జమ్మూకశ్మీర్, బాందీపుర్ జిల్లా, వజీరిథల్ గ్రామానికి చెందిన 22 సంవత్సరాల షమీనా బేగమ్ తన రెండో బిడ్డ పురిటి సమయం గురించి మాట్లాడుతూ, “నా ఉమ్మనీటి సంచి పగిలిపోయిన ఆనాటి సాయంకాలం, నేను విపరీతమైన బాధలో ఉన్నాను. అప్పటికి మూడు రోజులుగా మంచు పడుతోంది. అలా పడినపుడు రోజుల తరబడి సూర్యకాంతి ఉండదు. మా సౌర ఫలకాలు (సోలార్ పేనల్స్) చార్జ్ అవవు” అని చెప్పింది. వజీరిథల్ గ్రామం అంటే అక్కడ సూర్యుడు ఎక్కువ కాలం కనపడడు. కనీసం ఒక పద్దతి ప్రకారంగా కూడా ప్రకాశించడు. అక్కడ ప్రజలకు విద్యుత్ అందించే ఏకైక మార్గం సౌరశక్తి మాత్రమే
“కిరసనాయిలు లాంతరు లేకపోతే మా ఇల్లు చీకట్లో మగ్గిపోయేది” షమీనా చెబుతూపోయింది. “అందుకే ఆ సాయంత్రం మా పొరుగు ఆడవాళ్ళందరూ కలిసి, వాళ్ల వాళ్ల లాంతర్లతో వచ్చారు. పసుపుపచ్చటి ఐదు కాంతులతో గది వెలిగిపోయింది. అక్కడే మా అమ్మ సహాయంతో నేను రషీదాకు జన్మనిచ్చాను.” అది 2022 ఏప్రిల్ మాసంలో ఒక రాత్రి.
బడగామ్ పంచాయితిలోని వజీరిథల్ శోభాయమానమైన ప్రకృతికి నెలవైన గ్రామం. రాజ్‌దాన్ పాస్ నుండి గురేజ్ లోయ వరకూ ఉన్న గతుకుల రోడ్డుతో కలుపుకొని-శ్రీనగర్ నుండి 10 గంటల కారు ప్రయాణం, అరడజన్ చెక్ పోస్టులు, చివరిగా 10 నిమిషాల నడక అయ్యాక షమీనా ఇల్లు వస్తుంది. అక్కడకు ఆ దారి తప్ప ఇంకో మార్గం లేనే లేదు
విభజన రేఖకు కేవలం కొద్ది మైళ్ల దూరంలో, గురేజ్ లోయలోని ఈ గ్రామంలో ఉన్న 24 కుటుంబాల ఇళ్ళను దేవదారు కలపతో నిర్మించారు. ఈ ఇళ్ళ లోపలి వెచ్చదనం పోకుండా ఉండటానికి బంకమట్టితో అద్దుతారు. జడల బర్రె పాత కొమ్ములను ఒక్కోసారి నిజమైన వాటినీ, కొన్నిసార్లు కలపతో తయార చేసి అలాగే కనిపించేవాటికి ఆకుపచ్చ రంగును పూసీ - ఇక్కడి ఇళ్ల ప్రధాన ద్వారానికి అలంకరిస్తారు. ఈ ఇళ్లకున్న దాదాపు అన్ని కిటికీలు సరిహద్దు అవతల వైపు కనిపించేటట్లు తెరిచి ఉంటాయి.
షమీనా తన ఇద్దరు పిల్లలు - రెండు సంవత్సరాల ఫర్హాజ్, నాలుగు నెలల రషీదాతోపాటు (పేర్లు మార్చాం) ఇంటి బయట ఉన్న కట్టెల మోపు మీద కూర్చొని, సాయంత్రపు సూర్యుడి చివరి కిరణాల వెచ్చదనాన్ని తనలో నింపుకుంటూవుంది. “నాలాంటి బాలింతలు పుట్టిన బిడ్డలతో సహా ప్రతిరోజూ పొద్దునా, సాయంకాలం ఎండలో కూర్చోవాలని మా అమ్మ చెప్తుంటుంది” అన్నదామె. అదింకా ఆగస్టు మాసమే. లోయనింకా మంచు ఆక్రమించుకోలేదు. కానీ ఇంకా మబ్బుపట్టిన రోజులు, అప్పుడప్పుడూ వర్షాలు, సూర్యుడు కనబడని దినాలు, విద్యుత్తు లేని రోజులు ఉంటూనే ఉన్నాయి.









