ల మధ్యకాలంలో దాదాపు 75,000 రూపాయలు సంపాదిస్తుంది. ఏడాదిలో ఆ నెలలు తప్ప మిగిలిన కాలమంతా ఆ కుమ్మరివీధికి చాలా తక్కువమంది కొనేవాళ్ళు వస్తుంటారు, అమ్మకాలు దాదాపు ఉండవు. ఆ సమయంలో బడిలో ఉద్యోగం చేసే శ్రీనివాస్‌కు వచ్చే పదివేల రూపాయలపైనే ఆ కుటుంబం ఆధారపడుతుంది.
పోయిన సంవత్సరం కోవిడ్ కారణంగా అమ్మకాలు మందగించడంతో, వాళ్ళు 3000-4000 రూపాయల దియా లను మాత్రమే అమ్మగలిగారు. చిచ్చుబుడ్లు అసలు అమ్ముడుపోలేదు. "ఇప్పుడు చేతి తయారీ మామూలు దియా లను ఎవరూ అడగటంలేదు." దీపావళి పండుగకు ఒక వారం రోజుల ముందు PARIతో మాట్లాడుతూ అన్నారాయన. అయితే, గిరాకీ మళ్ళా పుంజుకోవచ్చుననే ఆయన ఆశపడుతున్నారు. "వాళ్ళు (కొనేవాళ్ళు) యంత్రాలపై తయారయ్యే డిజైన్లున్న దియా లనే కోరుకుంటున్నారు," అని అతను చిన్న పారిశ్రామిక యూనిట్లలో డై-కాస్ట్ అచ్చులతో తయారుచేసే నమూనాల దియా లను సూచిస్తూ చెప్పారు. ఇక్కడి కుమ్మరివీధిలోని అనేక మాజీ కుమ్మరుల కుటుంబాలు ఈ దియా లను ఒక్కొక్కటి 3-4 రూపాయలకు కొని, డిజైన్‌ను బట్టి ఒక్కొక్కటి 5-10 రూపాయల ధరకు అమ్ముతున్నారు.
పోటీ ఇలా ఉన్నప్పటికీ, "మామూలు మట్టి దియా లను చేయటమే నాకిష్టం. ఎందుకంటే నా మనవరాలికి అవంటే ఇష్టం." ఈ మాటలు చెప్తున్నపుడు పరదేశం మొహం వెలిగిపోయింది.
కుమ్మరివీధిలో ఈ వృత్తిని కొనసాగిస్తోన్న అతి కొద్ది కుటుంబాలు ప్రతి ఏటా వినాయక చతుర్థికి కొన్ని నెలలకు ముందు ఒక డీలర్ దగ్గర మట్టి ని కొంటుంటారు. అంతా కలిసి దాదాపు ఐదు టన్నుల బరువుండే ఒక నిండు ట్రక్కు మట్టి ని కొంటారు. మట్టికి 15,000 రూపాయలు, మరో పది వేలు పొరుగునే ఉన్న విజయనగరం జిల్లాలోని ఒక నిర్దిష్ట ప్రాంతం నుండి దాన్ని రవాణా చేసినందుకు చెల్లిస్తారు. సరైన జింక మట్టి - సహజసిద్ధంగానే జిగురుగా ఉండే మట్టి - మట్టి కళాఖండాలను, విగ్రహాలను తయారుచేసేందుకు చాలా ముఖ్యం.
పరదేశం కుటుంబం ఒక టన్ను లేదా 1000 కిలోల మట్టిని తీసుకున్నారు. దీపావళి పండుగకు ఒక వారం రోజుల ముందు ఆయన ఇంటిబయట పేర్చివున్న పెద్ద పెద్ద గోనెసంచులలో ఉంచిన మట్టిని చూడవచ్చు. ముదురు ఎరుపు రంగులో పొడిగా గడ్డలుగా ఉన్న ఆ మట్టిని సరైన పదునుకు తీసుకువచ్చేందుకు నెమ్మదిగా దానిని నీటితో కలపాలి. అది బాగా కలిసిపోయేందుకు దానిని బాగా కాళ్ళతో తొక్కుతారు; మట్టిని తొక్కేటపుడు చాలా శ్రమ పడాలనీ, మట్టిలో ఉండే చిన్న చిన్న రాళ్ళు తన పాదాల్లో గుచ్చుకుంటాయనీ పరదేశం చెప్పారు.
మట్టి సరైన పదునుకు చేరిన తర్వాత, ఆ నిపుణుడైన చేతిపనివాడు, ఒక మూలనుండి అక్కడక్కడా ఎండిన మట్టి అంటివున్న బరువైన చెక్క కుమ్మరి చక్రాన్ని తీసుకువచ్చి దానిని స్టాండ్‌పై నిలబెట్టారు. తర్వాత బోర్లించిన ఒక ఖాళీ రంగు డబ్బా మీద ఒక కేన్వాస్ గుడ్డను మడతలు పెట్టి పరిచారు. అదిప్పుడు ఆయన చక్రం ముందు కూర్చొని పనిచేసుకోవడానికి సీటుగా మారింది.
ఆ కుమ్మరి వీధిలో ఉండే అందరి చక్రాల మాదిరిగానే పరదేశం కుమ్మరి సారె కూడా చేతులు ఉపయోగించి పనిచేసేదే. విద్యుత్తుతో పనిచేసే కుమ్మరి సారె గురించి ఆయన విన్నారు కానీ, దాన్ని నియంత్రించడమెలాగో ఆయనకు స్పష్టతలేదు. "ప్రతి కుండ లేదా దీపం (ప్రమిద) చేయడానికి సారె తిరిగే వేగం మారుతుండాలి." అని ఆయన అన్నారు.
చేతినిండుగా తడి మట్టిముద్దను తీసుకొని ఆ చక్రం మధ్యభాగం పై వేసి, తన చేతుల్ని ఆ మట్టిముద్దలోకి జొనిపి సున్నితంగానే అయినా దృఢంగా తిప్పుతూ దియా ఆకారంలోకి ఆ మట్టిని మలుస్తారు. దాదాపు ఒక మీటరు వెడల్పు ఉన్న ఆ చక్రం తిరుగుతుంటే తడి మట్టి వాసన అక్కడి గాలిని నింపేస్తుంది. చక్రం వేగం తగ్గకుండా ఉండేందుకు ఆయన ఒక చెక్క కర్రతో మధ్యమధ్యలో ఆ చక్రాన్ని తిప్పుతున్నారు. "నేనిప్పుడు ముసలివాణ్ణయ్యాను, ఒకే బలంతో నేనిప్పుడు చక్రాన్ని తిప్పలేను," అంటారు పరదేశం. క్రమంగా మట్టి దియా ఆకారంలోకి వచ్చిన తరువాత, దాన్ని తిరుగుతున్న చక్రం మీది నుంచి ఒక దారాన్ని ఉపయోగించి వేరుచేశారు.
చక్రం మీది నుంచి వేరు చేసిన తర్వాత ఆయన ఆ దియా లనూ, చిచ్చుబుడ్లనూ ఒక దీర్ఘచతురస్రాకారపు చెక్క పలక మీద జాగ్రత్తగా వరసలుగా పేర్చారు. మట్టితో చేసిన ఈ వస్తువులు మూడునాలుగు రోజులపాటు నీడలో ఆరాలి. అవి బాగా ఆరిన తర్వాత వాటిని ఒక ఆవంలో (బట్టీ) పేర్చి రెండు రోజులపాటు కాలుస్తారు. జూలై నుంచి అక్టోబర్ నెల వరకూ (వినాయక చతుర్థి, దసరా, దీపావళి పండుగల కోసం) ప్రతి రెండు మూడు వారాలకొకసారి ఈ ఆవంను వెలిగిస్తారు. మామూలు రోజుల్లో ఏ నెలకోసారో దీన్ని వెలిగిస్తారు.
దీపావళి సమీపిస్తున్న సమయంలో దేశంలోని తూర్పుతీరంలో ఆలస్యంగా కురుస్తున్న ఋతుపవన వర్షాలు ఆయన్ని ఆపటం కానీ, ఆయన పనిని మందగించేలా కానీ చేయలేదు. పరదేశం తన మకాంను ఇంటివెనుక ఉన్న ఇరుకైన ప్రదేశంలోకి మార్చుకున్నారు. ప్లాస్టిక్ పట్టాలు కప్పి తయారుచేసిన ఆ గుడిసెలో వర్షం కురుస్తున్న రోజున కూడా ఆయన పని ఆగకుండా కొనసాగుతుంది. తిరుగుతున్న కుమ్మరి చక్రం, పగిలిన కుండల పెంకులు, పనికిరాక పారేసిన వస్తువులతో ఉన్న ఆ ప్రదేశంలో కొన్ని పిల్లిపిల్లలు ఆయన చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి.
పరదేశం భార్య పైడితల్లి అనారోగ్యంతో మంచంపట్టి ఉన్నారు. ఆ దంపతులకు నలుగురు సంతానం- ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు. వారిలో ఒక కొడుకు చిన్నవయసులోనే మరణించాడు.
" దియా లను తయారుచేసేవాడ్ని నేనొక్కడినే మిగిలి ఉండటం చాలా విచారం కలిగించే విషయం. కనీసం నా కొడుకైనా ఈ పనిని కొనసాగిస్తాడని నా జీవితమంతా ఆశించాను," అంటారు పరదేశం. "కుమ్మరి సారెను ఎలా తిప్పాలో నా కొడుక్కి నేను బోధించాను. కానీ గణేశ విగ్రహాల్ని, దియా లను తయారుచేసి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబం నడిచేందుకు సరిపోయినంత ఉండదు. అందుకని అతను ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తున్నాడు."పరదేశం చేతి తయారీ దియాలు డజను ఒక్కింటికి 20 రూపాయలకు అమ్ముడవుతాయి. కానీ ఎవరైనా బేరమాడితే ఆయన దాన్ని 10 రూపాయల వరకూ తగ్గించేస్తారు. దాంతో, ఆ వచ్చే కొద్దిపాటి లాభం కూడా ఆవిరైపోతుంది.
"సాధారణ దియా లను తయారు చేయటంలో ఎంత కష్టం ఇమిడివుంటుందో ఎవరూ అర్థంచేసుకోరు," అంటారు కుమ్మరి వీధిలోనే నివసించే 65 ఏళ్ళ ఉప్పర గౌరీశంకర్. ఈయన పరదేశం ఇంటికి కొన్ని ఇళ్ళ అవతల నివసిస్తుంటారు. గౌరీశంకర్ ప్రస్తుతం సారెను తిప్పడం కానీ, నేలపై కూర్చొని పనిచేయడం కానీ చేయలేరు. "నా వీపు నొప్పెడుతుంది, కింద కూర్చొని లేవటం అసాధ్యంగా ఉంటుంది," అన్నారాయన.
కొద్ది సంవత్సరాల క్రితం వరకూ గౌరీశంకర్ కుటుంబం దీపావళికి ఒక నెల రోజుల ముందు నుండి మొదలుపెట్టి దియాల ను తయారుచేసేది. చేతి తయారీ ప్రమిదల అమ్మకం వలన కనీసం వాళ్ళు కొనే మట్టి ఖరీదు కూడా రావకపోవడంతో, వాటి తయారీని ఆపేశామని గౌరీశంకర్ చెప్పారు. అందువలన గౌరీశంకర్ కుటుంబం ఈ సంవత్సరం 25 వేల మెషీన్ తయారీ దియాల ను కొన్నది. వాటిని అమ్మి కొంత లాభాన్ని పొందాలని వారు ఆశిస్తున్నారు.
అయితే మట్టిని కాళ్ళతో తొక్కడంలో ఆయన తన స్నేహితుడైన పరదేశంకు సహాయం చేస్తుంటారు. " దియాల ను తయారు చేయడంలో ఇది మొదటి అడుగు. ఇదే (మట్టి తొక్కడం) కుమ్మరి సారె ఎప్పటికీ తిరుగుతూనే ఉండాలని కోరుకునే నా స్నేహితుడికి నేనివ్వగల చేయూత," అన్నారు గౌరీశంకర్. "పరదేశం పెద్దవాడైపోయాడు. ప్రతి సంవత్సరం దియాల ను తయారుచేయడంలో ఇదే అతని చివరి సంవత్సరమేమో అనిపిస్తుంటుంది." అన్నారాయన.
ఈ కథనానికి రంగ్ దే నుండి ఫెలోషిప్ మంజూరయింది .
అనువాదం: సుధామయి సత్తెనపల్లి