మూడు దశాబ్దాల క్రితం, యువకుడైన సంజయ్ కాంబ్లేకు వెదురుతో ఎలా పని చేయాలో ఎవరూ నేర్పించలేదు. కానీ నేడు, ఆయన కనుమరుగైపోతున్న ఆ నైపుణ్యాన్ని అందరికీ నేర్పించాలనుకున్నప్పుడు, ఎవరూ నేర్చుకోవాలనుకోవడం లేదు. "విధి వైపరీత్యం కాకుంటే కాలం ఎంతలా మారిపోయింది!" అని 50 ఏళ్ళ సంజయ్ అన్నారు.

తన ఎకరం పొలంలో పెరిగే వెదురుతో, కాంబ్లే ఇర్లేల ను తయారుచేస్తారు. ఇర్లే అంటే పశ్చిమ మహారాష్ట్రలోని ఈ ప్రాంతంలో వరి పండించే రైతులు ఉపయోగించే ఒక రకమైన గూడ [రెయిన్‌కోట్ వంటిది]. "దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం, ప్రతి రైతు పొలాల్లో పని చేసేటప్పుడు ఒక ఇర్లే ను ఉపయోగించేవాడు. ఎందుకంటే, మా షాహువాడీ తాలూకా లో అప్పుడు వర్షాలు సమృద్ధిగా కురిసేవి," అని కెర్లే గ్రామానికి చెందిన సంజయ్ చెప్పారు. ఆయన కూడా తన పొలంలో పని చేసేటప్పుడు ఇర్లే ను ధరించేవారు. ఈ వెదురు గూడ కనీసంగా ఏడు సంవత్సరాల పాటు మన్నికగా ఉంటుంది, "ఆ తర్వాత కూడా దీనికి సులభంగా మరమ్మతులు చేయవచ్చు," అన్నారాయన..

కానీ పరిస్థితులు మారిపోయాయి.

కొల్హాపూర్ జిల్లాలో జూలై - సెప్టెంబర్ మధ్య వర్షపాతం గత 20 సంవత్సరాలలో 1,308 మి.మీ. (2003) నుంచి 973 మి.మీ.(2023)కు తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

"ఇక్కడ వర్షపాతం ఇంతగా తగ్గిపోతుందని, అది నా కళను చంపేస్తుందని ఎవరికి తెలుసు?" అని ఇర్లే లను తయారుచేసే సంజయ్ కాంబ్లే వాపోయారు.

"మేం ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యవసాయం చేస్తాం, ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది," అని కాంబ్లే చెప్పారు. చాలా సంవత్సరాలుగా, వర్షాలు కురవటం తగ్గిపోవటంతో చాలామంది గ్రామస్తులు ముంబై, పుణెలాంటి నగరాలకు వలస వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు రెస్టరెంట్లలో, ప్రైవేట్ బస్సు కంపెనీలలో కండక్టర్లుగా, తాపీ పనివారిగా, రోజువారీ కూలీలుగా, వీధి వ్యాపారులుగా, లేదంటే మహారాష్ట్ర అంతటా పొలాల్లో కూలీలుగా పని చేస్తున్నారు.

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ఎడమ: మహారాష్ట్రలోని కెర్లే గ్రామానికి చెందిన సంజయ్ కాంబ్లే, రైతులు పొలాల్లో పనిచేసేటపుడు ఉపయోగించే ఇర్లేలను - వెదురు గూడలను - తయారుచేస్తారు. కుడి: ‘నాణ్యమైన ఇర్లేను తయారుచేయడానికి మంచి వెదురును గుర్తించే నైపుణ్యం ఉండాలి,' తన పొలంలోని వెదురును పరిశీలిస్తూ అన్నారు సంజయ్

వర్షపాతం తగ్గిపోవడంతో మిగిలినవాళ్ళు వరి సాగు నుంచి చెరకు సాగుకు మొగ్గు చూపుతున్నారు. "వరిని సాగుచేయటం కంటే చెరకును సాగుచేయటం చాలా సులభం కాబట్టి, బోరుబావులు ఉన్న రైతులు వేగంగా చెరకు సాగు వైపుకు మళ్ళుతున్నారు," అని కాంబ్లే చెప్పారు. ఇలా చెరుకు సాగుకు మారడం ఏడేళ్ళ క్రితమే మొదలైంది.

వర్షాలు సరిగ్గా కురిస్తే, వర్షాకాలంలో కాంబ్లే దాదాపు 10 ఇర్లే లను విక్రయిస్తారు. కానీ 2023లో ఆయనకు కేవలం మూడు ఆర్డర్‌లు మాత్రమే వచ్చాయి. “ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. ఇక ఇర్లే ను ఎవరు కొంటారు?" ఆయన కొనుగోలుదార్లు సమీపంలోని అంబా, మస్నోలి, తళవాడే, చాందోలీ గ్రామాల నుంచి వస్తారు.

రైతులు చెరకు పంట వైపుకు మరలడం మరో సమస్యను కూడా సృష్టించింది. “ఎత్తు తక్కువగా ఉండే పంటలున్న పొలాల్లో ఇర్లే లను ధరిస్తారు. మీరు చెరకు తోటలో ఇర్లే వేసుకుని నడవలేరు, ఎందుకంటే వాటి ఆకారం స్థూలంగా ఉండటం వలన, వాటిని వేసుకున్నపుడు అవి పంటల కొమ్మలను తాకుతాయి,” అని దళిత బౌద్ధుడయిన సంజయ్ వివరించారు. ఒక ఇర్లే పరిమాణం దానిని ధరించిన రైతు ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. "ఇది ఒక చిన్న గూడులాంటిది," అన్నారాయన.

ప్రస్తుతం గ్రామంలో విక్రయిస్తున్న చౌకైన ప్లాస్టిక్ రెయిన్‌కోట్‌ల వల్ల ఇర్లేలు దాదాపు కనుమరుగైపోయాయి. ఇరవయ్యేళ్ల క్రితం కాంబ్లే ఒక ఇర్లే ను రూ. 200–300కు అమ్మేవారు, ఇప్పుడు జీవన వ్యయం పెరగడంతో ఆయన దాని ధరను రూ. 600కు పెంచారు.

*****

కాంబ్లే తండ్రి, గతించిపోయిన చంద్రప్ప ఒక రైతు, కర్మాగారంలో పనిచేసే కార్మికుడు. సంజయ్ పుట్టకముందే చనిపోయిన ఆయన తాత జ్యోతిబా, ఇర్లేల ను తయారు చేసేవారు. ఆయన సమయంలో అది వారి గ్రామంలో సాధారణ వృత్తిగా ఉండేది.

30 సంవత్సరాల క్రితం కూడా, దీనికి చాలా గిరాకీ ఉండేది. వెదురు పని నేర్చుకుంటే వ్యవసాయం ద్వారా వచ్చే తన ఆదాయానికి అది తోడవుతుందని కాంబ్లే భావించారు. "నాకు వేరే మార్గం లేదు," అని ఆయన చెప్పారు. "నా కుటుంబాన్ని పోషించడానికి నేను డబ్బు సంపాదించవలసి వచ్చింది."

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

వెదురుపై గుర్తులు పెట్టడానికి సంజయ్ స్కేలుని గానీ కొలత టేప్‌ని గానీ ఉపయోగించరు. పర్లీ (ఎడమ) అనే ఒక రకమైన కొడవలిని ఉపయోగించి ఆయన వెదురును (కుడి) వడిగా రెండు సమాన భాగాలుగా విభజిస్తారు

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ఎడమ: పర్లీలు చాలా పదునైనవి, ఇర్లేను తయారుచేసేవారికి తరచుగా వాటి వల్ల గాయాలవుతుంటాయి. కుడి: వెదురును చీలుస్తున్న సంజయ్

ఆయన ఇర్లే లను తయారుచేసే కళను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, కెర్లేలో ఉన్న కాంబ్లేవాడీ వసాత్ (బస్తీ)లోని ఇర్లేల ను తయారుచేసే ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి వద్దకు వెళ్లారు. "నాకు ఆ కళను నేర్పించమని నేను ఆయనను వేడుకున్నాను, కానీ పనిలో మునిగిపోయి ఉన్న ఆయన కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు," అని కాంబ్లే గుర్తు చేసుకున్నారు. అయినా పట్టు వదలకుండా, ఆయన ప్రతిరోజూ ఉదయం ఆ కళాకారుడు ఇర్లేల ను తయారుచేసే విధానాన్ని గమనించి, చివరికి తనకు తానుగా ఆ కళను నేర్చుకున్నారు.

కాంబ్లే వెదురుతో చేసిన మొదటి ప్రయోగం చిన్నగా, గుండ్రంగా ఉండే టోప్లీలు (బుట్టలు) తయారుచేయడం. ఆయన ఒక వారం లోపే ఆ కళలోని ప్రాథమిక పాఠాలను నేర్చుకోగలిగారు. రోజంతా వాటిని అల్లుతూ, ఆ కళ పట్టుబడే వరకు ఆ ఇసుక రంగు వెదురుతో ఆయన రకరకాల ప్రయోగాలు చేసేవారు.

"నా పొలంలో ఇప్పుడు దాదాపు 1,000 వెదురు మొక్కలున్నాయి," అని కాంబ్లే తెలిపారు. "వాటిని వివిధ కళాత్మక వస్తువుల తయారీ కోసం ఉపయోగిస్తారు. అలాగే ద్రాక్షతోటలకు కూడా సరఫరా చేస్తాను [అవి ద్రాక్ష తీగలను వాలిపోకుండా నిలబెడతాయి]." మార్కెట్ నుంచి చివా (వెదురులో స్థానిక రకం) కొనాలంటే, సంజయ్ కనీసం ఒక్కోదానికి రూ.50 చెల్లించాల్సివుంటుంది..

ఇర్లే ను తయారు చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని, సంజయ్‌ కాంబ్లేకు ఆ  పని నేర్చుకోవడానికి ఒక సంవత్సర కాలం పట్టింది.

ఈ పని, దానికి సరిపోయే ఖచ్చితమైన వెదురు మొక్కను ఎంచుకోవడంతో మొదలవుతుంది. దృఢంగా, మన్నికగా ఉంటుందని గ్రామస్తులు చివా ను ఉపయోగించడానికి ఇష్టపడతారు. కాంబ్లే తన పొలంలో ఉన్న మొక్కలను జాగ్రత్తగా పరిశీలించి, 21 అడుగుల పొడవున్న వెదురును ఎంపిక చేసుకుంటారు. మరో ఐదు నిమిషాల్లో, ఆయన సరిగ్గా దాని రెండో కణుపుకు కొంచం పైగా కత్తిరించి, దాన్ని తన భుజం మీదికి ఎత్తుకుంటారు.

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

సన్నగా చీల్చిన వెదురు బద్దలు (ఎడమ). వీటిని అడ్డంగా అమర్చి ఇర్లేగా అల్లుతారు (కుడి)

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ఎడమ: ఇర్లే ఆకారాన్ని తయారు చేయడానికి వీలుగా, వెదురు బద్దలను వంచడానికి చాలా బలం, సమయం అవసరం. కుడి: ఒక్క పొరపాటు మొత్తం పనికి అంతరాయం కలిగిస్తుంది కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు

ఆయన ఒక గది, ఒక వంటగది ఉన్న తన చీరా (ఎర్రమట్టి) ఇంటికి తిరిగి వచ్చి, ఇంటి ప్రాంగణంలో తాను పని చేసుకునే చోట వెదురును ఉంచుతారు. ఒక పర్లీ ని (ఒక రకమైన కొడవలి) ఉపయోగించి ఎగుడుదిగుడుగా ఉన్న వెదురు రెండు చివర్లనూ కత్తిరిస్తారు. తరువాత, వెదురును రెండు సమాన భాగాలుగా చీలుస్తారు, ఆ తర్వాత వేగంగా పర్లీ తో ప్రతి ముక్కను నిలువుగా చీల్చి, దాన్ని మరో రెండు ముక్కలుగా విడదీస్తారు.

పర్లీ ని ఉపయోగించి వెదురుపై ఆకుపచ్చగా ఉన్న బయటి పొరను వొలిచేసి, దాన్ని సన్నని బద్దలుగా చేస్తారు. అలాంటి అనేక బద్దలను తయారుచేయడానికి ఆయనకు కనీసం మూడు గంటలు పడుతుంది. ఆపై వాటన్నిటినీ కలిపి అల్లి, ఇర్లే ను తయారుచేస్తారు..

"బద్దల సంఖ్య ఇర్లే పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది," అని ఆయన వివరించారు. స్థూలంగా, ప్రతి ఇర్లే కు ఒక్కొక్కటి 20 అడుగుల పరిమాణంలో ఉండే మూడు వెదురు బద్దలు అవసరమవుతాయి.

కాంబ్లే 20 బద్దలను, వాటి మధ్య ఆరు సెంటీమీటర్ల ఖాళీని వదులుతూ, అడ్డంగా అమరుస్తారు. ఆ తర్వాత ఆయన వాటిపై మరికొన్ని బద్దలను నిలువుగా పరచి, చటై (చాప)ని అల్లినట్లుగా వాటిని ఒకదానితో ఒకటి కలుపుతూ అల్లడం ప్రారంభిస్తారు.

ఈ బద్దలను తయారుచేయడానికి ఈ నిపుణుడైన కళాకారుడికి స్కేల్ గానీ, కొలిచే టేప్ గానీ అవసరం లేదు. ఆయన కేవలం తన అరచేతులను మాత్రమే ఉపయోగించి ఈ పని చేస్తారు. "కొలతలు ఎంత  ఖచ్చితంగా ఉంటాయంటే, ఆ బద్దలలో కొంచెం ముక్క కూడా మిగలదు," అని వెలిగిపోతున్న మొహంతో చెప్పారు.

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ఎడమ: ఒక సూక్ష్మాకారపు ఇర్లే రేఖాకృతిని చూపిస్తోన్న సంజయ్. కుడి: అల్లటం పూర్తయిన తర్వాత, ఇర్లేను ఒక టార్పాలిన్ పట్టాతో కప్పుతారు. 2023లో, ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కారణంగా ఇర్లేల తయారీ కోసం సంజయ్‌కు తగినన్ని ఆర్డర్‌లు రాలేదు

"ఈ ఆకృతిని తయారుచేసిన తర్వాత, మీరు పక్కల నుంచి దీని అంచులను వంచాలి, దీనికి చాలా బలం అవసరం," అంటూ ఆయన కొనసాగించారు. ఒకసారి దాని ఆకృతి సిద్ధమైన తర్వాత, ఆయన ఆ బద్దల పైభాగం కూచిగా వచ్చేలా ప్రతి బద్దనూ కోణాకారంలో వంచుతారు. ఇందుకు దాదాపు ఒక గంట సేపు పడుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి ఎనిమిది గంటలు పడుతుందని ఆయన చెప్పారు.

ఈ వంచటం పూర్తయ్యాక, వర్షపు నీరు లోపలికి రాకుండా ఉండేందుకు దానిపై నీలిరంగు టార్పాలిన్ పట్టాతో కప్పుతారు. ఇర్లే ను వేసుకున్నవాళ్ళు దాని అంచులలో ఉన్న ప్లాస్టిక్ తాడుతో దాన్ని శరీరానికి బిగించుకుంటారు. అది జారిపోకుండా పట్టి ఉంచడానికి పలుచోట్ల ముడులు వేసుకుంటారు. కాంబ్లే ఒక్కో టార్పాలిన్ పట్టాను సమీపంలోని అంబా, మల్కాపూర్ పట్టణాలలో రూ.50 వంతున కొంటారు.

*****

ఇర్లే లను తయారుచేయటంతో పాటు, కాంబ్లే తన భూమిలో వరిని కూడా పండిస్తారు. పండించిన పంటలో ఎక్కువ భాగం ఆయన కుటుంబమే వినియోగించుకుంటుంది. 40 ఏళ్ళు దాటిన ఆయన భార్య మాలాబాయి, వారి సొంత పొలంలోను, ఇతరుల పొలాల్లోను కలుపు తీయడం, వరిని విత్తడం, చెరకు నాటడం, కోతలు కోయడంలో కూడా సహాయపడతారు.

"మాకు సరిపడినన్ని ఇర్లే లకు ఆర్డర్‌ రాలేదు. అయితే మేం కేవలం వరి సాగుపై మాత్రమే మనుగడ సాగించలేం కాబట్టి, నేను ఇతరుల పొలాల్లో [కూలీ] పని చేస్తున్నాను," అని ఆమె చెప్పారు. 20 ఏళ్ళు దాటిన వాళ్ళ కుమార్తెలు కరుణ, కంచన్, శుభాంగిలకు పెళ్ళిళ్ళయ్యాయి. ముంబైలో చదువుతున్న వారి కుమారుడు స్వప్నిల్, ఇర్లే లను తయారుచేయడాన్ని నేర్చుకోలేదు. "ఇక్కడ జీవనోపాధి లేకపోవడంతో వాడు నగరానికి వెళ్ళాడు" అని సంజయ్ చెప్పారు.

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ఎడమ: తన ఆదాయాన్ని పెంచుకోవడానికి సంజయ్ చేపలను నిల్వ చేయడానికి ఉపయోగించే కరండాతో సహా ఇతర వెదురు వస్తువులను తయారుచేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. కుడి: ఎడమవైపున సంజయ్ తయారుచేసిన ఖురుడ్‌ (కోళ్ళను కప్పేయడానికి ఉపయోగిస్తారు), కుడి వైపున టోప్లీ (చిన్న బుట్ట)

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ఎడమ: ఇర్లేను అల్లే సమయంలో సౌష్టవంతో ఉండేలా సంజయ్ చూసుకుంటారు. కుడి: గత మూడు దశాబ్దాలుగా ఇర్లేను అల్లే కళను నేర్చుకోవడానికి తన వద్దకు ఎవరూ రాలేదని సంజయ్ తెలిపారు

తన ఆదాయాన్ని పెంచుకోవడానికి, కాంబ్లే ఇతర వెదురు వస్తువులతో పాటు ఖురుడ్‌లు (కోళ్లను కప్పేసే బుట్ట), కరండాల ను (చేపలను నిలువ చేసే బుట్ట) తయారుచేయడంలో నైపుణ్యం సంపాదించారు. వాటిని ఆర్డర్‌పై తయారుచేస్తారు, వాటిని తీసుకోవడానికి కొనుగోలుదార్లు ఆయన ఇంటికే వస్తారు. సుమారు ఒక దశాబ్దం క్రితం, ఆయన బియ్యం నిల్వ చేయడానికి సంప్రదాయంగా ఉపయోగించే డబ్బాలలాంటి టోప్లాలు లేదా కనిగీల ను కూడా తయారుచేసేవారు. కానీ పత్రాచ డబ్బాలు (రేకు డబ్బాలు) అందుబాటులోకి వచ్చాక ఆయనకు వాటి కోసం ఆర్డర్లు రావడం ఆగిపోయింది. ఆయనిప్పుడు వాటిని కేవలం తమ ఇంటి అవసరాల కోసం మాత్రమే తయారుచేస్తున్నారు.

"ఈ నైపుణ్యాన్ని ఎవరు నేర్చుకోవాలనుకుంటారు?" కాంబ్లే తాను తయారుచేసే వస్తువుల ఫొటోలను తన ఫోన్‌లో స్క్రోల్ చేసి మాకు చూపిస్తూ ప్రశ్నించారు. “ఈ పనికి గిరాకీ లేదు, తగిన ధర కూడా లేదు. ఇంకొన్ని సంవత్సరాలలో ఈ కళ అదృశ్యమైపోతుంది," అంటూ ఆయన నిట్టూర్చారు.

ఈ కథనం మృణాళిని ముఖేర్జీ ఫౌండేషన్ వారి సహకారంతో గ్రామీణ కళాకారుల పై సంకేత్ జైన్ చేస్తోన్న సిరీస్‌లో భాగం.

అనువాదం: రవి కృష్ణ

Sanket Jain

ಸಂಕೇತ್ ಜೈನ್ ಮಹಾರಾಷ್ಟ್ರದ ಕೊಲ್ಹಾಪುರ ಮೂಲದ ಪತ್ರಕರ್ತ. ಅವರು 2022 ಪರಿ ಸೀನಿಯರ್ ಫೆಲೋ ಮತ್ತು 2019ರ ಪರಿ ಫೆಲೋ ಆಗಿದ್ದಾರೆ.

Other stories by Sanket Jain
Editor : Shaoni Sarkar

ಶಾವೋನಿ ಸರ್ಕಾರ್ ಕೋಲ್ಕತ್ತಾ ಮೂಲದ ಸ್ವತಂತ್ರ ಪತ್ರಕರ್ತೆ.

Other stories by Shaoni Sarkar
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna