తన పొలంలో అడుగు పెట్టగానే నామ్‌దేవ్ తరాళే తన నడక వేగం తగ్గించారు. దాడి చేసినట్లుగా, తిన్నట్లుగా ఉన్న తన పెసర పంటను నిశితంగా పరిశీలించడానికి ఈ 48 ఏళ్ళ రైతు కిందకి వంగారు. ఫిబ్రవరి 2022లో, ఆహ్లాదకరమైన ఒక శీతాకాలపు ఉదయం అది; ఆకాశంలో సూర్యుడు మృదువుగా ఉన్నాడు.
“హా ఏక్ ప్రకార్చా దుష్కాళచ్ ఆహే (ఇదొక కొత్త రకమైన కరువు),” గంభీరంగా అన్నారతను.
తరాళేలో నెలకొన్న నిరాశ, భయాలను ఈ వాక్యం ప్రతిబింబిస్తోంది. ఐదెకరాల పొలం ఉన్న ఈ రైతు మూడు నెలలుగా శ్రమించి, పండించి, కోతకు సిద్ధం చేసిన తూర్ (కంది), పెసర పంటలను నష్టపోతున్నానని ఆందోళన చెందుతున్నారు. పాతిక సంవత్సరాలుగా చేస్తున్నవ్యవసాయంలో, అతను వివిధ రకాల కరవులను చూశారు – వాతావరణం కారణంగా (వర్షాలు లేనప్పుడు లేదా అధికంగా కురిసినప్పుడు), జలసంబంధమైన కరవు (భూగర్భ జలాల పట్టిక ప్రమాదకర స్థాయికి పడిపోయినప్పుడు), లేదా వ్యవసాయ భూమిలో తేమ తగ్గి పంటలు విఫలమైనప్పుడు.
మంచి దిగుబడి వచ్చిందని మీరు అనుకున్నంతలోనే, ఈ విపత్తు ఒక్కోసారి నాలుగు కాళ్లపై వచ్చి పంటను దొంగిలిస్తుంది లేదా పొలం మీదుగా ఎగిరి వచ్చి మొత్తాన్ని చదును చేస్తుందని తరాళే ఉద్రేకానికి గురయ్యారు.
“నీటికోళ్ళు, కోతులు, కుందేళ్ళు పగటిపూట వస్తాయి; కృష్ణ జింకలు, మనుబోతులు (నీల్‌గాయ్), సాంబర్ జింకలు (Sambar), అడవి పందులు, పులులు రాత్రి వేళల్లో వస్తాయి,” అంటూ ముప్పుల చిట్టా విప్పారాయన.
“అమ్హాలా పేరతా యెతే సాహెబ్, పణ్ వాచవతా యేత్ నాహీ," (మాకు పంట ఎలా పండించాలో తెలుసు కానీ పంటను ఎలా కాపాడుకోవాలో తెలియదు),” అతని మాటల్లో ఓటమి భయం ప్రస్ఫుటమవుతోంది. సాధారణంగా, ఆయన పత్తి లేదా సోయాబీన్స్ వంటి వాణిజ్య పంటలు కాకుండా, పెసర, మొక్కజొన్న, జొన్నలు, కందులు వంటి పంటలు పండిస్తారు.




















