సునీల్ గుప్త ఇంటి నుంచి పని చేయలేడు. గేట్ వే ఇండియానే అతని ‘ఆఫీస్’. కానీ 15 నెలలుగా లాక్ డౌన్ ఉండడం వలన ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అతనికి అనుమతి లేదు.
‘ఇదే మా ఆఫీసు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి?’, అని అతను సౌత్ ముంబై లోని ఆ స్మారక భవనాన్ని చూపిస్తూ అడిగాడు.
లాక్ డౌన్ మొదలయ్యేవరకు సునీల్ తన కెమెరాని పట్టుకుని ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా ప్రసిద్ధి పొందిన ఈ సందర్శకుల స్థలంలో ఉండేవాడు. ప్రజలు చెక్ పాయింట్లను దాటి గేట్ వే వైపు వెళ్తుండగా అతను, అతనిలాంటి ఫొటోగ్రాఫర్లు వారిని పలకరించి క్లిక్ అండ్ ప్రింట్ ఫోటోలు తీసుకొమ్మని గట్టిగా బతిమాలుతుంటారు. ‘ఒక్క నిముషంలో ఫామిలీ ఫోటో, ఒక్క ఫోటో నే, ఓన్లీ 30 రూపీస్’.
ముంబై లో లాక్ డౌన్ పై పరిమితులు తీసేసాక ఏప్రిల్ మధ్యలో ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. దాని వలన అందరికి పని అందకుండా పోయింది. “నేను పొద్దున్న ఇక్కడికి వచ్చాను, కానీ నా మొహాన ‘నో ఎంట్రీ’ అచ్చు గుద్ది పంపించేశారు”. అని 39 ఏళ్ళ సునీల్ నాకు ఏప్రిల్ లో చెప్పాడు. “మేము ఇప్పటికే సంపాదనకు కష్టపడుతున్నాము. ఇప్పుడు మా దగ్గర ఉన్న డబ్బు కూడా తగ్గిపోయి, నెగటివ్ లోకి వెళ్ళిపోయాము. నాకిక ఈ నష్టాలను తట్టుకునే ఓపిక లేదు.” అన్నాడు.


















