అదొక చిన్న టీ దుకాణం. నిర్మానుష్యమైన ప్రదేశంలో మట్టి గోడలతో కట్టిన ఒక చిన్న దుకాణం. దుకాణం ముందు తెల్ల కాగితం మీద చేతి రాతతో ఉన్న ఒక బోర్డు ఉంది:
అక్షర ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్
లైబ్రరీ
ఇరుప్పుకళ్ళకుడి
ఎడమలకుడి



అదొక చిన్న టీ దుకాణం. నిర్మానుష్యమైన ప్రదేశంలో మట్టి గోడలతో కట్టిన ఒక చిన్న దుకాణం. దుకాణం ముందు తెల్ల కాగితం మీద చేతి రాతతో ఉన్న ఒక బోర్డు ఉంది:
అక్షర ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్
లైబ్రరీ
ఇరుప్పుకళ్ళకుడి
ఎడమలకుడి

గ్రంథాలయమా? ఇడుక్కి జిల్లాలోని ఈ అడవులు, నిర్జన ప్రాంతంలోనా? దేశంలోనే అత్యధిక అక్షరాస్యత గల కేరళ రాష్ట్రంలో కూడా ఇది తక్కువ అక్షరాస్యత ఉన్న ప్రదేశం. రాష్ట్రంలో మొట్టమొదటి ఆదివాసీ గ్రామమండలి గల ఈ పల్లెటూరులో కేవలం 25 కుటుంబాలు ఉన్నాయి. ఈ ఊరివారు కాక ఇంకెవరన్నా ఈ గ్రంథాలయంలో పుస్తకం తీసుకోవాలంటే దట్టమైన అడవిలోనుంచి చాలా దూరం నడిచి రావాలి. ఎవరన్నా వస్తారా అసలు?
“వస్తారు మరి,” అంటాడు టీ వ్యాపారి, స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకుడు, గ్రంథాలయాధికారి అయిన 73 సంవత్సరాల పి.వి. చిన్నతంబి. “వస్తారు.” ఎడమలకుడి కొండ కూడలిలో ఉన్న ఆయన చిన్న దుకాణంలో టీ, ‘మిక్శ్చర్’, బిస్కెట్లు, అగ్గిపెట్టెలు, ఇతర సరుకులు అమ్ముతారు. కేరళలో అతి సుదూర ప్రాంతంలో ఉన్న ఈ పంచాయతీ కేవలం ముత్తవాన్ ఆదివాసులు మాత్రమే నివసించే ప్రాంతం. అక్కడకి చేరడం అంటే మున్నార్ సమీపంలోని పెట్టిముడి నుంచి 18 కిలోమీటర్ల నడక. చిన్నతంబి టీ షాపు-గ్రంథాలయాన్ని చేరడం అంటే ఇంకా ఎక్కువ నడక. చిన్నతంబి ఇల్లు మాకు తటస్థపడే సమయంలో ఆయన భార్య లేదు, పనికి వెళ్ళింది. వాళ్ళు కూడా ముత్తవాన్లే.
“చిన్నతంబి. నేను టీ తాగాను. నువ్వు అమ్మే సరుకులు అనిపిస్తున్నాయి. నీ లైబ్రరీ ఎక్కడయ్యా బాబూ?” నేను కుతూహలంగా అడిగాను. అతను బదులుగా ఒక మంచి చిరునవ్వు నవ్వారు. మమ్మల్ని దుకాణంలోకి తీసుకుని వెళ్లారు. ఒక చీకటి మూల నుంచి రెండు జనపనార బస్తాలు తీశాడు. పాతిక కిలోల బియ్యం నింపగలిగేలాంటి సంచులు. వాటిల్లో మొత్తం 160 పుస్తకాలు ఉన్నాయి. రోజూ లైబ్రరీ పని చేసే వేళల్లో అమర్చినట్లు ఆ పుస్తకాలను అతను జాగ్రత్తగా చాప మీద పరచాడు
మా ఎనిమిది మంది ప్రయాణీకుల బృందం ఆ పుస్తకాలను సంభ్రమంతో పరికించింది. ఒక్కో పుస్తకం ఒక సాహిత్య నిధి. ఒక కళాఖండం. చివరికి రాజకీయ రచనలు కూడా. ఒక సస్పెన్స్ పుస్తకం కానీ, జనాదరణ పొందినవి కానీ, ఆడపిల్లలు ఇష్టపడే ప్రేమ సాహిత్యం కానీ లేవు. తమిళ మహా కావ్యం శిలప్పధికారం మలయాళం అనువాదం ఉంది. వైగోం ముహమ్మద్ బషీర్, ఎం టి వాసుదేవన్ నాయర్, కమలా దాస్ రచనలు ఉన్నాయి. ఎం. ముకుందన్, లలితాంబిక అంతర్జనం మొదలైన వారి రచనలు ఉన్నాయి. మహాత్మా గాంధీ రచనలతో పాటు, తోప్పిల్ బసి యు మేడ్ మి ఏ కమ్యునిస్ట్ వంటి విప్లవ సాహిత్యం కూడా ఉంది.
“కానీ చిన్నతంబీ, ఇక్కడ జనాలు ఇలాంటి పుస్తకాలు నిజంగా చదువుతారా?” బయటకి వచ్చి కూర్చున్నాక మేం అడిగాం. చాలా ఆదివాసీ తెగల మాదిరిగా ముత్తవాన్లు కూడా చాలా పేదరికం, లేమిలో ఉండి, ఇతర భారతీయుల కంటే తరచుగా చదువు మధ్యలో మానేస్తుంటారు. మా ప్రశ్నకి బదులుగా అతను తన గ్రంథాలయం రిజిస్టర్ బయటకు తీశారు. జనాలు తీసుకుని వెళ్ళి తిరిగి ఇచ్చిన పుస్తకాల నమోదు రిజిస్టర్ అది. ఆ కటిక పల్లెటూరులో 25 కుటుంబాలే ఉండచ్చుగాక, కానీ 2013లో 37 పుస్తకాలు పట్టుకెళ్ళారు పాఠకులు. అంటే మొత్తం స్టాక్ అయిన 160లో దాదాపు నాలుగో వంతు అన్నమాట – మంచి నిష్పత్తియే అని చెప్పచ్చు. లైబ్రరీలో సభ్యత్వ రుసుము పాతిక రూపాయలు ఒక సారి చెల్లించాలి. ఆ తర్వాత నెలకి రెండు రూపాయలు కట్టాలి. ఇంక పుస్తకాలకు వేరే చార్జి లేదు. టీ కూడా ఉచితమే. పాలు లేకుండా చక్కర వేసిన టీ డికాక్షన్. “జనాలు పాపం కొండల నుంచి అలసిపోయి వస్తారు.” బిస్కెట్లు, మిక్శ్చర్, మిగిలిన వస్తువులకి మాత్రమే డబ్బు కట్టాలి. కొన్ని సార్లు సందర్శకులకి సాదాసీదా భోజనం కూడా ఉచితంగా లభించవచ్చు.

పుస్తకాలు తీసుకువెళ్ళిన తేదీ, తిరిగి ఇచ్చిన తేదీ, తీసుకున్నవారి పేరు అన్నీ చక్కగా రిజిస్టర్ పుస్తకంలో రాసి ఉన్నాయి. ఇళంగో రాసిన శిలప్పధికారం పుస్తకాన్నయితే చాలా మంది తీసుకుని వెళ్లారు. ఈ ఏడాది ఇప్పటికే పాఠకులు 37 పుస్తకాలు తీసుకుని వెళ్ళినట్లు రాసి ఉంది. అణచివేతకు గురైన ఒక ఆదివాసీ సమాజం, అడవుల్లో ఇక్కడ నాణ్యమైన సాహిత్యాన్ని పంచుకుని, చదివి, జీర్ణం చేసుకుంటోంది. ఈ ఎరుక మమ్మల్ని ఆలోచనలో పడేలా చేసింది. నగరాల్లో మా సొంత పుస్తక పఠనం అలవాట్లు గుర్తొచ్చి మాలో కొంత మంది కొంచెం సిగ్గుపడ్డాం కూడా అనుకుంటాను.
మా బృందంలో రాతలు, రచనల ద్వారా పొట్ట పోషించుకునే వాళ్ళమే ఎక్కువ. మేం గొప్ప రచయితలమన్న గర్వాన్ని పటాపంచలు చేసే పుస్తకం ఒకటి మాకు అక్కడ దొరికింది. కేరళ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మాతో ప్రయాణిస్తున్న ముగ్గురు జర్నలిజం విద్యార్థుల్లో ఒకరైన విష్ణు ఎస్. కి ఒక భిన్నమైన ‘పుస్తకం’ దొరికింది. గీతలున్న నోట్ బుక్, అందులో చేతిరాతతో నిండిన అనేక పేజీలు. ఆ పుస్తకానికి ఇంకా శీర్షిక లేదు కానీ, అది చిన్నతంబి ఆత్మకథే. “చాలా ఎక్కువ రాయలేకపోయాను, కానీ ఈ మధ్య ప్రయత్నిస్తున్నాను,” చిన్నతంబి ఏదో క్షమాపణ చెప్తున్న ధోరణిలో చెప్పారు. “ఏం రాశావో మాకు కొంచెం చదివి వినిపించవా, చిన్నతంబి.” సుదీర్ఘమైన రచనా కాదు, అసంపూర్తిగా కూడా ఉంది. అయినా అది ఎంతో కుదురుగా చెప్పిన కథ. తనలో తొలి సామాజిక, రాజకీయ స్పందన గురించి ఉంది ఆ కథనంలో. రచయితకు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు మహాత్మాగాంధి హత్య, ఆ సంఘటన తనపై చూపిన ప్రభావంతో ఆ ఆత్మకథ ప్రారంభమయింది.
ఎడమలకుడికి తిరిగి వచ్చి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలన్నది తనకు మురళి మాష్ (టీచర్ లేదా మాస్టర్) ఇచ్చిన స్ఫూర్తి అని చిన్నతంబి చెప్పారు. ఈ ప్రాంతాల్లో మురళి మాష్ పేరెన్నికగన్న టీచర్. ఆయన కూడా ఆదివాసియే కానీ వేరే తెగకు చెందినవారు. ఆ తెగవారు ఈ పంచాయతీ వెలుపల మంకుళంలో నివసిస్తారు. అయితే ఆయన ముత్తవాన్లతో కలిసి పని చేయడానికే తన జీవితాన్ని అంకితం చేశారు. “మాష్ నన్ను ఈ దిశలోముందుకు నడిపించారు,” అంటారు చిన్నతంబి వినయంగా. తానేది ప్రత్యేకమైనది చేయడం లేదు అనేది చిన్నతంబి భావన. కానీ కనిపిస్తూనే ఉందిగా ఆయన ప్రత్యేకత ఏమిటో.
ఈ చిన్న పల్లెటూరుతో సహా ఇరవై ఎనిమిది పల్లెటూళ్ళు ఉన్న ఎడమలకుడిలో జనాభా 2,500 కంటే తక్కువ. అసలు అది ప్రపంచం మొత్తం మీద ఉన్న ముత్తవాన్ జనాభా అని చెప్పవచ్చు ఇరుప్పుకళ్ళకుడిలో మహా అయితే వంద మంది ఉంటారు. వంద చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉండే ఎడమలకుడి, సుమారు పదిహేను వందల ఓట్లతో, రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీ కూడా. ఇంతకీ ఆ ఊరు నుంచి బయటకు తమిళనాడులోని వాళ్పరైకి వెళ్లేందుకు మేం ఎంచుకున్న దగ్గర మార్గం వదిలేయవలసి వచ్చింది. ఏనుగులు ఆ మార్గాన్ని స్వాధీనం చేసుకున్నాయిట.
అయినప్పటికీ, ఇవేమి పట్టనట్టుగా ప్రపంచంలోనే అత్యంత నిర్మానుష్యమైన, ఏకాకి గ్రంథాలయాల్లో ఒకదానిలో చిన్నతంబి కూర్చుని ఉంటారు. ఆ గ్రంథాలయాన్ని సజీవంగా ఉంచుతూ, పేదరికంలో మగ్గిపోతుండే తన పాఠకుల సాహితీ దాహాన్ని తీరుస్తుంటాడు. పైపెచ్చు వారికి టీ, మిక్స్చర్, అగ్గిపెట్టెలు సరఫరా చేస్తుంటాడు. మామూలుగా సందడిగా కబుర్లు చెప్పుకుంటూ ఉండే మా బృందం, చిన్నతంబితో పరిచయంతో సంభ్రమం చెంది, చలించిపోయి మౌనంలో మునిగిపోయి ప్రయాణం సాగించింది. సుదీర్ఘమైన ఆ నడక ప్రయాణంలో ముందున్న ప్రమాదకరమైన దారి మీద మా కళ్ళు. అసాధారణమైన గ్రంథాలయాధికారి పి.వి. చిన్నతంబి మీద మా మనసు. అలా సాగింది మా ప్రయాణం.
ఈ వ్యాసం గతంలో : http://psainath.org/the-wilderness-library/ లో ప్రచురితమయింది .
అనువాదం: ఉషాతురగా రేవెల్లి
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/అడవిలో-పుస్తక-ప్రపంచం