దక్షిణ ముంబైలో చిక్కగా, చిక్కురొక్కురుగా అల్లుకున్న ఇరుకు దారుల భులేశ్వర్‌లో మంజూర్ ఆలం షేక్ ప్రతిరోజూ ఉదయం 5 గంటలకంతా మేల్కొని, పనిలోకి వెళ్తారు. సన్నగా, పొడవుగా, తరచుగా గళ్ళ లుంగీ ధరించి ఉండే ఆయన తాను అద్దెకు తీసుకున్న 550-లీటర్ లోహపు బండిని నీటితో నింపేందుకు కావాసజీ పటేల్ ట్యాంక్ వైపుకు నెట్టారు. ఈ ప్రాంతం అతని ఇంటికి ఒక కిలోమీటరు దూరంలోని మీర్జా గాలిబ్ మార్కెట్ సమీపంలో ఉన్న దూధ్ బాజార్‌లో, ఒక పబ్లిక్ టాయిలెట్ మూలన ఉన్న బహిరంగ ప్రదేశంలో ఉంది. అతను తన బండితో దూధ్ బాజార్‌కు తిరిగి వచ్చి, దానిని నిలబెట్టి ఉంచేందుకు ఒక ప్రదేశాన్ని ఎంచుకుని, సమీపంలోని దుకాణాలకూ, ఇళ్లలోని తన ఖాతాదారులకూ నీటిని పంపిణీ చేయడం ప్రారంభిస్తారు.
ఈ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్న చివరి తరం భిశ్తీలలో 50 ఏళ్ల మంజూర్ కూడా ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ముంబై నగరంలోని ఈ చారిత్రాత్మక ప్రాంతంలోనివాసముండేవారికి త్రాగడానికి, శుభ్రం చేయడానికి, కడగడానికి అవసరమైన నీటిని మంజూర్ సరఫరా చేస్తున్నారు. కోవిడ్-19 విజృంభణ భిశ్తీల ఈ వృత్తికి అంతరాయం కలిగించే వరకు, భులేశ్వర్‌లో మశక్లతో నీటిని సరఫరా చేసే కొద్దిమంది మశక్వాలాలలో మంజూర్ కూడా ఒకరు. దాదాపు 30 లీటర్ల నీటిని మోసుకెళ్లేందుకు రూపొందించిన తోలు సంచిని మశక్ అంటారు.
కానీ 2021లో ప్లాస్టిక్ బకెట్లకు మారిన మంజూర్, మశక్ ద్వారా నీటిని సరఫరా చేసే సంప్రదాయం “ఇప్పుడు చచ్చిపోయింది,” అని చెప్పారు. "వృద్ధులైన భిస్తీలు తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లవలసి ఉంటుంది, చిన్నవాళ్ళు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవలసి ఉంటుంది" అని అతను చెప్తున్నారు. భిశ్తీలు చేస్తున్న ఈ పని ఉత్తర భారతదేశంలోని ముస్లిం సామాజికవర్గమైన భిశ్తీల సంప్రదాయ వృత్తి యొక్క అవశేషం. 'భిశ్తీ' అనే పదం పర్షియన్ మూలానికి చెందినది. దీనికి 'నీటి వాహకం' అని అర్థం. ఈ సామాజిక వర్గాన్ని 'నీళ్ళు మోసేవాళ్ళు’ లేదా 'కుండలు మోసేవారు' అనే అర్థాన్నిచ్చే అరబిక్ పదమైన సక్కా(Saqqa) అనే పేరుతో కూడా పిలుస్తారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్(ఇక్కడ వీరిని పఖాలీ అని పిలుస్తారు)లలో భిశ్తీలు ఇతర వెనుకబడిన తరగతి (ఒబిసి)గా వర్గీకరించబడ్డారు.

























